Share News

తెలంగాణలో ‘22ఏ’ భూ బాధితుల వ్యథ

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:19 AM

కొన్నేళ్లుగా తెలంగాణలో 22ఏ చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్య సామాన్య ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వాలు, రెవెన్యూ యంత్రాంగం మారుతున్నా...

తెలంగాణలో ‘22ఏ’ భూ బాధితుల వ్యథ

కొన్నేళ్లుగా తెలంగాణలో 22ఏ చట్టం కింద నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్య సామాన్య ప్రజలకు శాపంగా మారింది. ప్రభుత్వాలు, రెవెన్యూ యంత్రాంగం మారుతున్నా ఈ సమస్య పరిష్కారం విషయంలో జరుగుతున్న జాప్యం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. భూమి రైతుకు కేవలం ఆస్తి కాదు, అది అతడి కుటుంబానికి భరోసా. పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి. అవసరమైతే అమ్ముకుని అప్పు తీర్చుకునే ఆధారం. అలాంటి భూమి రికార్డుల్లో ఒక్కసారిగా 22 ఏగా నమోదైతే ఆ కుటుంబం పరిస్థితి ఏమిటో ప్రభుత్వ కార్యాలయాల్లో కూర్చున్న అధికారులకు అర్థం కావడం లేదా?

భూ భారతి రికార్డుల ప్రకారం, రాష్ట్రంలో మొత్తం 2,49,97,312 ఎకరాల భూమి నమోదై ఉంది. ఇందులో పలు కేటగిరీలకు చెందిన 98,02,544.03 ఎకరాల భూమి 22ఏ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్నది. ప్రభుత్వానికి, ప్రైవేటు ఖాతాదారులకు మధ్య కోర్టు వివాదంలో ఉన్న భూమి 3,73,524 ఎకరాలు. అటవీ భూములు 42,61,531.32 ఎకరాలు, అసైన్డ్‌ భూములు 24,63,930.05 ఎకరాలు, ప్రభుత్వ భూములు 16,11,622.35 ఎకరాలు, చెరువులు, శిఖం కింద మరో 12,04,314.04 ఎకరాలు, ప్రభుత్వ భూముల్లో ప్రజా ఆస్తులు 1,50,749.62 ఎకరాలు, దేవాదాయ భూములు 49,143.17 ఎకరాలు, రోడ్లు 45,875.13 ఎకరాలు, ఇతర భూములు 15,378.35 ఎకరాలు కలిపి 98,02,544.03 ఎకరాల భూములు ఉన్నాయి. నిషేధిత జాబితాలో అటవీ, అసైన్డ్‌, ప్రభుత్వ, చెరువులు, శిఖం భూములే అధికంగా ఉన్నట్లు... ఆ వివరాలను రెవెన్యూ శాఖ అధికారికంగా విడుదల చేసింది. గతంలో కొన్ని భూములను ప్రజలకు లేదా సంస్థలకు ప్రభుత్వమే ఇచ్చింది. ఆ సమాచారాన్ని అప్‌‌డేట్‌ ‌చేసి ఆ భూములకు సంబంధించిన వివరాలను తీసివేయకుండా రెవెన్యూ అధికారులు హైకోర్టుకు నివేదించారు. ఆ భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


రిజిస్ట్రేషన్‌ ‌చట్టం 1908ను సవరించాలని 1999లో ప్రభుత్వం ప్రయత్నించినా దాన్ని కోర్టు నిలిపేసింది. 2007లో సవరించి మళ్లీ రిజిస్ట్రేషన్‌‌ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 22 ఏ కింద నిర్దిష్ట కేటగిరీలకు చెందిన భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చారు. ఇలాంటి భూములపై సాధారణంగా క్రయ విక్రయాలు, బదలాయింపులు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయి. ఆ కేటగిరీలో ప్రభుత్వ, అటవీ, అసైన్డ్‌, చెరువులు, శిఖం, సీలింగ్‌, దేవాదాయ, వక్ఫ్‌ వంటి భూములుంటాయి. అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని అక్రమ బదలాయింపుల నుంచి రక్షించడమే ఈ నిషేధ జాబితా ప్రధాన ఉద్దేశం. 22ఏ నిబంధన వల్లే ప్రభుత్వ భూములకు రక్షణ ఉంటుందన్న అభిప్రాయం ఉన్నది. తమ భూములు తప్పుగా 22 ఏ జాబితాలో చేరాయని భావిస్తున్న ప్రైవేటు భూ యజమానులకు ఇదే నిబంధన పెద్ద సమస్యగా మారింది. భూమి తమ సొంతమని రికార్డులు ఉన్నా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అమ్మకం, కొనుగోలు, రుణాలు, కుటుంబ అవసరాల కోసం దానిని వినియోగించుకోవడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2023–24 నుంచి ఇప్పటివరకు 23,136 ఎకరాల భూమిని 22 ఏ జాబితా నుంచి తొలగించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజల ఆస్తులను చట్టం రక్షించాల్సింది పోయి, తప్పు రికార్డుల కారణంగా ప్రజలనే ఇబ్బంది పెట్టే స్థితికి చేరింది. కలెక్టర్ కార్యాలయాలు, భూ భారతి పోర్టల్స్, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ బాధితులు కాళ్లరిగేలా తిరుగుతున్నా, అధికారులు ఒకరిపై ఒకరు బాధ్యత నెట్టుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. సమస్యను 90 శాతం పరిష్కరించామని ప్రభుత్వం చెబుతున్నది. మరి మిగిలిన పది శాతం పరిష్కారం ఎవరి బాధ్యత? అది ప్రభుత్వానికి పది శాతం కావచ్చు, కానీ ఆ కుటుంబానికి వంద శాతం జీవితం అని తెలుసుకోవాలి.

భూ బాధితులు అత్యవసర వైద్యం, పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం తమ భూమిని అమ్ముకుందామంటే వీలుకాక, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా, ప్రభుత్వ శాఖల నుంచి సరైన అఫిడవిట్లు దాఖలు కాకపోవడంతో కేసులు సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. 22 ఏ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి స్పష్టమైన మార్గదర్శకాలతో ప్రత్యేక టైమ్‌లైన్ ఏర్పాటు చేసి, అర్హులైన రైతుల భూములను జాబితా నుంచి తొలగించాలి. ఉద్దేశపూర్వకంగా తప్పు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. సాంకేతిక లోపమైతే వెంటనే సరిచేయాలి.


ప్రతి జిల్లాలో 22 ఏ జాబితాను పునఃపరిశీలించాలి. పాత రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ రికార్డులు, కోర్టు తీర్పులు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, సర్వే వివరాలను పరస్పరం అనుసంధానం చేయాలి. తప్పుగా 22 ఏలో చేర్చిన భూములను సుమోటోగా తొలగించే వ్యవస్థ ఉండాలి. భూ భారతి లక్ష్యం ప్రజలకు భూమిపై భద్రత కల్పించడం కావాలి, వారిలో భయాన్ని కలిగించడం కాదు. ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి భూ యజమాని నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే అది కేవలం సమయం వృథా కాదు, అతని ఆర్థిక జీవితమే దెబ్బతింటుంది. 22ఏ ముద్ర తొలగించడానికి ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పడం కాదు, తప్పుడు ముద్ర వేసిన వ్యవస్థే ప్రజల ఇంటికి వెళ్లి న్యాయం చేయాలి.

ముద్దగౌని అరవిందకుమార్ గౌడ్

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, తెలంగాణ

ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 02:19 AM