Share News

ఎమ్మెల్యేల పక్కచూపులు!

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:53 AM

‘కొన్ని కొన్ని సినిమాలలో చిన్న పిల్లల చేత ముదురు డైలాగులు చెప్పిస్తుంటారు. అవి కొన్నిసార్లు బాగున్నట్టు ఉంటాయిగానీ ఎక్కువసార్లు ఎబ్బెట్టుగానే అనిపిస్తాయి’ అని మిత్రుడు డీఆర్కే నాకు ఒక పోస్టు పంపారు.

ఎమ్మెల్యేల పక్కచూపులు!

ముళ్ల కంపను తలపించే కాంగ్రెస్‌ రాజకీయాలలో ఎవరైనా తెలిసి తెలిసీ తల దూర్చుతారా? నేనూ అంతే! గత వారం నేను రాసిన కొత్త పలుకులో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినా ఆయన కోపంతో ఊగిపోతూ తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు.

తెలంగాణలో నాయకులను పెంచడం, తుంచడం వంటి పనులు చేస్తున్నానని రాజగోపాలరెడ్డి నన్ను నిందించారు. నాకు ఇంకేం పనిలేదా? నిజానికి తెలంగాణలో నాయకత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రె్‌సలో నాయకుల్ని ఎదగకుండా చేసింది నాడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి అప్పుడేమిటో తెలియదా?

రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజగోపాలరెడ్డి వంటి వాళ్లు ఆయన సేవలో తరిస్తున్నప్పుడు కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే అండగా నిలిచింది.

హామీ ఇచ్చి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై కొట్లాడాల్సిన రాజగోపాలరెడ్డి మీడియాపై చిర్రుబుర్రులాడితే ఏమి ప్రయోజనం? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలిగానీ మీడియాను అడ్డుపెట్టుకోవడం ఎందుకు?

ఒకటి మాత్రం నిజం. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు ఏకకాలంలో మమ్మల్ని టార్గెట్‌ చేసుకుంటున్నారంటే.. మేం అనుసరిస్తున్న మార్గం సరైనదేనని నమ్ముతున్నాం!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చినట్టే అని భావిస్తున్న బీఆర్‌ఎ్‌సకు తమ జుట్టు అందివ్వడమా? లేదా? అన్నది కాంగ్రెస్‌ నాయకులు తేల్చుకోవాలి. గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే తెలంగాణ రాజకీయాలలో వచ్చే ఏడాది అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశం కనిపిస్తోంది.


పరిస్థితులను గమనిస్తుంటే రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా? అన్న సందేహం కలుగుతోంది. అధికారం ఇంకా రెండేళ్లకు పైగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.

రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ ఉద్యమం.. ఆయన మరణానంతరం ఎగసిపడటం నిజం కాదా? ఈ కారణంగానే రాజగోపాలరెడ్డి వంటి వారు కూడా జై తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకోవడం వాస్తవం కాదా? అందుకే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్‌కే అధికారం కట్టబెట్టారు!

ఏబీఎన్‌ వంటి వంద చానళ్లను, ఆంధ్రజ్యోతి వంటి వంద పత్రికలను ప్రారంభించగలనని రాజగోపాలరెడ్డి చెప్పుకొచ్చారు. ఎవరు అడ్డుపడ్డారు మిత్రమా? వంద ఏమి ఖర్మ... వెయ్యి చానళ్లు పెట్టుకో! ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీరే ప్రకటించుకోండి! కాదనడానికి నేనెవర్ని?

సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ రేవంత్‌కు పార్టీలో సొంత వర్గమంటూ కనిపించడం లేదు. కష్టమైనా సుఖమైనా ఆయనతో కలసి నడిచేవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలియదు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేయగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోడంపై కూడా రేవంత్‌ దృష్టి పెట్టినట్లు లేదు. బలమైన నేతగా ఎదిగే ప్రయత్నం చేయకుండా ఇలా గడిపేద్దాం అని అనుకుంటే ఎవరేం చేయగలరు?


