Share News

నెలసరి సమస్యకు జీవించే హక్కు దాకా వెళ్లాలా?!

ABN , Publish Date - Feb 18 , 2026 | 01:16 AM

ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆదేశాలను వెలువరిస్తూ– దేశంలో విద్యార్థినుల నెలసరి ఆరోగ్య సమస్యను భారత రాజ్యాంగంలోని జీవించే హక్కులో భాగంగా వ్యాఖ్యానించింది. ఈ నెలసరి సమస్య స్కూలు...

నెలసరి సమస్యకు జీవించే హక్కు దాకా వెళ్లాలా?!

ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆదేశాలను వెలువరిస్తూ– దేశంలో విద్యార్థినుల నెలసరి ఆరోగ్య సమస్యను భారత రాజ్యాంగంలోని జీవించే హక్కులో భాగంగా వ్యాఖ్యానించింది. ఈ నెలసరి సమస్య స్కూలు విద్యార్థినుల చదువుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు, అది వారి విద్యా హక్కునూ వారికి గల గౌరవప్రదమైన జీవించే హక్కునూ ప్రభావితం చేస్తున్నట్టేననీ, కాబట్టి పౌరుల ప్రాథమిక హక్కులకు జవాబుదారీ అయిన ప్రభుత్వాలు ఈ విషయంలో ఆడపిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించే విధానాలు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశానికి మూడు నెలల్లోగా అమలు రూపం తీసుకురావాలని గడువు విధించింది. ఈ విషయాల పర్యవేక్షణ బాధ్యతను విద్యాశాఖకూ, బాలల హక్కుల కమిషన్‌లకూ అప్పగించింది కూడా. ఈ ఆదేశాన్నొక చరిత్రాత్మకమైన ముందడుగుగా చాలామంది భావిస్తున్నారు.

ఆడపిల్లల నెలసరి ఆరోగ్య సమస్య స్కూళ్లలో వారి హాజరునూ, మానసిక స్థితినీ ప్రభావితం చేస్తున్నప్పుడు, అది వారిని పూర్తి సామర్థ్యాలతో ఎదగనీయకుండా అడ్డకోగలదు. ఆ పిల్లల కుటుంబాల ఆర్థిక స్థోమత వల్ల కూడా ఈ సమస్య ప్రభావం పెరుగుతుంది. అలా, వారికి తమ జెండరే ఒక ఆటంకం కాగా, పేదరికం మరో ప్రధాన ఆటంకం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానించాల్సిందే.

అయితే ఈ తీర్పు కొంత సంతోషాన్నీ, ఎక్కువ నిర్వేదాన్నీ కలుగజేస్తున్నది. సంతోషం ఎందుకంటే– ఇప్పుడు అరకొరగా అమలవుతున్న ఈ విధానం, కోర్టు ఆదేశాలతో మరికొంత విస్తృతంగా అమలయ్యే అవకాశం ఉంది కాబట్టి. కోర్టు చెప్పిన స్థాయిలో కాకున్నా, ప్రభుత్వాలు కనీసం విద్యార్థినులకు శానిటరీ పాడ్స్ సరఫరా చేసినా కూడా, చాలామంది పేద మధ్యతరగతి ఆడపిల్లలకు ఎంతో సహాయం చేసినట్టే. ఇక నిర్వేదం ఎందుకంటే– కోర్టులు ఎంత చెప్పినా ప్రభుత్వాల దగ్గర నుంచి ఆ స్థాయి స్పందన ఆశించే కాలం పోయింది కాబట్టి. కనీసం సగం ప్రభుత్వ స్కూళ్లలో ఇవాళ్టికీ సురక్షిత మంచినీటికీ, కనీస స్థాయి టాయిలెట్లకూ, పుస్తకాలకూ, యూనిఫారాలకే అవకాశాల్లేని పరిస్థితుల్లో స్కూళ్లలో శానిటరీ పాడ్స్ కోసం వెండింగ్ మిషన్స్ అమర్చడం, పర్యావరణహితమైన డిస్పోజబుల్ వ్యవస్థలను ఏర్పాటు చేయటం ఊహించనలవి కాని విషయాలే.

ఆడపిల్లల నెలసరి సమస్యను వ్యక్తిగతమైనదిగా కాక, అది సామాజిక సమస్య అని, ఈ విషయంలో ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత ఉందని, దానిని జీవించే హక్కులో భాగంగా వ్యాఖ్యానిస్తే తప్ప.. పాలకులు కదలని స్థితిలో ఉండటమే విచారకరం.


పౌరులు తమ వికాసానికి సంబంధించిన అంశాలను సొంతంగా నిర్వహించుకోలేక లేదా అరకొరగా మాత్రమే నిర్వహించుకుంటూ, మిగతా వారికంటే వెనుకబడిపోతుంటే ఆ లోపాన్ని సవరించే బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవడం నాగరికం, నైతికం. భారతదేశంలో పౌర రాజకీయ హక్కుల కంటే ఆర్థిక, సామాజిక హక్కులు ముందు వరుసలో ఉండాలి. విచారకరంగా, మన రాజ్యాంగం పౌర రాజకీయ హక్కులను ప్రాథమిక హక్కులుగా చేసి ఆర్థిక, సామాజిక హక్కులను ఆదేశిక సూత్రాల్లో మాత్రమే పెట్టుకోగలిగింది. ఆదేశిక సూత్రాలు పరిపాలనకు ఆదర్శాల లాంటివే కానీ, వాటిని అమలు చేసి తీరాల్సిన బాధ్యత తమకు లేదని పాలకులు భావిస్తారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చాలా కాలంగా ఈ ఆర్థిక సామాజిక హక్కులను పౌర, రాజకీయ హక్కుల్లోని అతి ముఖ్యమైన జీవించే హక్కుకు అనుసంధానం చేయటానికి తంటాలు పడుతున్నది. అలా గత 40 ఏళ్లుగా జీవించే హక్కును విస్తరింపజేస్తూ వెళ్తున్నది. జీవనోపాధి, గృహ వసతి, విద్య, వైద్యం, పర్యావరణం వంటి వాటిని కలుపుకుని ఇప్పటికి 26 అంశాలను అలా జీవించే హక్కులో భాగం చేసింది. ఈ పరంపరలో ఇప్పుడీ నెలసరి ఆరోగ్య హక్కు ఇరవై ఏడవది. తప్పనిసరి ప్రాథమిక విద్య అనే అంశం ఒక్కటే రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. మిగతావేవీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానాల పరిధి దాటి ముందుకు కదలలేదు. అసలు జీవించే హక్కునే రోజూ ఎన్‌కౌంటర్ చేస్తున్న కాలంలో ఈ కొసరు జీవించే హక్కులకు హామీ పడేదెవరు? ఒకవైపు, సమాజంలో ఆర్థిక సామాజిక అంతరాలను మరింత పెంచే పరిపాలనల మధ్య, ఏ అవసరాన్ని ఎంత పెద్ద హక్కులో భాగం చేస్తే మాత్రం పరిస్థితిలో మార్పు వస్తుందా? సామాన్య పౌరులు ఆధిపత్య వర్గాలకు కొమ్ము కాసే ప్రభుత్వాలకు వంత పాడినంతకాలం వారి పిల్లల నెలసరి సమస్య, విద్య, గౌరవాలు పాలకుల ప్రాధాన్యతల్లో, జీవించే హక్కులో భాగం అవుతాయా?

డా. ఎస్.తిరుపతయ్య

ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 18 , 2026 | 01:16 AM