క్రమశిక్షణారాహిత్యంతోనే ఆర్థిక ఇబ్బందులు
ABN , Publish Date - May 21 , 2026 | 12:16 AM
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. గత అయిదారు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెల్లింపులు సహజంగానే నూతన ప్రభుత్వంపై పెను భారంగా మారాయి...
ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రభుత్వం చెల్లింపుల ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. గత అయిదారు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెల్లింపులు సహజంగానే నూతన ప్రభుత్వంపై పెను భారంగా మారాయి. కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ చుట్టూ చెక్కర్లు కొడుతున్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ బెనిఫిట్స్ చెల్లింపులకై కోర్టులను ఆశ్రయిస్తున్నారు. నూతన పీఆర్‌సీతో పాటు వాయిదాపడ్డ ఐదు డీఏలు ఇవ్వాలని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేదని అవి సేవలు నిరాకరిస్తున్నాయి.
గత పన్నెండేళ్ల నుంచి జరిగిన తప్పుడు విధానాల దుష్పరిణామాల ప్రభావం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క తేదీలో విడుదల చేసేవారు. అత్యధిక వడ్డీ రేటుతో నీటిపారుదల, విద్యుత్తు, సంక్షేమ, సామాజిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున బడ్జెట్, నాన్ బడ్జెట్ అప్పులు సేకరించారు. 2014లో 75 వేల కోట్ల రూపాయల అప్పుతో మొదలైన నూతన రాష్ట్రం, 2023 వరకు 6 లక్షల కోట్లు, 2026 నాటికి ఎనిమిది లక్షల కోట్ల రుణభారం మోయవలసి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సాధారణ చెల్లింపులే కాకుండా, అదనంగా 35 వేల కోట్ల రూపాయల వడ్డీతో పాటు అసలును వాయిదాలుగా చెల్లించవలసి వస్తున్నది. ఇందుకు తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రపంచంతో పాటు మన దేశం, రాష్ట్రం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నాయి. గతంలో భూముల ధరలు తారస్థాయికి చేరిన కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం గత మూడేళ్ల నుంచి స్తంభించి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం నమ్ముకున్న సేవా రంగాన్ని కూడా ఆర్థిక మాంద్యం కుదిపేసింది. ప్రభుత్వ రెవెన్యూ రాబడులు స్తబ్దతకు గురి అయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, పంజాబ్, హర్యానా రాష్ట్రాల వలె తెలంగాణ కూడా పారిశ్రామిక రంగంలో తగిన పురోగతి సాధించి ఉంటే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. రాష్ట్రానికి ప్రణాళిక మండలి ఉన్నా అది రాజకీయ నాయకుల పునరావాసానికే పరిమితమైంది.
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఇంకా అదనపు అప్పులు చేయడం భావితరాలకు శ్రేయస్కరం కాదు. ప్రజలపై అదనపు పన్నుల భారం వేసే పరిస్థితి లేదు, గత ప్రభుత్వం వలె విచక్షణారహితంగా ప్రభుత్వ భూములు విక్రయించనూ లేదు. నిత్యం పెరిగిపోతున్న ప్రభుత్వ ఖర్చులు, వడ్డీల భారం, జీతభత్యాల చెల్లింపులు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నెలవారీ పరిపాలన వ్యయాలు భరిస్తూ వాయిదాపడి పేరుకుపోయిన చెల్లింపుల భారం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను కుదిపి వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తర భారత రాష్ట్రాలకు, డబుల్ ఇంజన్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు ఉదారంగా ఇచ్చిన విధంగా తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిపుణులైన ఆర్థిక, సామాజిక పాలనాదక్షులతో సంప్రదించి రాష్ట్రాన్ని అప్పుల ఊబి, ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాలి.
ప్రొఫెసర్ కూరపాటి వెంకట్‌నారాయణ
ఈ వార్తలు కూడా చదవండి...
కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం
టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే
అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్
Read Latest Telangana News And AP News And International News And Telugu News