కొన్ని కొన్ని సినిమాలలో చిన్న పిల్లల చేత ముదురు డైలాగులు చెప్పిస్తుంటారు. అవి కొన్నిసార్లు బాగున్నట్టు ఉంటాయిగానీ ఎక్కువసార్లు ఎబ్బెట్టుగానే అనిపిస్తాయి’ అని మిత్రుడు డీఆర్కే నాకు ఒక పోస్టు పంపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ సంస్థలను నిందించడంతో పాటు... నాకు దమ్కీ ఇచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలను విన్నప్పుడు సదరు మిత్రుడు పంపిన పోస్టు గుర్తుకు వచ్చింది. కాంగ్రెస్‌ రాజకీయాలలో జోక్యం చేసుకుంటూ ఎవరినో పెంచడం కోసం తన వంటి నిఖార్సయిన కాంగ్రెస్‌ నాయకులను తగ్గించి చూపే ప్రయత్నం చేస్తున్నానని ఆయన నాపై నింద వేశారు. ముళ్ల కంపను తలపించే కాంగ్రెస్‌ రాజకీయాలలో ఎవరైనా తెలిసి తెలిసీ తల దూర్చుతారా? నేనూ అంతే! గత వారం నేను రాసిన కొత్త పలుకు/వీకెండ్‌ కామెంట్‌లో రాజగోపాలరెడ్డిని కించపరిచే విధంగా ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. అయినా ఆయన కోపంతో ఊగిపోతూ తన శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయవద్దని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసూయ, ద్వేషంతో రాజగోపాలరెడ్డి అడపాదడపా విమర్శలు చేస్తున్నారని నేనేమీ అనలేదే? రాజగోపాలరెడ్డి కంటే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో జూనియర్‌ ఎలా అవుతారు? రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రాజగోపాలరెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్‌ పార్టీలో చేరారని నేనేమీ ఎత్తి చూపలేదే? రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్ఠానం హామీ ఇచ్చి కూడా సదరు హామీని నిలబెట్టుకోకపోవడంతో ఫ్రస్ర్టేషన్‌తో ఆయన ముఖ్యమంత్రిని నిందిస్తున్నారని నేనేమీ అనలేదే? కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉండి, మధ్యలో రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోవడాన్ని నేనేమన్నా ఎత్తి చూపానా? కాంగ్రెస్‌ వైపు గాలి వీస్తోందని తెలుసుకొని 2023 ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్‌లో చేరడాన్ని నేనేమీ తప్పు పట్టలేదే?


