Share News

రీ డిజైన్లతో తీరని ద్రోహం!

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:13 AM

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాత్మకంగా ముందు నిలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టడం న్యాయమని, ఉద్యమ ఆకాంక్షలు ప్రకటించిన పార్టీగా అది ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్మారు, అధికారం కట్టబెట్టారు...

రీ డిజైన్లతో తీరని ద్రోహం!

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాత్మకంగా ముందు నిలిచిన టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారం చేపట్టడం న్యాయమని, ఉద్యమ ఆకాంక్షలు ప్రకటించిన పార్టీగా అది ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజలు నమ్మారు, అధికారం కట్టబెట్టారు. తరువాత ఆ పార్టీ మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల మీద కక్ష గట్టిందా? అన్నట్టుగా సాగునీటి పథకాల విషయంలో ఆయా జిల్లాలను వంచనకు గురిచేసింది. మరోవైపు తెలంగాణ సమాజ పునర్నిర్మాణ ఆచరణలో తెలంగాణ ఉద్యమం నిర్లిప్తమైంది. ఇదే అదనుగా టీఆర్‌ఎస్‌ (బీఆర్‌ఎస్‌) అధికార దుర్వినియోగానికి ప్రాజెక్టుల రీ–డిజైన్‌కు, నిర్మాణంలో ఇష్టారాజ్యానికి తెగబడింది.

కృష్ణానది తొలి వరదనీటితో చేపట్టవలసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్టు పథకాన్ని, గోదావరి నీటితో తుమ్మిడిహెట్టి నుంచి చేపట్టవలసిన ప్రాణహిత–చేవెళ్ల లిఫ్టు పథకాన్ని కాంట్రాక్టు కంపెనీలతో కలిసి రీ–డిజైన్ చేసినందువల్ల తెలంగాణకు తీరని ద్రోహం, తీవ్ర నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు లిఫ్టు పథకాలతో ఎక్కువ ప్రయోజనం పొందగలిగిన రంగారెడ్డి జిల్లాకు రెండు విధాలా నష్టమే జరిగింది. కాళేశ్వరం లిఫ్టులో రంగారెడ్డిని కత్తిరించారు. పాలమూరు–రంగారెడ్డి పథకంలో లక్ష్మీదేవిపల్లిని ప్రకటించినా, చేపట్టకుండా వదిలేశారు. పెట్టుబడిదార్ల చుట్టూ, రియల్‌ ఎస్టేట్ దందా చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వాలకు రైతులకు సాగునీరు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? అనే సోయిలేక ఇంత అన్యాయం చేశారు.

నిజానికి పాలమూరు–రంగారెడ్డి, ప్రాణహిత–చేవెళ్ల లిఫ్టు పథకాలను యథారీతిన పూర్తిచేసి ఉంటే ఏ వివాదాలూ లేకుండా మూడేండ్లలో పూర్తయ్యేవి. మిగులు నిధులున్న తెలంగాణ కళకళలాడుతూ ఉండేది. పాలకుల తప్పిదానికి కృష్ణా బేసిన్‌లో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, గోదావరి బేసిన్‌లో ఆదిలాబాద్‌ జిల్లాలు మరో రెండు తరాలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేటి తరుణంలో పన్నెండేళ్ల కాలం అంటే తక్కువ కాదు.


పై రెండు పథకాలను రీ–డిజైన్ చేసి, మొదలయ్యే స్థలాన్ని నీటి లభ్యత పేరుతో మార్చారు. మరి గమ్యాన్ని అంటే చివరి స్థలాన్ని ఎందుకు మార్చినట్టు? అంతేకాక పాలమూరు–రంగారెడ్డి పథకాన్ని తొలి అడుగు నుంచే దారి మళ్ళించే విధంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు జోడించినట్టు? నాగార్జునసాగర్ నుంచి నీరు తీసుకునే అవకాశం ఉన్నా కాదని, వేలాది ఎకరాలు మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా భూములు, కల్వకుర్తి లిఫ్టు నీరు పారే భూములను ఎందుకు ముంపుబారిన పడేస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ ప్రారంభించిన ఈ అన్యాయాన్ని కాంగ్రెస్ ఎందుకు కొనసాగిస్తున్నట్టు? గత పదకొండేళ్లుగా మహబూబ్‌నగర్‌కు చెందిన అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు– పార్టీలు లేఖలు రాసినా, పోరాడినా, ఈనాటికీ వివిధ గ్రామాల రైతులు పోరాడుతున్నా ఈ అన్యాయం ఎందుకు ఆగడం లేదు? భూముల ముంపు, నీటి తరలింపు కొనసాగితే మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందుతుందా? అందకపోతే అసమానతలకు పరిష్కారం దొరుకుతుందా?

మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగం దశాబ్దాలుగా కరువు, వలసల నివారణ కోసం పోరాడుతున్నది. వారు వలసలు పోయి ప్రమాదాలలో దుర్మరణాల పాలవుతున్నారు. స్థానికంగా నీటి పెట్టుబడి తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతున్నది. ఏదుల రిజర్వాయర్ పక్కనే ఇంకో రిజర్వాయర్ కట్టవద్దని, తమ భూములను ముంచవద్దని గొల్లపల్లి, చీర్కపల్లి రైతులు ధర్నాలు చేస్తున్నారు. డిండి ఎత్తిపోతల పేరుతో నీటి తరలింపు వద్దని, ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను ముంచవద్దని రైతులు దీక్షలు చేస్తున్నారు. ఉమామహేశ్వరం రైతులు న్యాయపోరాటంలో ఉన్నారు. ఇంకోవైపున ఇథనాల్, ఫార్మా వంటి కంపెనీలతో తమ భూములు, కృష్ణానది నీళ్ళు పాడు చేయవద్దని కోరుతూ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ పోరాటాలు న్యాయమైనవి.

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు, రైతాంగం తమకు జరుగుతున్న అన్యాయాలకు, అసమానతలకు వ్యతిరేకంగా కనీస న్యాయం కోసం ఇంకా ఎంతకాలం పోరాడాలి? ప్రతిపక్షంలో ఉండి హామీలిస్తూ, అధికారం చేపట్టగానే వాటిని పట్టించుకోకపోతే అసమానతలకు పరిష్కారం దొరుకుతుందా? భూమి, గాలి, నీరు, భూగర్భ సంపద సహజ వనరులు. అవి స్థానికుల హక్కు కదా! ఆ వనరులు స్థానికులకు దక్కకుండా, వాటి ఆధారంగా వచ్చే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కకుండా ఈ జిల్లాల భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది?


కేసీఆర్ 105 అనే జీవోతో పనులు చేశారు. 72 జీవోను పక్కన పడేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు ఆరంభించాలి. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే విధానంతో ముందుకు రావాలి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయగా కేసీఆర్ పక్కన పడేసిన 72 జీవోతో– కృష్ణానది మన రాష్ట్రంలోకి రాగానే తొలి వరద నుంచి నీరు తీసుకునే చర్యలు చేపట్టి, తెలంగాణ రాష్ట్ర నీటి వాటా సాధించాలి. డిండి ఎత్తిపోతల పేరుతో పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని నల్లగొండ పథకంగా మార్చే విధానాన్ని రద్దుచేయాలి. అలాగే గోదావరి నీటిని తుమ్మిడిహెట్టి నుంచి తీసుకోవాలి. మూసీలో గోదావరి నీరు పారిస్తామని ప్రకటిస్తున్నారు గనుక ఆ నీటిని చేవెళ్ల దాకా తీసుకురావాలి. ఈ చర్యలో లక్ష్మీదేవిపల్లిని కృష్ణా–గోదావరి నదుల సంగమస్థలంగా అభివృద్ధిపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది.

ఇప్పటికీ 60–70 శాతం రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడింది. సేద్యంలో కౌలురైతులు పెరిగారు. వీరందరూ నీటికి, పెట్టుబడులకు కటకటలాడుతున్నారు. ఈ రైతుల సంక్షోభ నివారణకు నీటి వనరు కల్పించాలి. కృష్ణానది నీటిని రాష్ట్రంలో ప్రతి ఎకరాకు ఒక పంటకైనా అందించాలి, రైతుల జీవితాలను కేవలం హామీలతో సంక్షోభంలోకి నెట్టకూడదు. ‘అన్నం పెట్టే రైతు కుటుంబాల ఓట్లతో అధికారం దక్కించుకున్నందుకు వారికి సాగునీటి కల్పన కోసం ప్రభుత్వం పనిచేయా’లని డిమాండ్ చేస్తూ నేడు షాద్‌నగర్ పట్టణంలో సదస్సు జరగనుంది.

ఎం.రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 01:13 AM