Share News

అనుచితమైన ఉచితాలెందుకు?!

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:53 AM

ఇటీవల, జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం– ఉచిత పథకాల సంస్కృతిపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడులో ఉచిత విద్యుత్ పంపిణీ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై...

అనుచితమైన ఉచితాలెందుకు?!

ఇటీవల, జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం– ఉచిత పథకాల సంస్కృతిపై ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడులో ఉచిత విద్యుత్ పంపిణీ, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. పెద్ద పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్తు అందించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించటం ప్రభుత్వ బాధ్యత అని ప్రకటించింది. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాల వెనక ఉన్నది ప్రజల కష్టార్జితమైన పన్నుల సొమ్ము అని కూడా ధర్మాసనం గుర్తుచేసింది. ఒకవైపు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలు ఇవ్వటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. సంక్షేమం పేరుతో ఆర్థిక క్రమశిక్షణను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది.

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఫిబ్రవరి 13న ఎవరూ ఊహించని విధంగా రాష్ట్రంలోని మహిళలకు రూ.5000నగదు బహుమానాన్ని ప్రకటించారు. 2023 నుంచి స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 1.13 కోట్లమంది పేద మహిళలకు నెలకు రూ.1000 చొప్పున పెన్షన్ ఇస్తున్నది. అయితే ఇప్పుడు ఒక్కసారిగా రూ.5000 ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? తమిళనాడులో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎప్పుడైనా ఎన్నికలు ప్రకటించవచ్చని, ఒకవేళ త్వరగా ప్రకటిస్తే మహిళలకు పెన్షన్ ఇవ్వటం సాధ్యం కాదని, మహిళలు ఇబ్బంది పడకుండా ఉండటానికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు కలిపి రూ.3000, రాబోయే వేసవిలో ప్రత్యేక ఫండ్‌గా రూ.2000, మొత్తం కలిపి రూ.5000 ఇస్తున్నట్లు ప్రకటించారు. పెన్షన్ తీసుకునే మహిళల సంఖ్యను కూడా 1.31 కోట్లకు పెంచారు. అంతేగాక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఇప్పుడు మహిళలకు ఇస్తున్న పెన్షన్ వెయ్యి రూపాయలను రూ.2000లకు పెంచుతానని కూడా ప్రకటించారు. గత నెలలో ఏఐఏడీఎంకే జనరల్ సెక్రెటరీ పళనిస్వామి ఇలాంటి తాయిలాలనే అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండగా పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని, కుటుంబంలోని మహిళా పెద్దకు నెలకు రూ.2000 ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే, సుప్రీంకోర్టు పైన పేర్కొన్న తీవ్రవ్యాఖ్యలు చేసింది.

నేడు కేంద్ర ప్రభుత్వం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎన్నికల ముందు ప్రకటిస్తున్న ఉచిత పథకాలన్నీ ఓట్లు రాబట్టుకోవటానికేనన్నది బహిరంగ రహస్యం. అందుకే సుప్రీంకోర్టు హెచ్చరికపై కేంద్రం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాల వరకు ఎటువంటి స్పందనా లేకుండా తేలు కుట్టిన దొంగల్లా ఉన్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వాలు సమతూకంలో నడిపిస్తేనే అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటాయని ఆర్థికవేత్తలు చెబుతూనే ఉన్నారు. కానీ వారి హెచ్చరికలు చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగానే మిగిలిపోతున్నాయి.


దోపిడీశక్తులకు కొమ్ముగాసే పాలకులు ఉన్నంతకాలం పేదవర్గాలు సంక్షేమ పథకాలు పొందటాన్ని తమ హక్కుగానే భావిస్తాయి. ఆ హక్కుల సాధన కోసం పోరాడటానికి ఏమాత్రం వెనకాడవు. అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా భూస్వామ్య వర్గాలకు ఉచితాలు ఎందుకు? అలానే మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా పోటీలు పడి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎవ్వరూ డిమాండ్ చేయలేదు. జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళల ఓట్లను దొడ్డిదారిన గుంజుకోవటానికి ఈ పథకాన్ని అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వదలిస్తే తెల్లకార్డు ఉన్న మహిళలకు అమలు చేయాలి. తద్వారా వారికి ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చినట్లు అవుతుంది. ఓట్లు రాబట్టుకోవటమే పరమ ధ్యేయంగా సంక్షేమం అర్థాన్ని పాలకులు మార్చివేశారు. ఆఖరికి అడగకుండానే ఇచ్చే ఉచిత పథకాల వల్ల కష్టపడే వర్గాలు శ్రమకు దూరమవుతున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాలలోని పాలకులూ చేసిన వాగ్దానాలను పూర్తిగా అమలుచేయలేక అయినకాడికి అప్పులు చేస్తూ ప్రభుత్వాలను సంక్షోభాల మధ్య నడుపుతున్నారు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల ప్రధాన కార్యక్రమం ఏమిటంటే, ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిన ఉచిత పథకాలను అన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగించడమే! అంతేగానీ రాష్ట్రాలను అప్పుల సుడిగుండం నుంచి బయటవేసి అభివృద్ధి పథంలో కొనసాగించటానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక సూచనలు చేయాలన్న స్పృహ ఎవ్వరిలోనూ లేదు. ఇలాంటి స్థితిలో ప్రజలు తమ ప్రాథమిక హక్కు అయిన సంక్షేమ పథకాల అమలును డిమాండ్ చేస్తూనే సమాజంలో నానాటికి పెరుగుతున్న ఆర్థిక అంతరాలను తొలగించే సామాజిక వ్యవస్థ సాధన కోసం చేయి చేయి కలిపి సమైక్యశక్తిగా ముందడుగులు వేయాలి.

ముప్పాళ్ళ భార్గవశ్రీ

‍సీపీఐ ఎంఎల్ నాయకులు

ఈ వార్తలు కూడా చదవండి..

వీల్ చైర్ నుంచి వీర యాత్ర

రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 12:53 AM