Share News

పాలకులే ఓటర్లను ఎన్నుకునే ‘సర్‌’!

ABN , Publish Date - Jun 11 , 2026 | 02:00 AM

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమైన అత్యవసర పరిస్థితి (1975–77)కి (హెబియస్‌ కార్పస్‌ కేసుగా సుప్రసిద్ధమైన) ఏడీఎమ్‌ జబల్‌పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌ శుక్లా కేసు (1976) ఎలాంటిదో... మన తరానికి...

పాలకులే ఓటర్లను ఎన్నుకునే ‘సర్‌’!

స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమైన అత్యవసర పరిస్థితి (1975–77)కి (హెబియస్‌ కార్పస్‌ కేసుగా సుప్రసిద్ధమైన) ఏడీఎమ్‌ జబల్‌పూర్‌ వర్సెస్‌ శివకాంత్‌ శుక్లా కేసు (1976) ఎలాంటిదో... మన తరానికి ఏడీఆర్‌ (అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌) కేసులో సుప్రీంకోర్టు తీర్పు అలాంటిది. దేశ పౌరులకు జీవించే హక్కును సైతం నిరాకరించిన తీర్పుకు నాటి ప్రశస్త న్యాయవేత్తలలో కొంతమంది ఎందుకు ఆమోదం తెలిపారో ఈ నాటికీ మనకు తెలియదు. ఆ తీర్పు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటన్నదికాక, ప్రతి ఒక్కరూ ఆ తీర్పు నుంచి గ్రహించిన సూచనే ముఖ్యమైనది: అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నంతవరకు పౌరుల ప్రాథమిక హక్కులకు సర్వోన్నత న్యాయస్థానం పూచీ వహించదు. సర్వాధికారాలూ కార్యనిర్వాహక వ్యవస్థవేనని ఆ తీర్పు నొక్కి చెప్పింది.

ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) ప్రక్రియ విషయమై సుప్రీంకోర్టు తీర్పు నిజమైన ప్రాముఖ్యం కూడా అదేనని చెప్పక తప్పదు. ప్రజాస్వామ్య ఎన్నికల చరిత్రలో అతిపెద్ద ఓట్ల తొలగింపునకు ఆ తీర్పు అనుమతినిచ్చింది. అంతేకాదు, ఓటర్‌ జాబితాలో కొనసాగేందుకు ఎన్ని వ్యయప్రయాసలకు లోనైనాసరే ఈసీఐ అడిగిన ధ్రువీకరణ పత్రాలను విధిగా సమర్పించాల్సిందేనని ఆ తీర్పు నిర్దేశించింది. ఓటర్‌ జాబితాల నుంచి ఎవరెవరు మినహాయించబడ్డారో పరిగణనలోకి తీసుకోనేలేదు. ప్రజాస్వామ్యానికి మౌలిక ప్రాతిపదిక అయిన ఓటుహక్కుకు వాటిల్లిన ప్రమాదంపై సర్వోన్నత న్యాయస్థానం అటువంటి వైఖరి చూపడం సమంజసమేనా? అదొక నైతిక వైఫల్యమే, సందేహం లేదు. నైతిక వైఫల్యమే ఆ తీర్పు ప్రధాన పాపమని న్యాయశాస్త్ర కోవిదుడు రుద్రాక్ష లక్రా నిక్కచ్చిగా విమర్శించారు. వయోజన పౌరులు ఓటుహక్కును కోల్పోవడం, మరింత స్పష్టంగా చెప్పాలంటే వారికి ఆ హక్కును నిరాకరించడం వల్ల ప్రజాస్వామ్యం ఎలా శోభిస్తుంది? ఈ అప్రజాస్వామిక చర్యకు బాధితులైనవారికి న్యాయం చేయవలసింది, చేసి తీరాల్సింది ఎవరు? రాజ్యాంగ సంరక్షుడు అయిన సుప్రీంకోర్టు కాదా? మరి ఆ అత్యున్నత ధర్మపీఠమే ఓటుహక్కు తొలగింపు బాధితులకు తన తలుపులను మూసివేయడం గర్హనీయం. ఏడీఆర్‌ తీర్పును భావి తరాలు ఎలా గుర్తుచేసుకుంటాయో మరి చెప్పనవసరం లేదు.