కాంగ్రెస్‌ పార్టీని వీడడానికి ముందు తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెడితే ఐదు వేల కోట్ల రూపాయల వరకు నిధులు సమకూర్చుతానని అన్నప్పుడు ‘నీకంత సీన్‌ లేదుగానీ, ఐదు వందల కోట్ల రూపాయలు ఉంటే చూపించు’ అని సహచర ఎమ్మెల్యేలు ఎద్దేవా చేయడాన్ని నేనేమీ గుర్తు చేయలేదే? తాను కాంగ్రెస్‌లో చేరడం వల్లనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకొంటున్నప్పటికీ ‘‘కాంగ్రెస్‌లో చేరడంవల్లే గెలిచావు. బీజేపీలోనే ఉంటే మళ్లీ ఓడిపోయేవాడివి’’ అని నేనెక్కడా విశ్లేషించలేదే! రాజగోపాలరెడ్డి తనను తాను మరీ ఎక్కువగా ఊహించుకుంటారు అని రాయడం ద్వారా ఆయనను నేను కించపరచలేదే? ఈ క్రమంలోనే రాజగోపాల రెడ్డి మాటలు నమ్మి బీజేపీ అగ్ర నాయకత్వం ఆయనను చేర్చుకుందని, తీరా ఉప ఎన్నికల్లో ఓటమితో విషయం తెలిసిపోయి పట్టించుకోవడం మానేసిందని కొత్త పలుకు/వీకెండ్‌ కామెంట్‌లో నేనెక్కడా అనలేదే? బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు కారణమైనప్పుడు కాంట్రాక్టుల కోసమే రాజగోపాలరెడ్డి పార్టీ మారారని నిందించింది అప్పుడు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకులేగానీ నేను కాదే? ప్రజల్లో బలమైన నాయకుడిగా ఎదగడం అనేది ఆయా నాయకుల నడవడికను బట్టి ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెరగడమా? తరగడమా? అన్నది ఆయన వ్యవహారశైలిని బట్టి ఉంటుందిగానీ ఒకటి రెండు మీడియా సంస్థలు ఆ పని చేయలేవు. రేవంత్‌రెడ్డి లోపాలను కూడా నేను గత వారం నా కాలమ్‌లో ఎత్తిచూపాను. సరిదిద్దుకోవలసిన అంశాలను ప్రస్తావించాను. తాను ముఖ్యమంత్రి కావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నప్పటికీ, కనీసం మంత్రి కూడా కాలేకపోవడం ఏమిటని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని నేనెక్కడా అనలేదే? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శించడం ఏమిటి అని నేనేమీ ప్రశ్నించలేదే? కాంగ్రెస్‌ సంస్కృతి అదే కనుక అంతటి సాహసం ఎవరైనా చేస్తారా? తెలంగాణ కోసం తాను కొట్లాడానని రాజగోపాలరెడ్డి చెప్పుకుంటున్నారు. కాదని నేనేమీ అనలేదే? వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ కోసం కేసీఆర్‌ కొట్లాడుతున్నప్పుడు రాజగోపాలరెడ్డి ప్రభృతులు గొంతు కలపని విషయాన్ని నేనేమన్నా ప్రస్తావించానా? రాజశేఖరరెడ్డి ఇచ్చే కాంట్రాక్టులకు కక్కుర్తిపడే రాజగోపాలరెడ్డి వంటి వారు ఆయన పంచన చేరుతున్నారని అప్పట్లో కేసీఆర్‌ అండ్‌ కో చేసిన విమర్శలను కూడా నేను గుర్తు చేయలేదే? రాజశేఖరరెడ్డి మరణానంతరమే కదా కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ ఉద్యమబాట పట్టారు?


పెంచిందెవరు.. తుంచిందెవరు?

తెలంగాణలో నాయకులను పెంచడం, తుంచడం వంటి పనులు చేస్తున్నానని రాజగోపాలరెడ్డి నన్ను నిందించారు. నాకు ఇంకేం పనిలేదా? నిజానికి తెలంగాణలో నాయకత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్‌లో నాయకుల్ని ఎదగకుండా చేసింది నాడు రాజశేఖరరెడ్డి మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వంలో పెద్ద నాయకులుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి అప్పుడేమిటో తెలియదా? జైపాల్‌రెడ్డి వంటి బలమైన నాయకుడిని ఢిల్లీకే పరిమితం చేసింది ఎవరు? జానారెడ్డి వంటి సీనియర్‌ నాయకుడిని 2009 తర్వాత మంత్రివర్గం నుంచి తప్పించి పక్కన పడేస్తే అడిగే దిక్కు ఉండిందా? తెలంగాణలో విశ్వసనీయత ఉన్న నాయకులను ఒక పథకం ప్రకారం పక్కన పెట్టినా అడిగారా? 2009 ఎన్నికలలో తెలంగాణలో మొదటి దఫా పోలింగ్‌ ముగిశాక కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ‘హైదరాబాద్‌ వెళ్లాలంటే వీసా కావాలా?’ అని రాజశేఖరరెడ్డి ఎద్దేవా చేస్తే రాజగోపాలరెడ్డి వంటి వారు ప్రశ్నించలేదేమని నేను ఎత్తి చూపలేదే? ఆనాడు తెలంగాణలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌లో బలమైన నాయకులు లేకుండా పోవడానికి రాజశేఖరరెడ్డి కారణం కాదా? ఈ కారణంగానే రాజశేఖరరెడ్డి మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీకి బలమైన నాయకుడు లేకుండా పోయిందనేది నిజం కాదా? ఆ కారణంగానే రాజశేఖరరెడ్డి ఉన్నంత వరకు అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ ఉద్యమం... ఆయన మరణానంతరం ఎగసిపడటం నిజం కాదా? ఈ కారణంగానే రాజగోపాలరెడ్డి వంటి వారు కూడా జై తెలంగాణ నినాదాన్ని అందిపుచ్చుకోవడం వాస్తవం కాదా? అందుకే కదా తెలంగాణ ప్రత్యేక రాష్ర్టాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసినా ప్రజలు మాత్రం కేసీఆర్‌కే అధికారం కట్టబెట్టారు!


