పేద పిల్లల భవిష్యత్తుకు పునాది...‘తల్లికి వందనం’
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:48 AM
నవ్యాంధ్ర అక్షర యజ్ఞంలో ఒక విప్లవాత్మక ముందడుగు ‘తల్లికి వందనం’. పిల్లల చదువులకు పేదరికం ఎన్నటికీ అడ్డుగోడ కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రవేశపెట్టింది...
నవ్యాంధ్ర అక్షర యజ్ఞంలో ఒక విప్లవాత్మక ముందడుగు ‘తల్లికి వందనం’. పిల్లల చదువులకు పేదరికం ఎన్నటికీ అడ్డుగోడ కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి పేద విద్యార్థి ఇంటా చదువుల పండుగ తీసుకురావాలని, పిల్లల భవిష్యత్తును చూసి ప్రతి తల్లీ గర్వపడాలనే మహోన్నత ఆశయంతో ఈ అడుగు పడింది.
చదువు కేవలం కొందరికే పరిమితం కాకుండా, ప్రతి పేద బిడ్డకూ అందాలన్నదే ప్రభుత్వ తాపత్రయం. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో కూడా పిల్లల చదువుల కోసం అహర్నిశలూ శ్రమించే లక్షలాది మంది తల్లులకు కొండంత అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశం. ఇది కేవలం ఓట్ల కోసం తెచ్చిన పథకం కాదు, పిల్లలు పెద్దయ్యాక మంచి ఉద్యోగాల్లో స్థిరపడి, సొంత కాళ్ల మీద నిలబడడానికి వేసిన ఒక బలమైన పునాది.
గత ప్రభుత్వం ‘అమ్మ ఒడి’ పేరుతో.. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కేవలం ఒక్కరికే పథకాన్ని వర్తింపజేసి చేతులు దులుపుకుంది. ఏ తల్లి అయినా తన పిల్లల్లో ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ అని చూసుకోదు. ఆనాటి సంకుచిత విధానాలు తల్లుల మనసులను గాయపరిచాయి. ఆ వివక్షకు చరమగీతం పాడుతూ కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అత్యంత మానవీయ కోణంలో సంస్కరించింది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే, అంతమందికీ రూ.15,000 చొప్పున అందిస్తూ ప్రతి తల్లి కలను సాకారం చేస్తోంది.
ఈ బృహత్ కార్యాన్ని కేవలం మాటలకే పరిమితం చేయకుండా అత్యంత పకడ్బందీగా, భారీ బడ్జెట్‌తో కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. గత ప్రభుత్వంలో కేవలం రూ.6,450 కోట్లతో 43 లక్షల మంది విద్యార్థులకు అరకొరగా లబ్ధి చేకూరితే, నేడు కూటమి ప్రభుత్వం రూ.10,120.78 కోట్ల భారీ బడ్జెట్‌తో ఏకంగా 67.47 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం సహాయాన్ని అందిస్తున్నది. చదువుకు ప్రభుత్వం ఇస్తున్న అత్యున్నత ప్రాధాన్యానికి ఈ అంకెలే నిదర్శనం. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు బడ్జెట్‌లో చేసిన అధిక కేటాయింపుల ద్వారా ఊళ్లలో స్కూళ్ల రూపురేఖలు మార్చడానికి, టీచర్ల కొరతను తీర్చడానికి, పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు మంచి సౌకర్యాలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు మరింత బలోపేతం అవుతాయి.
గత ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమ పిల్లలకు సాయం అందడం లేదని కంటతడి పెట్టారు. వారి నిస్వార్థ శ్రమను గుర్తిస్తూ, వారి సంపాదనతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరి పిల్లలకూ ఈ సాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్రంలో అదనంగా 17 వేల మంది అంగన్‌వాడీల పిల్లలకు ఈ లబ్ధి చేకూరుతోంది.
నిధుల పంపిణీ ప్రక్రియను కూడా కేవలం ఒక ప్రభుత్వ తంతుగా కాకుండా, అత్యంత పారదర్శకమైన రీతిలో సమయపాలనతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న నిరుపేద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ జూలై 22న మొదటి విడత నిధులను జమ చేశారు. ఇందులో తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13,000, పాఠశాల నిర్వహణకు రూ.2,000 కేటాయిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తూ, ఎవరికైనా సాంకేతిక సమస్యల వల్ల సహాయం అందకపోతే జూలై 22 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు సచివాలయాల ద్వారా అభ్యంతరాల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఫిర్యాదులను పరిశీలించి, అదనపు అర్హుల జాబితాల తయారీని ఆగస్టు 4 నుంచి ఆగస్టు 10 లోగా పూర్తి చేస్తారు. కొత్తగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుల వివరాలను సైతం ఆగస్టు 25 నాటికి నమోదు చేసుకొని, ఆగస్టు 30 కల్లా నూరు శాతం నిధులను తల్లుల ఖాతాలలో చేర్చేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ అక్షర యజ్ఞం కేవలం ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం కాలేదు. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు పొందిన 1.04 లక్షల మంది నిరుపేద విద్యార్థుల తల్లులను కూడా ఈ పథకం కిందికి చేర్చారు. వారి స్కూల్ ఫీజును సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నేరుగా పాఠశాలలకు చెల్లిస్తూ, మిగిలిన మొత్తాన్ని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. ఏ ఒక్క పేద కుటుంబానికి కూడా వారి కులం వల్లనో, మతం వల్లనో వివక్ష జరగకూడదన్నదే కూటమి సిద్ధాంతం. సమాజంలో అర్హుడైన లబ్ధిదారుడు సాంకేతిక కారణాల వల్ల నష్టపోకూడదన్న తపనతో ప్రభుత్వం ‘మనమిత్ర’ వాట్సప్ చాట్ బాట్, ‘లీప్’ యాప్‌లను పరిచయం చేసింది. వీటి ద్వారా ప్రతి ఒక్కరూ తమ అర్హతలను తనిఖీ చేసుకుని, తమ హక్కును సులభంగా పొందే వీలు కల్పించింది.
కూటమి ప్రభుత్వంలో లంచాలకు, సిఫార్సులకు తావు లేకుండా కేవలం అర్హతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటోందని, రేపటి అంతర్జాతీయ వేదికలపై మన పిల్లలు విజేతలుగా నిలబడాలన్నదే ప్రభుత్వ కల అని చాటిచెబుతున్నారు. అమ్మ ప్రేమను, ఆమె పడుతున్న కష్టాన్ని గౌరవిస్తూ ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం రాబోయే తరాలకు ఒక బలమైన ఆయుధంగా నిలుస్తున్నది. రాష్ట్రాన్ని అక్షరాస్యతలో, నాలెడ్జ్ ఎకానమీలో దేశంలోనే అగ్రస్థానంలో నిలపడానికి మనమంతా కలిసికట్టుగా సాగాలనే ఆకాంక్షతో, పిల్లల తలరాతను మార్చే చదువుకు శ్రీకారం చుట్టే బాధ్యతను ప్రభుత్వం సంపూర్ణంగా తీసుకుంది.
పనబాక లక్ష్మి
కేంద్ర మాజీ మంత్రి
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News