ఇది రైతు పక్షపాత పాలన
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:50 AM
ఏ ప్రభుత్వ విజయానికైనా రైతాంగం చూపే నమ్మకమే అసలైన కొలమానం. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ నమ్మకం అక్షరాలా అంకెల్లో సాక్షాత్కరిస్తోంది. కేవలం ఒక వరి సాగు విషయానికే వస్తే, 2022–23 నాటి పరిస్థితులతో...
ఏ ప్రభుత్వ విజయానికైనా రైతాంగం చూపే నమ్మకమే అసలైన కొలమానం. గడిచిన రెండేళ్ల కాలంలో ఈ నమ్మకం అక్షరాలా అంకెల్లో సాక్షాత్కరిస్తోంది. కేవలం ఒక వరి సాగు విషయానికే వస్తే, 2022–23 నాటి పరిస్థితులతో పోలిస్తే, 2025–26 నాటికి రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం దాదాపుగా 15 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇది సాగు భూమి విస్తీర్ణం పెరగడం మాత్రమే కాదు, ‘సాగు చేస్తే నష్టం రాదు’ అనే ధీమా రైతుల్లో పెరిగిందనడానికి నిదర్శనం. వరి ఉత్పత్తి 2022–23లో 2 కోట్ల 58 లక్షల టన్నుల నుంచి నేడు 3 కోట్ల 40 లక్షల టన్నులకు పెరగడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభించింది. పెరిగిన మార్కెట్ సదుపాయాలు రైతులకు మద్దతు ధరను అందించడంలో సఫలమయ్యాయి. వరి మాత్రమేగాక, మొక్కజొన్న, జొన్న, శనగ, సోయాబీన్ లాంటి పంటల మొత్తం వ్యవసాయ ఉత్పత్తి 2022–23లో 295 లక్షల టన్నుల నుంచి నేడు 436 లక్షల టన్నులకు చేరి, ఏకంగా 48శాతం వృద్ధిని నమోదు చేయడం అద్భుతమైన ప్రగతి. ముఖ్యంగా మొక్కజొన్న సాగులో ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. గతేడాది కంటే దాదాపు రెండింతల సాగు పెరిగింది. ఉత్పత్తి చూస్తే 2022–23లో 28.65 లక్షల నుంచి 2025–26కు వచ్చేసరికి 82 లక్షల టన్నులకు చేరింది. ఈ అసాధారణ వృద్ధి అయాచితంగా వచ్చింది కాదు. ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయిలో అమలు చేసిన ప్రణాళికల ఫలితం. సకాలంలో ఎరువులూ విత్తనాల పంపిణీ, సాగునీటి నిర్వహణలో పారదర్శకత, మార్కెట్ యార్డుల్లో దళారీల దోపిడీకి అడ్డుకట్ట వేయడం, ప్రభుత్వమే పంటల కొనుగోళ్లు చేయడం, వరి పంటకు బోనస్ ఇవ్వడం... వంటి చర్యలు రైతాంగానికి కొండంత అండగా నిలిచాయి. ఈ జోరు ఇలాగే కొనసాగితే, దేశ వ్యవసాయ పటంలో తెలంగాణ చెరగని ముద్ర వేయడం ఖాయం. ప్రభుత్వం వైపు నుంచి స్థిరమైన విధానాలు, సడలని సంకల్పం ఉంటే ఎంతటి రికార్డులనైనా అధిగమించవచ్చని తెలంగాణ రైతాంగం నిరూపించింది.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రతి ఏటా ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులు ఎదుర్కొన్న నరకం అంతా ఇంతా కాదు. సరైన ప్రణాళిక లేక కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి రైతులు పడిగాపులు కాశారు. ఆ సమయంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి, కళ్లాల ముందే మొలకెత్తిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నాటి ప్రభుత్వం ఆ తడిచిన ధాన్యాన్ని కొనేందుకు నిరాకరించి, రైతులను మిల్లర్ల దయాదాక్షిణ్యాలకు వదిలేసింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం మానవతా దృక్పథంతో తడిచిన ధాన్యాన్ని సైతం వదలకుండా కొనుగోలు చేస్తాం అని ప్రకటించి ఆచరణలో చూపించింది.
బీఆర్‌ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో ‘తరుగు’ పేరిట క్వింటాలుకు 5 నుంచి 10 కిలోల వరకు అడ్డగోలు దోపిడీ జరిగేది. రైతులు గుండెలు బాదుకున్నా ఒక్కనాడూ నాటి మంత్రులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడలేదు. నేడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ స్వయంగా కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలను సైతం లెక్కచేయకుండా పర్యటిస్తూ తరుగు దోపిడీని అరికడుతున్నారు, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు తక్షణ చెల్లింపులు జరుపుతున్నారు. 2021–22 యాసంగిలో నాటి ప్రభుత్వం 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, నేటి ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు 71 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నది. ఇది కొనుగోలు పూర్తి అయ్యేనాటికి 75 లక్షలు దాటవచ్చు అనే అంచనాలు ఉన్నాయి.
గత ప్రభుత్వాలు మొక్కజొన్న రైతులను పూర్తిగా విస్మరించాయి. కానీ, తెలంగాణ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ప్రస్తుత ప్రభుత్వం మొక్కజొన్నను పెద్ద ఎత్తున మద్దతు ధరతో కొనుగోలు చేసి సంచలనం సృష్టించింది. 2022–23 యాసంగిలో 2 లక్షల 67 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 2025–26 యాసంగిలో 14 లక్షల 72 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రైతుల కళ్లలో ఆనందాన్ని నింపింది. మొక్కజొన్నే కాదు, జొన్న పంట కూడా 2022–23లో 37 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే 2025–26లో 1.05 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది ప్రస్తుత ప్రభుత్వం.
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉందా? కనీస మద్దతు ధర (MSP) ప్రకటించి చేతులు దులుపుకోవడం తప్ప, కేంద్రం దేశవ్యాప్తంగా రైతాంగానికి చేస్తున్న మేలు ఏంటి? ఈ సీజన్‌లో విపరీతమైన ఎండల కారణంగా ధాన్యం మిల్లింగ్ చేసినప్పుడు నూకల శాతం (Broken Rice) ఎక్కువగా వస్తుంది. దీనివల్ల రాష్ట్రంలోని మిల్లర్లు, ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ‘బాయిల్డ్ రైస్’ సేకరణకు అనుమతి ఇచ్చి ఉంటే ఈ సమస్య అసలు ఉండేదే కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌కు అనుమతి ఇవ్వదు గానీ, ఇక్కడి బీజేపీ నాయకులు ఈ విషయంపై మాట్లాడుతూనే ఉన్నారు.
మొక్కజొన్న పంటను కేవలం ఒక్క తెలంగాణలోనే ప్రభుత్వమే బాధ్యతగా కొనుగోలు చేస్తోంది. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న డబుల్ ఇంజన్ రాష్ట్రాలు (మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్...) ఎక్కడైనా మొక్కజొన్నను ఈ స్థాయిలో కొంటున్నాయా? రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మే స్థితిలో తెలంగాణ రైతు లేడు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు సవతి తల్లి ప్రేమను, కపట నాటకాలను పక్కనబెట్టి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయాలి.
అన్వేష్‌రెడ్డి సుంకేట
చైర్మన్, తెలంగాణ కిసాన్ కాంగ్రెస్
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News