ఎవరు ఆపారు...

తన శక్తిని తక్కువగా అంచనా వేయవద్దని, ఏబీఎన్‌ వంటి వంద చానళ్లను, ఆంధ్రజ్యోతి వంటి వంద పత్రికలను ప్రారంభించగలనని రాజగోపాలరెడ్డి చెప్పుకొచ్చారు. ఎవరు అడ్డుపడ్డారు మిత్రమా? వంద ఏమి ఖర్మ... వెయ్యి చానళ్లు పెట్టుకో! ముఖ్యమంత్రిగా మిమ్మల్ని మీరే ప్రకటించుకోండి! కాదనడానికి నేనెవర్ని? రాజగోపాలరెడ్డి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటారని నేనేమన్నా అన్నానా? ఆంధ్రా మీడియా సంస్థల నుంచి సర్టిఫికెట్లు తీసుకోవాల్సిన ఖర్మ తెలంగాణ నాయకులకు పట్టలేదని రాజగోపాలరెడ్డి అంటున్నారు. రాష్ట్రం విడిపోయి పదమూడేళ్లు అవుతున్నా... ఆత్మరక్షణలో పడిన ప్రతి ఒక్కరూ ఆంధ్రా మీడియా అంటూ మాట్లాడటం ఇప్పటికీ ఫ్యాషన్‌గా కొనసాగుతోంది. రాజగోపాలరెడ్డి వంటి వాళ్లు రాజకీయాలలోకి రాక ముందు నుంచి ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక తెలంగాణ ప్రజల మన్ననలు పొందింది. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజగోపాలరెడ్డి వంటి వాళ్లు ఆయన సేవలో తరిస్తున్నప్పుడు కేసీఆర్‌ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే అండగా నిలిచింది. అయినా ఇప్పుడు ఆంధ్రా మీడియా అంటున్న రాజగోపాలరెడ్డి తన కంపెనీని తెలంగాణలో పనులకు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర రాష్ర్టాలలో టెండర్లు ఎందుకు వేస్తున్నారు? తెలంగాణకు చెందిన మీరు మా రాష్ట్రంలో టెండర్లు ఎందుకు వేస్తున్నారు? అని ఆయా రాష్ర్టాలకు చెందిన కంపెనీల వాళ్లు ప్రశ్నిస్తే రాజగోపాలరెడ్డి పరిస్థితి ఏమిటి? మంచి చదువులు, మంచి ఉద్యోగాల కోసం మన పిల్లల్ని విదేశాలకు పంపుతున్న ఈ రోజుల్లో ఇంత సంకుచితంగా ఆలోచించడం ఏమిటి? బీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ తన బిడ్డను అమెరికాలో చదివించడానికి తీసుకెళ్లడం తప్పెలా అవుతుంది? అయినా హామీ ఇచ్చి కూడా తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానంపై కొట్లాడాల్సిన రాజగోపాలరెడ్డి మీడియాపై చిర్రుబుర్రులాడితే ఏమి ప్రయోజనం? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కోపం ఉంటే ఆయనతో తేల్చుకోవాలిగానీ మీడియాను అడ్డుపెట్టుకోవడం ఎందుకు? అయినా వంద చానళ్లు, వంద పత్రికలు పెట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి మంత్రి పదవి ఏపాటి? ఒకటి మాత్రం నిజం. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులు ఏకకాలంలో మమ్మల్ని టార్గెట్‌ చేసుకుంటున్నారంటే... మేం అనుసరిస్తున్న మార్గం సరైనదేనని నమ్ముతున్నాం!


