కర్కశత్వానికి తగిన శిక్ష!
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:18 AM
తమిళనాడులో ఆరేళ్ళ క్రితం జరిగిన ‘లాకప్ డెత్’ కేసులో ట్రయల్ కోర్టు విచారణ ముగిసి తొమ్మిది మంది పోలీసులను ముద్దాయిలుగా ఖరారు చేస్తూ మరణశిక్ష విధించడం సంచలనం కలిగించిన తీర్పు. కరోనా సమయంలో...
తమిళనాడులో ఆరేళ్ళ క్రితం జరిగిన ‘లాకప్ డెత్’ కేసులో ట్రయల్ కోర్టు విచారణ ముగిసి తొమ్మిది మంది పోలీసులను ముద్దాయిలుగా ఖరారు చేస్తూ మరణశిక్ష విధించడం సంచలనం కలిగించిన తీర్పు. కరోనా సమయంలో లాక్‌డౌన్ నిబంధనల్ని అతిక్రమించారన్న కారణంతో చిరు వ్యాపారులైన తండ్రీ కొడుకులను అరెస్ట్ చేశారు. రాత్రంతా చిత్రహింసలకు గురిచేయగా వారు ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్మార్గపు చర్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ఆందోళన నింపగా మద్రాస్ హైకోర్టు సుమోటోగా కేసుని స్వీకరించి, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఫలితంగా పోలీసుల నేరం నిరూపణ అయ్యింది. ఇంకా బాధాకరమైన విషయమేమిటంటే ఆ మృతులిద్దరూ లాక్‌డౌన్ నిబంధనల్ని కూడా అతిక్రమించలేదు, అది తప్పుడు కేసు. ఆ సంఘటనకి బాధ్యులైన 9 మందికి కోర్టు మరణశిక్ష విధించడం సరైన తీర్పు. ఇంకా పైకోర్టులో అప్పీళ్లు, న్యాయ ప్రక్రియలు పూర్తయ్యి అంతిమ తీర్పు రావడం ఎలా ఉన్నా, ప్రస్తుతానికి బాధిత కుటుంబాలకు ఊరట కలిగింది. చేయకూడని పనులు చేసే అధికారులకు ఇది ఒక హెచ్చరిక. ఇదే సమయంలో దేశం పోలీసు సంస్కరణల దిశగా కూడా ఆలోచించాలి. పౌరుల పట్ల స్నేహపూరితంగా వ్యవహరిస్తూ, చట్టాల్నీ, రూల్స్‌నీ గౌరవిస్తూ, ప్రజల నమ్మకం పొందే వ్యవస్థగా రూపుదిద్దాలి. పోలీసు వ్యవస్థ ఎలా సంస్కరింపబడాలో చెప్పే కమిషన్ సిఫార్సులు, సుప్రీం సిఫార్సులతో సహా దశాబ్దకాలంగా ఆచరణ కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిని అమలుచేసే మార్గం చూడాలి. పోలీసు వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రాజకీయ వత్తిడులు. వాటిని తగ్గించగలిగితే ఒక గాడిన పడుతుంది. పోలీసులు ఎదుర్కొంటున్న విపరీత పని వత్తిడి, సిబ్బంది లేమి, దర్యాప్తు, శాంతిభద్రతలని వేర్వేరుగా నిర్వహించే యంత్రాంగం వంటి సమస్యలు తీరుస్తూనే, తప్పుడు పనులు చేసే అధికారుల్ని వెంటనే కఠినంగా శిక్షించే ఏర్పాట్లు ఉండాలి. సమాజానికి అప్పుడే శాంతిభద్రతల భరోసా దొరుకుతుంది.
డి.వి.జి. శంకరరావు
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News