ఏడీఆర్‌ కేసులో వాదనలు వింటున్న సందర్భంగా ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్‌ బాగ్చీ ‘కోర్టు శూన్యంలో పనిచేయదు’ అని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ‘సర్‌’ ప్రక్రియ ఫలితంగా ఓటర్‌ జాబితాల నుంచి మినహాయింపునకు గురైన ఓటర్లు ఎటువంటి నిరసన ప్రదర్శనలకు దిగలేదన్న వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ వ్యాఖ్య చేశారు. న్యాయస్థానం వెలుపల సమాజంలో నిరసనలు లేవన్న వైఖరి న్యాయ విచారణ విధానాన్ని ప్రభావితం చేయలేదని ఎలా భావించగలం? వీధి నిరసనలు లేకపోవచ్చుగానీ సర్వోన్నత న్యాయస్థానం గమనంలోకి తీసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు నెలల సమీపంలోకి వచ్చినప్పుడు సర్‌ ప్రక్రియ అమలును హడావుడిగా ప్రారంభించారన్న వాస్తవాన్ని సుప్రీంకోర్టు గమనంలోకి తీసుకుని ఉండాల్సింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల విషయంలో ప్రభుత్వం యుక్తిగా సుప్రీంకోర్టుకు ప్రమేయం లేకుండా ఎలా చేసిందో కూడా గౌరవనీయ న్యాయమూర్తులు గుర్తు చేసుకుని ఉండవల్సింది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిస్సిగ్గుగా పక్షపాతవైఖరితో వ్యవహరించడాన్ని ఎలా మౌనంగా చూస్తుండిపోయారు, మిలార్డ్స్‌? బీజేపీ, ఈసీఐ మధ్య జుగల్‌ బందీని కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుని ఉండవల్సింది. ప్చ్‌, సర్వోన్నత న్యాయస్థానం ఇవేవీ చేయలేదు.

నిజమే, సర్వోన్నత న్యాయస్థానం శూన్యంలో పని చేయదు. ఏదైనా ఒక విషయంలో ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిపై రాజ్యాంగ విహితమైన ప్రతి క్రియలకు తావు లేదు అనే సూచన ఏడీఆర్‌ తీర్పులో ఉందని మీరు గ్రహిస్తే మీరు క్షమార్హులే. బెయిల్‌ లాంటి అత్యవసర ఉపశమనానికై మీరు ఇప్పటికీ న్యాయస్థానానికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. మీ బెయిల్‌ మొరను న్యాయస్థానం అంగీకరించవచ్చు కూడా. అధికారంలో ఉన్న రాజకీయ పక్షానికి పెద్ద సమస్యలు ఉత్పన్నం కాని విధంగా అప్పుడప్పుడు ఉత్తేజకర తీర్పులను ఉన్నత న్యాయస్థానాలు వెలువరించవచ్చు. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేసే ప్రయత్నాలను న్యాయవ్యవస్థ నియంత్రించగలదని మీరు భావిస్తే అది తప్పకుండా అమాయకత్వమే అవుతుంది. అత్యవసర పరిస్థితి కాలంలో వలే, మన గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ రక్షణ అత్యవసరమైన ప్రస్తుత సందర్భంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం తన రాజ్యాంగ బాధ్యతను త్యజించింది. ఇది వాస్తవం.

‘సర్‌’లో చట్టపరమైన లోపాలు తీవ్రంగా ఉన్నాయి. చట్టం నిర్దేశించిన స్థాపిత విధానాలను అది విస్మరించింది. ఓటర్ల నమోదు నిబంధన (1960)లనూ పట్టించుకోలేదు. అంతెందుకు ఓటర్ల జాబితాపై తన సొంత మాన్యువల్‌ మార్గదర్శకాలను సైతం ఉపేక్షించింది. అయినా సర్‌ను అమలుపరుస్తున్న పద్ధతులను సమర్థిస్తూ ఈసీఐ చేసిన వాదనలను సర్వోన్నత న్యాయస్థానం గుడ్డిగా విశ్వసించింది. ఆ వాదనలు విశ్వసించలేనివిగా ఉన్నాయని అనిపించినా ఆ అపనమ్మకాన్ని పక్కన పెట్టేందుకు కోర్టు సుముఖత చూపింది! ‘సర్‌’కు ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఓటర్‌ జాబితాల సవరణకు ఉన్న ప్రామాణిక విధానాలను పక్కన పెట్టి నియోజకవర్గాల వారీగా ఉన్న ఒక నిబంధనను ఈసీఐ ఉపయోగించుకున్నది.


న్యాయస్థానం ఇందుకు అంగీకరించింది. వలసలు, పట్టణీకరణ మొదలైన సాధారణ అంశాలను కూడా ఇందుకు పరిగణనలోకి తీసుకునేందుకు అనుమతించింది. ఈసీఐ కోరిన దానికంటే కూడా ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేందుకు కోర్టు వెనుకాడలేదు. ఇది ఎంతవరకు చట్టబద్ధం?