కలకలంలో కాంగ్రెస్‌

రాజగోపాలరెడ్డి వ్యవహారం అలా ఉంచితే, కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం పరిస్థితులు నానాటికీ గందరగోళంగా మారుతున్నాయి. సాధారణ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు కలసి వచ్చే విధంగా ఉన్నాయి. అందుకే ఆ పార్టీ కూడా ముఖ్యమంత్రిని విమర్శించే వారిని ప్రోత్సహిస్తోంది. రేవంత్‌రెడ్డి విషయంలో కుమార్తె సుస్మిత హద్దు మీరి మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖపై చర్య తీసుకుంటే బీసీలు కాంగ్రెస్‌కు దూరమవుతారని కేసీఆర్‌ సొంత పత్రిక ప్రచారం చేస్తోంది. అయితే, ఇదే కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి అవమానకరంగా తొలగించారు. అంతటితో ఆగకుండా రాజేందర్‌ భూములపైకి రెవెన్యూ అధికారులను ఉసిగొల్పారు. ఈ విషయాలను ఇప్పుడు గుర్తుచేస్తున్నందుకు నన్ను తెలంగాణ ద్రోహి అని నిందించినా ఆశ్చర్యం లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యతిరేకులందరూ ఇప్పుడు భారత రాష్ట్ర సమితికి ఆప్తులు. ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చినట్టే అని భావిస్తున్న బీఆర్‌ఎస్‌కు తమ జుట్టు అందివ్వడమా? లేదా? అన్నది కాంగ్రెస్‌ నాయకులు తేల్చుకోవాలి. గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే తెలంగాణ రాజకీయాలలో వచ్చే ఏడాది అనూహ్య పరిణామాలు సంభవించే అవకాశం కనిపిస్తోంది. బలమైన నాయకుడి కోసం బీజేపీ అగ్రనాయకత్వం అన్వేషణ జరుపుతూ ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బలహీనపర్చడానికి కాంగ్రెస్‌ పార్టీలోని ఆయన వ్యతిరేకులు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. పరిస్థితులను గమనిస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా? అన్న సందేహం కలుగుతోంది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అన్ని వైపుల నుంచీ పావులు కదులుతున్నాయి. రేవంత్‌రెడ్డి అధికారం కోల్పోవాలన్న బలమైన కాంక్ష బీఆర్‌ఎస్‌ది కనుక అందుకోసం ఆ పార్టీ కాంగ్రెస్‌ పార్టీలోని అసంతృప్తులను సహజంగానే ఎగదోస్తోంది.


ఇందులో ఆశ్చర్యపోవాల్సింది లేదుగానీ, అధికారం ఇంకా రెండేళ్లకు పైగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పక్క చూపులు చూడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘‘మా పార్టీలో ఏదో జరగబోతోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ వైపు చూస్తున్నారు’’ అని కాంగ్రెస్‌కు చెందిన ఒక ముఖ్యనేత చెప్పుకొచ్చారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు కూడా చెబుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఒక కీలక నేత బీజేపీతో మంతనాలు జరుపుతున్నారని, ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతను రహస్యంగా కలిశారని కూడా చెబుతున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటి నుంచే పక్కచూపులు ఎందుకు చూస్తున్నారన్నది అర్థంకాని విషయం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎన్నికలకు కొద్దిగా ముందు అధికార పార్టీ నాయకులు ఫిరాయించడం సహజం. కానీ ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండగానే ఎవరి దారి వారు చూసుకోవాలని అనుకోవడమెందుకో అంతుపట్టడం లేదు. మొత్తంగా చూస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యతిరేకులందరూ సంఘటితం అవుతున్నారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతోందా? అన్న సందేహం కూడా కలుగుతోంది. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా బాధ్యత తీసుకోవలసి ఉంటుంది. ఆయన అందర్నీ కలుపుకొని వెళ్లడం లేదన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నాయకుల్లో ఉంది. ముఖ్యమంత్రి తమను కూర్చోబెట్టుకొని ఏ విషయం కూడా చర్చించడం లేదని మంత్రులు చెబుతున్నారు. ప్రభుత్వంలో తమను పట్టించుకొనే నాథుడే లేడని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేయగల స్థితిలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉందా? అంటే అనుమానమే!


రేవంత్‌రెడ్డి పాత్ర.. బాధ్యత...

