Share News

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజం కాదా?

ABN , Publish Date - May 01 , 2026 | 01:53 AM

వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద ఈ ఏడాది మార్చి 9న భజనలాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఈ నోటిఫికేషన్...

సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజం కాదా?

వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 కింద ఈ ఏడాది మార్చి 9న భజనలాల్ శర్మ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన ఒక నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఈ నోటిఫికేషన్ జాతీయ చంబల్ ఘరియల్ అభయారణ్యం సరిహద్దులను మార్చింది. చంబల్ నదికి ఇరువైపులా ఉన్న 732 హెక్టార్ల భూమిని ఆంక్షల నుంచి విముక్తి చేసింది. చట్టంలోని నిబంధనలను గాలికి వదిలేసి ఈ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

పోలీసుల కంటే మెరుగైన ఆయుధాలు కలిగి ఉండి, తమకు అడ్డువచ్చిన వారిని నిర్భయంగా చంపేస్తున్న ఇసుక తవ్వకాల మాఫియాయే ‘చంబల్ ఆధునిక బందిపోట్లు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవల వ్యాఖ్యానించాల్సి వచ్చింది. చంబల్ నది లోతుల్లోకి తవ్వకాలు జరుపుతూ, జాతీయ చంబల్ ఘరియల్ అభయారణ్యంలోని సున్నితమైన ప్రవాహ జీవావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ఇసుక తవ్వకందారులు ఏ మాత్రం బలహీనులు కారని, వారి వద్ద ఆయుధ సంపత్తి ఉందని మధ్యప్రదేశ్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న వాదనకు ప్రతిస్పందనగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది.

‘‘మన సహజ వనరులను మనం కాపాడుకోలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అత్యంత విచారకరమైన విషయం. మనకు సంప్రదాయకంగా తెలిసిన దోపిడీ అనేది గతం. ఇప్పుడు ఆధునిక దోపిడీదారులు, ఈ మైనింగ్ మాఫియాలు’’ అని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘మైనింగ్ మాఫియా చేతిలో ఎంత మంది సబ్–డివిజనల్ మేజిస్ట్రేట్లు, పోలీసులు, అటవీ అధికారులు చంపబడ్డారో చూడండి... కానీ నివారణ నిర్బంధం అనే చట్టం ఒకటి ఉందని రాష్ట్రం మరిచిపోయింది’’ అని జస్టిస్ మెహతా అన్నారు.


సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఇసుక దోపిడీ గురించి నిస్సంకోచంగా వ్యాఖ్యానించారంటే బయటి ప్రపంచంలో ఈ దోపిడీ ఎంత విశృంఖలంగా జరుగుతోందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. మానవాళికి ఎంతో ప్రాణప్రదమైన నీటి వనరులను కాపాడేది ఇసుక. ఈ సత్యానికి సమాధి కట్టి నీటి వనరులను హరించివేయటం అంటే మానవుల జీవనానికి సమాధి కట్టడమే కదా! రాజస్థాన్ ప్రభుత్వం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ‘చంబల్ ఆధునిక బందిపోట్ల’కు చంబల్ ఘరియల్ అభయారణ్యంలో అపారంగా ఉన్న ఇసుక వనరులను దోచుకుపోవడానికి లైసెన్సులు జారీ చేసింది. దీనిని బట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి జల వనరులపై ఆధారపడిన ప్రజల జీవితాలను కాపాడటం కంటే బందిపోట్లను పెంచి పోషించే బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటమే ముఖ్యమని తేటతెల్లం కావడం లేదా!

‘చంబల్ ఆధునిక బందిపోట్ల’ ఆగడాలు రాజస్థాన్‌కే పరిమితం కాదు. దాదాపు అన్ని రాష్ట్రాలలో ఈ దోపిడీ జరుగుతూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇసుక మాఫియా దోపిడీ గురించి రోజూ కథనాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎందరో అధికారులు ఇసుక మాఫియా లారీ చక్రాల కింద ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ లైసెన్సుడు దోపిడీ ఫలితంగా మనకు అపారంగా ఉన్న జలవనరులు నానాటికీ అడుగంటిపోయి మారుమూల ప్రాంతాలలోని గ్రామాల ప్రజలు గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ళకొలది నడిచి వెళ్లాల్సిన దుస్థితిలో ఉన్నారు. అంతేకాదు విజయవాడ లాంటి నగరాల పక్కన నదులు, కాలువలు ప్రవహిస్తున్నా 200, 300 అడుగుల లోతున బోర్లు వేస్తే గాని నీరు దొరకని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసే విధంగా, మనకు సహజసిద్ధంగా అపారంగా ఉన్న జల వనరులను కాపాడుకోవడం కోసం ప్రజలు ఎక్కడికక్కడ ఉద్యమాలు సాగించాలి. రాజస్థాన్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే వెనక్కి తీసుకుని, సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన తీవ్ర వ్యాఖ్యలు నిజం కాకుండా చేయటానికి ఆచరణాత్మక చర్యలు చేపట్టాలి! జల వనరుల రక్షణ కోసం ప్రజలు సాగించే ఉద్యమాలకు వివిధ ప్రజా సంఘాలతో పాటు పౌరహక్కుల సంఘాలు వెన్నంటి నిలబడాలి.

ముప్పాళ్ళ భార్గవశ్రీ

సీపీఐ ఎంఎల్ నాయకులు

ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 01:53 AM