Share News

ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వంపై నిందలా?

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:26 AM

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలా? రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గితే దానికీ ప్రభుత్వమే కారణమా? తెలంగాణలో ప్రస్తుత వర్షాభావ...

ప్రకృతి వైపరీత్యానికి ప్రభుత్వంపై నిందలా?

పసిఫిక్‌ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగితే తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలా? రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గితే దానికీ ప్రభుత్వమే కారణమా? తెలంగాణలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై రాజకీయ ఆరోపణలు మొదలయ్యే ముందు సమాధానం వెతకాల్సిన ప్రశ్నలు ఇవి.

ఎల్‌నినో అంటే పసిఫిక్‌ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులకు దారితీసే ప్రకృతిపరమైన సహజ ప్రక్రియ. దీని ప్రభావం ఒక్క దేశానికో, ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, నీటి వనరులపై దీని ప్రభావం కనిపిస్తుంది. భారతదేశానికి సంబంధించి ఎల్‌నినో నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపే ముఖ్యమైన వాతావరణ కారకం.

ఎల్‌నినో ప్రభావం తెలంగాణకు కొత్తేమీ కాదు. 1982–83, 1997–98, 2002–03, 2009–10, 2014–15, 2015–16 వంటి బలమైన ఎల్‌నినో దశల్లో తెలంగాణతో పాటు దేశమంతటా రుతుపవనాల అస్థిరత, వర్షపాత లోటు, వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాలు కనిపించాయి. గత 75 ఏళ్లుగా, అంటే 1951 నుంచి 2026 మధ్య నమోదైన 16 ప్రధాన ఎల్‌నినో సందర్భాల్లో... సుమారు 10 సందర్భాల్లో తెలంగాణలో గణనీయమైన వర్షపాత లోటు నమోదైనట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే ఎల్‌నినో వచ్చిన ప్రతిసారీ కరవు తప్పదని కాదు. అయితే ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పుడు వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు, లోటు ఏర్పడే అవకాశం పెరుగుతుందని చారిత్రక అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యానికి కొనసాగింపుగానే 2026లోనూ ఈ ప్రభావం తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు సకాలంలో కురవకపోవడం, ప్రాంతాల మధ్య వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు ఉండటం, పలుచోట్ల దీర్ఘకాల పొడి వాతావరణం కొనసాగడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.

అక్టోబర్‌ మొదటి వారం నాటికి తెలంగాణలో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే సుమారు 20శాతం తక్కువ నమోదైంది. రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, సుమారు 235 మండలాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నమోదై కరవును తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షపాత లోటు, దాని ఫలితంగా తలెత్తిన నీటి కొరతను పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగా మాత్రమే చిత్రీకరించడం శాస్త్రీయంగా సమంజసం కాదు.


ఈ వర్షపాత లోటు కారణంగా భూగర్భజలాలపై ఒత్తిడి పెరగడంతో పాటు, చెరువులు పూర్తిస్థాయిలో నిండకపోవడం, నదుల ప్రవాహాలు తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో చిన్న నీటి వనరుల నుంచి ప్రధాన రిజర్వాయర్ల వరకు నీటి లభ్యత తగ్గి, వ్యవసాయం, తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి, పశుపోషణ రంగాలపై ఒత్తిడి పెరిగింది. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశాలపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గడం సహజ పరిణామంగానే చూడాలి తప్ప, దానికి రాజకీయ కోణాన్ని ఆపాదించడం సరికాదు. పరిమిత నీటి లభ్యతతో తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల మధ్య సమతుల్యత సాధించడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. రైతులకు సాగునీరు అవసరమైనప్పటికీ, రిజర్వాయర్లలో నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు తాగునీటికి ప్రాధాన్యం ఇవ్వడం అనివార్యమవుతుంది. అందువల్ల ప్రస్తుత నీటి కొరతను కేవలం రాజకీయ విమర్శల కోణంలో కాకుండా, ఎల్‌నినో ప్రభావం, వర్షపాత లోటు, రిజర్వాయర్లలోకి తగ్గిన ఇన్‌ఫ్లో వంటి వాస్తవ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి.

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ వ్యవసాయానికి మరో కీలక ప్రశ్న ఎదురైంది. నీటి లభ్యత తగ్గిన ప్రాంతాల్లో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగును కొనసాగించాలా? లేక అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలా? ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన ప్రభుత్వం, ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు గత ఏప్రిల్‌ నుంచే చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇప్పటివరకు పన్నెండుసార్లు వివిధ జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా పరిస్థితులను అంచనా వేసి అవసరమైన కార్యాచరణను రూపొందించింది. వర్షపాతంపై భారత వాతావరణశాఖ చేసిన ముందస్తు హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని, వ్యవసాయశాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ నిపుణుల సూచనలతో అత్యవసర (కంటింజెన్సీ) ప్రణాళికలను సిద్ధం చేసింది. నీటి లభ్యత తగ్గే ప్రాంతాల్లో వరి వంటి అధిక నీటి అవసరం ఉన్న పంటలపై ఆధారపడటాన్ని తగ్గించి, కందులు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు వంటి తక్కువ నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేలా సూచనలు చేసింది.


అంతేకాకుండా, జిల్లాల వారీగా నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపికపై రైతులకు మార్గదర్శకత్వం అందించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను కూడా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచింది. అందువల్ల, నీటి కొరత పరిస్థితుల్లో వరి సాగు విస్తీర్ణం తగ్గడాన్ని కేవలం ప్రభుత్వ వైఫల్యంగా పరిగణించడం సముచితం కాదు. అవసరానికి మించి ఉన్న వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి, నీటి లభ్యతకు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పరిస్థితిని ఒక అవకాశంగా మలచుకుంది. రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకునేలా సూచనలు చేస్తూ, తక్కువ నీటి అవసరం ఉన్న పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించింది. ఈ ముందస్తు చర్యల ఫలితంగా పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు విస్తీర్ణం సుమారు 30శాతం పెరగడం ఒక సానుకూల ఫలితం.

ఎల్‌నినో, వర్షాభావం వంటి సహజ వాతావరణ పరిణామాలను విస్మరించి మొత్తం సమస్యను ప్రభుత్వానికి మాత్రమే ఆపాదించడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు. ఇలాంటి విమర్శలతో రైతుల్లో ఆందోళన కలిగించే కంటే, కష్టకాలంలో వారికి భరోసా కల్పించడం అవసరం. ఎల్‌నినోను రాజకీయ అంశంగా మార్చడం కంటే, దానివల్ల ఎదురైన నీటి సంక్షోభాన్ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, రైతుల ఆదాయాన్ని ఎలా రక్షించాలి, పంటల వైవిధ్యీకరణను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్‌ నీటి భద్రతను ఎలా కాపాడాలి అనే అంశాలపై దృష్టి పెట్టడం రాష్ట్రానికి మరింత ప్రయోజనకరం.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

వ్యవసాయ ఆర్థికవేత్త

ఉపకులపతి, పీజేటీఎస్‌ఏయూ

ఇవి కూడా చదవండి..

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:26 AM