Share News

కంచే చేను మేస్తున్నది... కాపాడేదెవరు?

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:38 AM

గత రెండు సంవత్సరాల నుంచి 400కు పైగా ఉన్నతస్థాయి ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ బోనులో వేసింది. వారి ఒక్కొక్కరి ఆస్తులను మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు..

కంచే చేను మేస్తున్నది... కాపాడేదెవరు?

గత రెండు సంవత్సరాల నుంచి 400కు పైగా ఉన్నతస్థాయి ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖ బోనులో వేసింది. వారి ఒక్కొక్కరి ఆస్తులను మీడియా ద్వారా తెలుసుకున్న ప్రజలు నోళ్లు వెళ్లబెడుతున్నారు. నీటిపారుదల ఇంజనీర్లు, రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, విద్య, వైద్యం, వ్యవసాయం, మున్సిపాలిటీ అధికారులతో పాటు కొంతమంది ఐఏఎస్ అధికారులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాలికి చెప్పులు కూడా లేని కొంతమంది రాజకీయ నాయకులు ఏకంగా వేల కోట్ల రూపాయల ఆస్తులు దండుకున్న ఉదంతాలు చూస్తే ‘ఎవని పాలాయే తెలంగాణ’ అనే ఆవేదనతో తెలంగాణ ఉద్యమకారులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కిలోల కొద్దీ పసిడి, వెండి... పరుపులు, లాకర్లు, సజ్జలపై దొరుకుతున్నాయి. అవినీతిపరులు తమ బంధుమిత్రులను ఈ ఆస్తులకు బినామీలుగా మారుస్తున్నారు. ఈ అవినీతి మహమ్మారి ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబాలలో మొదలై పరిపాలనా వ్యవస్థలో అన్ని వర్గాలకు విస్తరించింది. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి అధికారులు, కొంతమంది కార్పొరేట్ సంస్థల యజమానులు, అగ్రశ్రేణి కుటుంబాల నాయకులు ‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు పరస్పర ప్రయోజనాల కోసం నిబంధనలను తుంగలో తొక్కి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిలింది.

సర్ఫేఖాస్ భూములు కొల్లగొట్టడం, ఫామ్‌హౌస్‌లు, జాగీర్లు, దుబాయ్‌లో అక్రమ ఆస్తులు... వంటి వాటికి అడ్డే లేదు. నగరాల్లో, ముఖ్యమైన జిల్లా కేంద్రాలలో ప్రైమ్ ల్యాండ్స్ భావితరాలకు మిగలకుండా నాయకులు, అధికారులు తమ సొంతం చేసుకున్న విషయం విదితమే. ఇంత విధ్వంసం జరిగినా మన రాజ్యాంగ సంస్థలు, న్యాయవ్యవస్థలు, పౌర సమాజం తగిన విధంగా స్పందించడం లేదు. రాజకీయ నేరస్థులను ప్రజలు ఓడించినప్పటికీ అవినీతి అధికారులకు ఆశించిన విధంగా శిక్షలు పడడం లేదు.


రాజకీయ నాయకులు, అవినీతి ఉన్నతాధికారులు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులను కూడగట్టినప్పుడు ఐటీ, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర నిఘా సంస్థలు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు కేవలం రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల నాయకుల పట్ల మాత్రమే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని స్వదేశానికి తెస్తానని మాటిచ్చిన వారు, కనీసం దేశంలో నల్లధనాన్ని కూడా అరికట్టలేకపోతున్నారు. అవినీతి అధికారులపై కేసులు పెట్టినా చట్టం, వ్యవస్థలలోని రకరకాల లొసుగులను ఉపయోగించుకొని నిందితులు అనతికాలంలోనే తిరిగి పదవులలో చేరుతున్నారు. ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన నాయకులకు, అధికారులకు తగిన శిక్షలు పడేలా చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.

ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ

ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:38 AM