Share News

‘తమిళ విజయం’ మనకు ఆదర్శం

ABN , Publish Date - May 21 , 2026 | 12:26 AM

ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మార్పు మొదలవుతుంది. ఈ మాట తమిళనాడు రాజకీయాలలో నిజమైంది. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు అక్షరాలా సరిపోతుంది....

‘తమిళ విజయం’ మనకు ఆదర్శం

ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి మార్పు మొదలవుతుంది. ఈ మాట తమిళనాడు రాజకీయాలలో నిజమైంది. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు అక్షరాలా సరిపోతుంది. ఎన్నికలయిన దాదాపుగా ప్రతిసారి అధికార మార్పిడి జరుగుతున్నది, కానీ పాలన మారడం లేదు. పార్టీలు మారుతున్నాయి, కానీ రాజకీయ సంస్కృతి మారడం లేదు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్– పేర్లు వేరయినా ప్రజల్లో పెరుగుతున్న భావన ఒక్కటే... అవినీతి, కుటుంబాధిపత్యం, కాంట్రాక్టర్ రాజకీయం, డబ్బు పంపిణీ, అధికార దుర్వినియోగం.

ఒకప్పుడు సిద్ధాంతాల కోసం నడిచిన రాజకీయాలు ఇప్పుడు ఎన్నికల మేనేజ్‌మెంట్‌కు పరిమితమయ్యాయి. ప్రజా సమస్యల కంటే మీడియా మేనేజ్‌మెంట్‌, సోషల్ ఇంజనీరింగ్‌, డబ్బు సమీకరణ, ఓటర్లకు పంపిణీ ప్రధాన అజెండాలుగా మారాయి. ఎన్నికలప్పుడు ప్రజలను గుర్తుచేసుకునే నాయకత్వం, తర్వాత కార్పొరేట్ వర్గాలకు దగ్గరవుతోందన్న అసంతృప్తి సామాన్యుల్లో ఉంది. బీజేపీ దక్షిణాదిలో స్థిరపడేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఉత్తర భారతంలో పనిచేసిన మత రాజకీయాలు ఇక్కడ పనిచేయడం లేదు. దక్షిణ భారత సమాజం సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, భాషాభిమానం, సెక్యులర్ విలువలపై నిర్మితమైంది. ఇక్కడ ప్రజలు మత విద్వేషాల కంటే ఉద్యోగాలు, విద్య, వ్యవసాయం, ధరలు, జీవనోపాధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అయినా బీజేపీ ఒకవైపు ప్రాంతీయ పార్టీలతో రాజీ రాజకీయాలు చేస్తూనే, మరోవైపు మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తికి విస్తృత అవకాశం ఏర్పడుతోంది. అదే బీసీ, దళిత, ఆదివాసీ, ముస్లిం, బహుజన రాజకీయాలు. సంఖ్యలో మెజారిటీ అయిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు రాజకీయ అధికారంలో మాత్రం ఎందుకు మైనారిటీగా మిగిలిపోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. తమిళనాడులో విజయ్ రాజకీయ ప్రవేశం ఈ ప్రశ్నకు ఒక కొత్త దిశ చూపించింది. రాజకీయ వారసత్వం లేకుండా, సంప్రదాయ మీడియా మద్దతు లేకుండా, డబ్బు పంచకుండా, కేవలం యువత నమ్మకంతో, క్లీన్ ఇమేజ్‌తో, సోషల్ మీడియా శక్తితో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించగలిగాడు. ఆయన గెలిచింది కేవలం ఓట్లు కాదు... ప్రజల నమ్మకం, అభిమానంతో పాటు మార్పు కోసం ఎదురుచూస్తున్న యువత ఆత్మగౌరవాన్ని. ఇది తెలుగు రాష్ట్రాల బహుజన యువతకు ఒక గొప్ప సంకేతం. ‘‘మనం కూడా చేయగలం... మనం కూడా గెలవగలం’’ అనే నమ్మకం కలిగించే ఉదాహరణ.


బహుజన ఉద్యమం కేవలం కుల సంఘాల స్థాయిలో ఆగిపోకూడదు. అది ఆత్మగౌరవ ఉద్యమంగా మారాలి. బీసీలతో మొదలైన చైతన్యం ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, యువత, మహిళలు, అట్టడుగు వర్గాలందరినీ కలుపుకుంటూ విస్తరించాలి. ‘‘ఓటు మాది... సీటు మీదా?’’ అనే ప్రశ్న ప్రతి గ్రామంలో వినిపించాలి. ప్రజల హృదయాలను గెలుచుకోకుండా రాజకీయాలు గెలవలేమని అనడానికి తమిళనాడు ఉదాహరణ. డబ్బుతో కొన్ని ఓట్లు కొనవచ్చు. కానీ నమ్మకాన్ని కొనలేరు. నిజంగా డబ్బే ఎన్నికలను నిర్ణయిస్తే డబ్బున్నవాళ్లే శాశ్వతంగా అధికారంలో ఉండాలి. కానీ ప్రజాస్వామ్యంలో మార్పు జరుగుతూనే ఉంది. అంటే ప్రజలు ఇంకా ఆలోచిస్తున్నారు... ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యమానికి కేవలం ఆగ్రహం సరిపోదు. సిద్ధాంతం కావాలి. సామాజిక న్యాయం, సమానత్వం, సెక్యులరిజం, ఆత్మగౌరవం– ఇవే పునాదులు కావాలి. అంబేడ్కర్‌, ఫూలే, పెరియార్‌, కాన్షీరాం వంటి మహానుభావుల ఆలోచనలు ఉద్యమానికి దిశానిర్దేశం చేయాలి. తెలంగాణలో సర్వాయి పాపన్న, చాకలి ఐలమ్మ, సమ్మక్క–సారలక్క, దొడ్డి కొమరయ్య వంటి పోరాట యోధుల వారసత్వం ఉద్యమానికి బలం కావాలి.

ఇప్పుడు ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా కార్పొరేట్ రాజకీయాల ప్రభావంలో ఉన్న కాలం. అందుకే సోషల్ మీడియానే కొత్త తరహా ఉద్యమాల ప్రధాన ఆయుధంగా మారింది. ప్రతి గ్రామంలో ప్రతి యువకుడు ఒక ప్రచారకర్త కావాలి. ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితేనే మార్పు సాధ్యమవుతుంది. ముఖ్యంగా, బహుజన రాజకీయాలు ద్వేష రాజకీయాలు కాకూడదు. ఆగ్రహం ఉండాలి కానీ, అసభ్యత కాదు. పోరాటం ఉండాలి కానీ, విద్వేషం కాదు. గౌరవంతో కూడిన రాజకీయ భాష ప్రజలను మరింత దగ్గర చేస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పాత రాజకీయాలపై విసుగు వచ్చింది. ఇదే సరైన సమయం. బహుజన శక్తులు గ్రామగ్రామాన తిరగాలి. ప్రతి స్థానంలో పోటీ చేయాలి. ప్రజల్లో నమ్మకం నింపాలి. అధికారాన్ని అడుక్కోవడం కాదు, సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. ఎందుకంటే బహుజన భావజాలం కేవలం ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కాదు, అది సామాజిక న్యాయ భారత నిర్మాణానికి మార్గం.

జె. పూర్ణచంద్రరావు (మాజీ డీజీపీ)

ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:26 AM