తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ఎలా?
ABN , Publish Date - Jan 30 , 2026 | 02:16 AM
గద్దర్ జయంతి జనవరి 31కి సంబంధించి జనవరి 27న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గద్దర్ ఫౌండేషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ వాది పాశం యాదగిరి సహా...
గద్దర్ జయంతి జనవరి 31కి సంబంధించి జనవరి 27న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గద్దర్ ఫౌండేషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ వాది పాశం యాదగిరి సహా అనేకమంది తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి వచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు కేశవరావు జాదవ్ జయంతి సభ కూడా ప్రెస్‌క్లబ్ ఆవరణలోనే మరో హాలులో జరుగుతున్నది. మా కార్యక్రమం తర్వాత జాదవ్ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొనాలని పాశం యాదగిరి అందరినీ పురమాయించారు. దాంతో నేను జాదవ్ జయంతి సమావేశంలోనూ పాల్గొన్నాను. ఆ కార్యక్రమంలో పాశం యాదగిరి, విమలక్క, విఠల్ తదితరులంతా తెలంగాణవాదులకు జరుగుతున్న విస్మరణ, వివక్ష గురించి ఆవేశంగా ప్రసంగించారు. త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ తెర్లు అవుతున్నదనీ, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోకుంటే తిరిగి వలసాధిపత్యంలోకి వెళ్తుందనీ ఆవేదన చెందారు.
తెలంగాణ అస్తిత్వాన్ని నిలుపుకునేది ఎట్లా? అనేది గంభీరమైన ప్రశ్న. ఆరు దశాబ్దాల పోరాటాలు, త్యాగాల ఫలం తెలంగాణ. రాష్ట్ర సాధన కల నెరవేరాక, రాష్ట్ర సాధనోద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పార్టీని తెలంగాణ ప్రజలంతా ఆదరించారు, అందలమెక్కించారు. పదేండ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పాలన అందించక పోవటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. మరీ ముఖ్యంగా తెలంగాణ కోసం నిస్వార్థంగా, త్యాగపూరితంగా పనిచేసిన తెలంగాణవాదులను, ఉద్యమకారులను నాటి పాలకులు నిర్లక్ష్యం చేశారు. గద్దర్, అందెశ్రీ, కేశవరావు జాదవ్ లాంటి తెలంగాణ వాదులు, ఇందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నది అని వాపోయే దుస్థితి ఏర్పడింది. పాలకుల నియంతృత్వ పోకడలతో విసిగి వేసారిన కళాకారులు ‘ఎవని పాలైందిరో తెలంగాణ’ అని ఆవేదనతో, కన్నీటితో పాడుకున్నారు. దాంతో ఉద్యమ పార్టీగా అధికారం చలాయించిన పార్టీని చిత్తుగా ఓడించి తెలంగాణ ప్రజలు మరో పార్టీని గెలిపించారు. ఓ సామాజికవేత్త అన్నట్లు ఎన్నికల జూదంలో పార్టీలు గెలుస్తుంటే, ప్రజలు మాత్రం పదేపదే ఓడిపోతున్నారు.
తెలంగాణ వాదాన్ని నెత్తినెత్తుకొని త్యాగాలు చేసిన గద్దర్, కేశవరావు జాదవ్ లాంటి వారు ఏ పదవినీ, అధికారాన్నీ కోరుకోలేదు. ప్రజల ఆశలను, ఆకాంక్షలను ఎత్తిపడుతూ జీవితాంతం తెలంగాణ కోసం పరితపించారు. వారి త్యాగఫలమైన నేటి తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా, అది ఏ రంగు పార్టీ అయినా తెలంగాణ వాదులను గౌరవించటం ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. చివరి ఊపిరి దాకా తెలంగాణ కోసం జీవించిన వారిని గుర్తించి గౌరవించటం, మన బాధ్యత. ఈ క్రమంలో వారి త్యాగాలను చిరస్థాయిగా నిలిపేందుకు వారి పేర్లను కొన్ని సంస్థలకు, వ్యవస్థలకు పెట్టి గౌరవించుకోవటం సముచితం. ఈ నేపథ్యంలోనే, ఇటీవల కన్నుమూసిన అందెశ్రీ పేరిట ప్రభుత్వం ఘట్‌కేసర్ సమీపాన ఓ స్మృతివనం నిర్మాణాన్ని తలపెట్టటం హర్షణీయం. గద్దర్‌ను కూడా అదే విధంగా గౌరవించుకునేలా ప్రభుత్వం ముందుకు రావాలి. ఎవరితోనూ సరిపోల్చలేని వ్యక్తి గద్దర్. సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా, గాయకుడిగా, ప్రదర్శనకారుడిగా ప్రపంచంలోనే విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ ప్రత్యేకతను, విశిష్టతను గుర్తించి ప్రభుత్వం గద్దర్ స్మారక కళాక్షేత్రం నిర్మాణానికి ముందుకు రావడం ముదావహం. అయితే గద్దర్ కన్నుమూసి రెండేండ్లు గడుస్తున్నా భూమి కేటాయింపు జరగకపోవటంతో కళాక్షేత్రం నిర్మాణం ముందుకు పోవటం లేదు. తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత అందరిది. తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కారుల స్మారక చిహ్నాలను రాష్ట్రం నడిబొడ్డున నిర్మించుకుందాం. ఆ దిశగా గద్దర్ స్మారక కళాక్షేత్రం నిర్మాణం కోసం గద్దర్ ఫౌండేషన్ శక్తివంచన లేకుండా కృషి చేస్తుంది.
జీవీ సూర్యకిరణ్
వ్యవస్థాపక కార్యదర్శి, గద్దర్ ఫౌండేషన్
ఇవి కూడా చదవండి..
మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..
గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..