Share News

సైక్స్–పీకోట్ ఒప్పందం.. పశ్చిమాసియా గుండెలో బాకు

ABN , Publish Date - May 16 , 2026 | 02:20 AM

నూటపది సంవత్సరాల క్రితం, మే 16, 1916నాడు, బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దానివల్ల ఇప్పటికీ మధ్య ప్రాచ్యంలో మత ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి...

సైక్స్–పీకోట్ ఒప్పందం..  పశ్చిమాసియా గుండెలో బాకు

నూటపది సంవత్సరాల క్రితం, మే 16, 1916నాడు, బ్రిటిష్, ఫ్రెంచ్ సామ్రాజ్యవాదుల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దానివల్ల ఇప్పటికీ మధ్య ప్రాచ్యంలో మత ఘర్షణలు సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా షియాలు–సున్నీల మధ్య, దక్షిణ టర్కీ, ఉత్తర సిరియా, పశ్చిమ ఇరాక్‌లో వ్యాపించి ఉన్న కుర్దులతో కుర్దిస్తాన్ కోసం, పాలస్తీనాను ఇజ్రాయెల్ దురాక్రమించడం ఇత్యాది పరిణామాలకు పునాది పడింది ఇక్కడే. ఈ రహస్య ‘సైక్స్–పీకోట్ ఒప్పందం’ ద్వారా ఆ రెండు సామ్రాజ్యాలు మధ్యప్రాచ్యపటంపై స్కేలుతో గీతగీసి దేశాల్ని పంచుకొన్నాయి. ఆ సమయంలో మధ్యప్రాచ్యంలోని చాలాభాగం టర్కీ ఓట్టోమన్ సామ్రాజ్య ఆధీనంలో ఉండేది. ఓట్టోమన్ సామ్రాజ్యాన్ని 1299లో ఓస్మాన్–1 నేతృత్వంలో ఓగూజ్ టర్కీయన్లు స్థాపించారు. 15, 16 శతాబ్దాల్లో బలమైన రాజ్యంగా పేరుగాంచింది. 16, 17 శతాబ్దాల్లో ఆస్ట్రియా రాజధాని వియన్నా ముఖద్వారం నుంచి ఆగ్నేయ యూరప్‌, మధ్య ప్రాచ్యంలో చాలా భూభాగంలో అది విస్తరించింది. హంగేరి, బాల్కన్‌, గ్రీస్‌, ఉక్రెయిన్‌లో కొంతభాగం, ఇప్పటి సిరియా, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఈజిప్ట్, ఉత్తరాఫ్రికా, పశ్చిమాఫ్రికాలోని అల్జీరియా వరకూ విస్తరించిన సామ్రాజ్యమది. ఆరు శతాబ్దాలపాటు ఏలిన ఓట్టోమన్ సామ్రాజ్యం 1922లో అంతమైంది. మొదటి ప్రపంచయుద్ధంలో ఓట్టోమన్ సామ్రాజ్యం జర్మనీ పక్షాన నిలబడింది. యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. విజేతలైన ఫ్రెంచ్, బ్రిటిష్ సామ్రాజ్యాలు టర్కీ ఓటమిని పసిగట్టి ఓట్టోమన్ సామ్రాజ్యాన్ని పంచుకొన్నాయి. చర్చల్లో బ్రిటిష్ సామ్రాజ్యం తరపున సర్‌ మార్క్ సైక్స్, ఫ్రెంచ్ తరఫున జొరెల్జెస్ పీకోట్‌లు పాల్గొనడంతో ఒప్పందానికి ఆ పేరు వచ్చింది.

ఈ ఒప్పందానికి ఒక ప్రాతిపదిక గానీ, శాస్త్రీయ దృక్పథం గానీ లేదు. మతం, భాష, జాతీయత, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు పరిగణనలోకి తీసుకోలేదు. సిరియా, ఇరాక్‌ల మధ్య ఒక అడ్డుగీత గీసి ఆ దేశాలను ఏర్పాటు చేసారు. టర్కీకి దక్షిణాన ఉన్న సిరియా, లెబనాన్, ఉత్తర ఇరాక్‌లోని కొంత భాగం ఫ్రెంచ్ ఆధీనంలోకి పోయింది. బ్రిటిష్ ఆధీనంలోకి దక్షిణ, మధ్య ఇరాక్ భాగం, జోర్డాన్‌లు వచ్చాయి. మధ్యధరా సముద్రం నుంచి భారతదేశానికి భూమార్గం కోసం ఇరాక్, మసపుటేమియా ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారు. ఈ ఒప్పందం ఆధారంగా బ్రిటిష్‌ వారు చేసిన రెండవ నమ్మకద్రోహం 1917 నవంబరు రెండున చేసిన బెల్‌ఫోర్ ఒప్పందం. యూకేలో యూదుల ఉద్యమం మేరకు పాలస్తీనా భూభాగంలో యూదుల రాజ్యస్థాపనకు దీనిద్వారా వీలు కల్పించారు. కాలక్రమంలో ఇది ఇజ్రాయెల్‌గా మారి లక్షలాది పాలస్తీనియన్లను పొట్టనపెట్టుకొంది. 1915లో సైక్స్, బ్రిటిష్ ప్రధాని హెర్బట్ ఆస్క్విత్‌తో ఒప్పందానికి సంబంధించిన సరిహద్దుల్ని ఆక్రే (ACRE) పట్టణంలోని ‘ఇ’ నుంచి చివరిలో ఉన్న కిర్కుక్ (KIRKUK) పట్టణంలోని ‘కే’ వరకూ పటంమీద తన చేతి వేలును జరుపుతూ సరిహద్దులను నిర్ణయించాలని చెప్పాడట.