‘సర్‌’కు ప్రభుత్వ మద్దతు ఉన్నది. ఈ వాస్తవాన్ని కోర్టు గ్రహించింది. ఆ ప్రకారం దానిని సమర్థించేందుకు పూనుకున్నది! రాజకీయ అజెండాలు చట్టాలను అధిగమించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది. ఎలా జరిగిందిది? న్యాయసూత్రాలను ఉద్దేశపూర్వకంగా మార్చివేసింది. వాటికి తప్పుడు భాష్యాలు చెప్పింది. లేదూ, తప్పుగా ఉటంకించింది. ఎన్నికలు, ఓటర్‌ జాబితాల సవరణకు సంబంధించిన కేసులలో సర్వోన్నత న్యాయస్థానం గతంలో వెలువరించిన తీర్పులను పూర్తిగా ఉపేక్షించింది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే వాస్తవాలను తిరస్కరించింది. తర్కానికి తిలోదకాలు ఇచ్చింది. ఈ కారణంగా సర్‌ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలయినప్పుడు ఓటర్‌ జాబితాల నుంచి ఇంచుమించు పది కోట్ల ఓటర్లను మినహాయించే విపత్కర పరిస్థితికి ఆస్కారమేర్పడింది. గమనార్హమైన విషయమేమిటంటే ఈ సామూహిక తొలగింపులు వాస్తవ వయోజన పౌరుల జనాభాపై అధికారిక గణాంకాలకు విరుద్ధంగా ఉండడం. బిహార్‌ తుది ఓటర్‌ జాబితాలే అందుకు నిదర్శనం. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఓటర్‌ జాబితాలను సవరించడానికి బదులుగా నకిలీ, తప్పుడు వివరాలతో నింపుతున్నారని వెల్లువెత్తిన విమర్శలు ఎంత మాత్రమూ నిరాధారమైనవి కావు.

ఓటర్‌ జాబితాలలో ఎవరిని చేర్చాలి, ఎవరిని తొలగించాలి అనే విషయంలో కోర్టు జోక్యం చేసుకోలేదు. ఓటర్‌ జాబితాలను తయారు చేసే విషయంలో ఈసీఐకు పరిమితులు లేని స్వేచ్ఛనిచ్చిందని చెప్పవచ్చు. ఇదే వ్యవస్థలోని అసలు మార్పును సూచిస్తుంది. సర్‌ను సమర్థించవచ్చు. అయితే ఓటర్ల జాబితాలపై ఈసీఐ సొంత మాన్యువల్‌ను తప్పనిసరిగా అనుసరించాలని కోర్టు ఎందుకు నిర్దేశించలేదు? సర్‌ను ఎప్పుడు అమలుపరచాలి అనే విషయమై ఓటర్లకు అనుకూలమైన సమయ నిర్దేశన కూడా చేసి ఉండాల్సింది. జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశమివ్వవలసివున్నది. అలా జరిగి ఉంటే తప్పుడు కారణాలతో జాబితాల నుంచి తొలగింపబడిన ఓటర్లకు ఊరట కలిగి ఉండేది. సరైన పద్ధతులతో ఓటరుగా నమోదు కావడానికి ప్రయత్నించేందుకు వారికి వెసులుబాటు ఉండేది. ‘సర్‌’ అమలులో పారదర్శకత, బహిరంగ విచారణ ఆవశ్యకత గురించి నొక్కి చెప్పి ఉండాల్సింది. సర్‌ ప్రతి దశలోను మెషీన్‌పై చదవదగ్గ జాబితాను అందుబాటులో ఉంచాలని ఈసీఐని ఆదేశించి ఉండాల్సింది. తొలగింపబడిన ‘చట్టవిరుద్ధమైన విదేశీయుల’ సంఖ్య ఎంతో తెలపాలని కూడా ఈసీఐని అడిగి ఉండాల్సింది. ఇవన్నీ గత 75 సంవత్సరాలుగా ఈసీఐ అనుసరిస్తున్న మార్గదర్శకాలే కదా. మరి ఇప్పుడు ‘సర్‌’ విషయంలో వాటిని ఎలా పక్కన పెట్టారు?


‘సర్‌’ రాజ్యాంగ విహితమేనని, అర్హులైన ఓటర్లను రక్షించేందుకు ఈ ప్రక్రియలో విధానపరమైన భద్రతలు ఉన్నాయని నిర్ధారించిన సుప్రీంకోర్టు తీర్పు అంతిమంగా ఓటర్‌ జాబితాల నుంచి దేశవ్యాప్తంగా పది కోట్ల ఓటర్ల పేర్లను తొలగించేందుకు ప్రాతిపదికలు కల్పించింది. రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం(1950)నే కాకుండా ఓటర్ల నమోదు నియమాల(1960)ను సైతం సవరించకుండా ఈ తొలగింపులు జరిగేందుకు అనుకూలతలను సృష్టించింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విఘాతం కలిగించే మార్గదర్శకాలు, పద్ధతులను సైతం సమకూర్చింది. ఈసీఐ అండదండలతో పాలకులు ఇప్పుడు ఓటర్‌ జాబితాల నుంచి తాము ఇష్టపడని వ్యక్తుల లేదా ఒక సామాజిక సముదాయానికి చెందిన వారి ఓటుహక్కును రద్దుచేయడం సుసాధ్యమవుతుంది. ఇటువంటి పరిస్థితి దాపురించవచ్చని దశాబ్దాల క్రితమే జర్మన్‌ మహాకవి బెర్టోల్డ్‌ బ్రెఖ్ట్‌ ఊహించారు: ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడానికి బదులుగా తమకు అనుకూలంగా ఉండే ప్రజలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ పాలకులకు లభిస్తుంది!

యోగేంద్ర యాదవ్

(వ్యాసకర్త ‘స్వరాజ్‌ ఇండియా’ అధ్యక్షుడు)

ఈ వార్తలు కూడా చదవండి...

మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి

కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 11 , 2026 | 02:00 AM