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో రేవంత్‌రెడ్డిది ప్రధాన పాత్ర అని చెప్పడంలో సందేహం లేదు. అదే సమయంలో ప్రభుత్వం సజావుగా నడవడం కూడా ముఖ్యం. ఇందుకు రేవంత్‌రెడ్డి మాత్రమే బాధ్యత తీసుకోవాలి. తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్న విషయంగానీ, పార్టీలో తన వ్యతిరేకులు పక్కచూపులు చూస్తున్న విషయంగానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలుసో లేదో తెలియదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతున్నప్పటికీ రేవంత్‌రెడ్డికి పార్టీలో సొంత వర్గమంటూ కనిపించడం లేదు. కష్టమైనా సుఖమైనా ఆయనతో కలసి నడిచేవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలియదు. కాంగ్రెస్‌ వంటి పార్టీలో ముఖ్యమంత్రికి సొంత వర్గం ఉండాల్సిందే! బలమైన మద్దతుదారులు లేని ముఖ్యమంత్రులు కాంగ్రెస్‌ పార్టీలో నిలదొక్కుకోవడం కష్టం. కారణం తెలియదుగానీ, రేవంత్‌రెడ్డి తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. ఆయన ఆధారపడుతున్నవాళ్లు కూడా అవకాశం కోసం ఎదురుచేస్తున్నవాళ్లే కానీ నమ్మకమైనవాళ్లు కారు. పార్టీ అధిష్ఠానానికి ముఖ్యమంత్రిపై ఫిర్యాదులు చేసేవాళ్లు ఇటీవలి కాలంలో పెరిగిపోయారు. అదే సమయంలో రేవంత్‌రెడ్డి తరఫున వకల్తా పుచ్చుకొని పనిచేసేవాళ్లు పెద్దగా కనిపించడంలేదు. తన కేసును తానే వాదించుకోవాల్సిన పరిస్థితిలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ వంటి వారి విషయంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కొండా సురేఖపై చర్య తీసుకోవడానికి పార్టీ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరింత బలహీనపడతారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది. అది అంతిమంగా ప్రభుత్వం బలహీనపడటానికి దారితీస్తుంది. అదుపు తప్పుతున్న పరిస్థితులను తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఏమి చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి వెంటనే దృష్టి సారించాలి. పార్టీలో క్రమశిక్షణను పాదుకొల్పలేని పక్షంలో ప్రజల్లో కాంగ్రెస్‌ పార్టీ పట్ల వ్యతిరేకత మరింత విస్తరిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలకు దీటుగా సమాధానం చెప్పడంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే వెనుకబడి ఉంది.


అనేక సందర్భాలలో సంబంధిత మంత్రులు కూడా విమర్శలను తిప్పికొట్టే విషయం పట్టించుకోవడం లేదు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను సమన్వయం చేయగలిగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోడంపై కూడా రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టినట్లు లేదు. ఏ ముఖ్యమంత్రికైనా ఇటువంటి వ్యవహారాలను పర్యవేక్షించడానికి పటిష్ఠమైన మెకానిజం ఉండాలి. అలా ఏర్పాటు చేసుకోలేని ముఖ్యమంత్రులకు ఇలాగే తలనొప్పులు వస్తుంటాయి. ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే అందుకు అనుగుణంగా మంత్రాంగం, యంత్రాంగం ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి కేంద్రీకరించాలి. లేని పక్షంలో ఇప్పుడిప్పుడే పార్టీలో మొదలైన అసంతృప్తి వచ్చే ఏడాదికి అదుపు చేయలేని స్థితికి చేరుకోవచ్చు. పార్టీ అధిష్ఠానం కూడా వెంటనే రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి పెట్టి తగిన మార్గదర్శకం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా మరింత పరిణతి ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. బలమైన నాయకుడిగా ఎదిగే ప్రయత్నం చేయకుండా ఇలా గడిపేద్దాం అని అనుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? మొత్తంగా కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇటు ముఖ్యమంత్రి, అటు అధిష్ఠానం మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎన్నికలకు ముందే పరిస్థితి చేయి దాటిపోతుంది. తస్మాత్‌ జాగ్రత్త!

Updated Date - Aug 30 , 2026 | 04:20 AM