అరబ్‌ జాతీయత ఎదుగుదలకు ఈ ఒప్పందం ద్రోహం చేసిందని విశ్లేషకులు భావిస్తుంటారు. అరబ్బులను ఎప్పటికైనా తిరిగి ఇస్లామిక్‌ స్టేట్ పేరిట కలుపుతామని ఐఎస్‌ఐఎస్ చెబుతున్నది. మొదటి ప్రపంచయుద్ధ సమయంలో అరబ్బులు ఓట్టోమన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆర్మీలోనూ, గెరిల్లాలుగానూ పోరాడారు. వారి సహకారాన్ని అర్థించిన బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధానంతరం స్వతంత్ర సిరియా అరబ్బుదేశాన్ని పాలస్తీనా, జోర్డాన్, లెబనాన్‌లతో కలిపి ఇస్తామని ప్రకటించినప్పటికీ అందుకు భిన్నంగా రహస్య సైక్స్ – పీకోట్ ఒప్పందం కుదుర్చుకొన్నందున, ఇప్పటికీ ఈ ఒప్పందాన్ని నమ్మకద్రోహంగానే అరబ్బులు పరిగణిస్తారు.

ఒప్పంద పర్యవసానంగా ఉత్తరాన ఫ్రాన్స్, దక్షిణాన బ్రిటిష్‌లు దేశాల్ని పంచుకొన్నాయి. మొదటి ప్రాంతం బాగ్దాద్ నుంచి దక్షిణానికి కువైట్‌ను కలుపుకొని, గల్ఫ్ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతం బ్రిటిష్ వారి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. రెండవ ప్రాంతంలో నేటి ఉత్తర ఇరాక్, జోర్డాన్, నెగెవ్ ఎడారి కలిసి, సినాయ్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ భాగం బ్రిటిష్ వారి ప్రభావంలో ఉండేది. మూడవ ప్రాంతంలో దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తరానికి మెర్సిన్, ఇస్కెందెరున్, అదానా ప్రావిన్సుల వైపు విస్తరించి ఉన్న తీరప్రాంతం ఉండేది. ఈ భాగం ఫ్రెంచ్ వారి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. నాల్గవ ప్రాంతంలో సిరియన్ ఎడారి ఉండేది. ఈ భాగం ఫ్రెంచ్ వారి ప్రభావంలో ఉండేది. ఐదవ ప్రాంతంలో ఓట్టోమన్ జెరూసలేం సంజాక్ ఉండేది. ఇది చారిత్రక పాలస్తీనా ఉత్తర భాగం. మతపరమైన ప్రాముఖ్యత కారణంగా ఇది ఒక అంతర్జాతీయ ప్రాంతంగా ఉండేది. అయితే, చరిత్రాత్మక నగరాలైన ఏకర్–హైఫాల నియంత్రణ బ్రిటన్‌కు పోయింది. ఇస్తాంబుల్‌లో, బోస్ఫరస్ జలసంధికి ఆనుకుని ఉన్న భూభాగాలలో, తూర్పు అనటోలియాలోని రష్యా సరిహద్దులకు సమీపంలో ఉన్న నాలుగు ప్రావిన్సులలో రష్యా జార్ తన వాటాను ఉంచుకుంటారని ఒప్పందంలో పేర్కొన్నారు. టర్కీ పశ్చిమ తీరాల నియంత్రణను గ్రీస్‌కు, నైరుతి ప్రాంతంపై నియంత్రణను ఇటలీకి ఇచ్చారు.


సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటిష్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలు ఆయా ఖండాల్లో వలసవాదం నుంచి విముక్తి, స్వాతంత్య్రం ప్రకటించేటప్పుడు ‘విభజించు – పాలించు’ సూత్రాన్ని అమలుపర్చాయి. తత్ఫలితంగా స్వాతంత్య్రానంతరం కూడా ఆ దేశాల్లో అభివృద్ధి జరగనీయకుండా చిచ్చుపెట్టి, ఆయుధాల సరఫరాతో ఎప్పటివలెనే దోచుకొనే విధానాన్ని అవలంబించాయి. స్వాతంత్ర్యం ఇచ్చినట్లే ఇచ్చి ఆయా దేశాల ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ స్వేచ్ఛలను హరించటమే ఇలాంటి రహస్య ఒప్పందాల ఆశయం.

బుడ్డిగ జమిందార్

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 02:20 AM