Share News

పాఠ్యాంశం తొలగిస్తే అవినీతి పోతుందా?!

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:40 AM

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ముద్రించిన ఎనిమిదో తరగతి సాంఘికశాస్త్ర పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే చాప్టర్ ఉండడాన్ని తప్పుబడుతూ...

పాఠ్యాంశం తొలగిస్తే అవినీతి పోతుందా?!

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ముద్రించిన ఎనిమిదో తరగతి సాంఘికశాస్త్ర పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే చాప్టర్ ఉండడాన్ని తప్పుబడుతూ సుప్రీంకోర్టు ఆగమేఘాల మీద ఆ మొత్తం పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశాలిచ్చింది. పుస్తకం నుంచి అవినీతి అనే చాప్టర్ తొలగించినంత మాత్రాన న్యాయవ్యవస్థ నుంచి అవినీతి తొలగిపోగలదా? చిన్నపిల్లల మనసులపై అవినీతికి సంబంధించిన అంశాల ప్రస్తావన ఎందుకు అని కొందరు వాదించవచ్చు. మరి మానవ శరీరాన్ని మొత్తం నగ్నంగా చేసి ముక్కలు ముక్కలుగా కోయనిదే యువత డాక్టర్‌ కాగలదా? నిజాన్ని దాచిపెట్టడం వల్ల, చర్చకు ఆస్కారం ఇవ్వకపోవడం వల్ల అవినీతి అంతమైపోదు.

ఇతర ఏ వ్యవస్థలలో అవినీతి ఉన్నా కూడా దానిని సరిచేయలేకపోతే న్యాయ వ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే అర్థం. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలోని కొన్ని ఉదంతాలను మనం గుర్తు చేసుకోవచ్చు. గత సంవత్సరం ఢిల్లీ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్‌వర్మ ఇంట్లో నోట్ల కట్టలు తగలబడిపోయాయి. వాటి దర్యాప్తు తూతూ మంత్రంగా జరిగింది. గతంలో గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయడం కోసం అయిదు కోట్ల రూపాయలు ఒక జడ్జీ ఇంట్లో డంప్ చేశారని బయటపడింది. 2011లో జస్టిస్ సౌమిత్ర సేన్‌ను పార్లమెంట్ తొలగించే లోపే ఆయనే రాజీనామా చేశారు. అదే సంవత్సరం జస్టిస్ పీడీ దినకరణ్‌ కూడా పార్లమెంట్ ఇంపీచ్ చేసే ముందే రాజీనామా చేశారు. 1993లో పంజాబ్ హైకోర్టు ముఖ్య న్యాయాధీశులు జస్టిస్ వి.రామస్వామి, ఆ తర్వాత కాలంలో జస్టిస్ సీఎస్ కరణం వంటి వారందరూ తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నవాళ్లే. మూడో నాలుగో తరగతి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను పై అధికారులకు ఎరగా వేసేందుకు అప్పనంగా కాజేశారంటూ ఘజియాబాద్ న్యాయస్థానంలోని ఉద్యోగులందరూ అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు.


నిజానికి అవినీతి మన పార్లమెంటరీ వ్యవస్థలోను, కార్యనిర్వహణ వ్యవస్థలోను విశ్వరూపం దాల్చింది. ఈ రెండు వ్యవస్థల ప్రభావం వలన న్యాయ వ్యవస్థ కూడా అవినీతిమయం అయిపోయింది. సామాన్యులకు కేసుల పరిష్కారంలో అందుతున్న వెసులుబాటు చాలా తక్కువ. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను నిర్దోషులుగా సీబీఐ కోర్ట్ నిర్ధారించిన అంశంలో కనీసం బెయిల్‌ మంజూరు చేయడానికి కూడా కోర్టులు గతంలో అనేక వాయిదాలు తీసుకున్నాయి. కార్యనిర్వహణ వ్యవస్థ తాలూకు అవినీతికి, కక్షపూరిత తత్వానికి, పక్షపాత ప్రభావానికీ గురయినప్పుడే ఇలా జరుగుతుంది. ఇలాంటి వాస‍్తవాలన్నీ పాఠ్యాంశాల్లో ఉంటేనే భవిష్యత్‌ తరాలు జాగ్రత్తపడతాయిగా!

దేశంలో అవినీతి ఉన్నప్పుడు దానిని చర్చలో పెట్టడానికి దిగులెందుకు? అవినీతి జరుగుతున్న అన్ని రంగాలపై అందరూ మాట్లాడాలి, విరుగుడుకై ప్రయత్నం చేయాలి. సమాజంలో పౌరులు అన్ని రకాల అంశాలపై పూర్తి స్థాయి అవగాహనను కలిగి ఉండి, తప్పిదాలను ప్రశ్నించాలన్న స్పృహ కలిగి ఉన్నప్పుడే ఆ దేశం అవినీతి రహితంగా మారగలదు.

జి.తిరుపతయ్య

ఇవీ చదవండి:

ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ

చిన్నారి ప్రాణం తీసిన బెలూన్

Updated Date - Mar 05 , 2026 | 04:42 AM