సూర్యరశ్మి సరిపోవటం లేదు!
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:26 AM
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, భారత వాతావరణ శాఖ ఈ మూడు సంస్థలకు చెందిన ఆరుగురు భారతీయ శాస్త్రవేత్తలు నిర్వహించిన కొత్త అధ్యయనం...
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ, భారత వాతావరణ శాఖ ఈ మూడు సంస్థలకు చెందిన ఆరుగురు భారతీయ శాస్త్రవేత్తలు నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం 1988 నుంచి 2018 వరకు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో నేరుగా భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోతోంది. అంటే వార్షిక సూర్యకాంతి గంటలు తగ్గిపోతున్నాయి. భూమి మీద నేరుగా పడే సూర్యకాంతి తీవ్రత నిర్దిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉండే సమయాన్ని (సాధారణంగా 120 W/m²), గంటల్లో కొలిచి నమోదు చేస్తారు. ఒక సంవత్సరంలో ఈ సమయం మొత్తం ఎన్ని గంటలు ఉంటుందో దానిని ‘వార్షిక సూర్యకాంతి గంటలు’ అంటారు. దేశంలోని 20 వాతావరణ కేంద్రాల నుంచి సేకరించిన డేటా ప్రకారం ఈ నిర్ధారణకు వచ్చారు. కేవలం భారతదేశ ఈశాన్య ప్రాంతంలో మాత్రమే ‘వార్షిక సూర్యకాంతి గంటలు’ కొన్ని కాలాల్లో స్వల్పంగా మెరుగుపడ్డాయి. తూర్పు తీరం, డెక్కన్ పీఠభూమి ప్రాంతంలో సంవత్సరానికి 4.9, 3.1 గంటలు తగ్గాయి. పశ్చిమతీర ప్రాంతంలో సూర్యకాంతి గంటలు సంవత్సరానికి 8.6 గంటలు తగ్గాయి. అయితే ఉత్తర భారత మైదానాల్లో అత్యంత తీవ్రమైన తగ్గుదల సంవత్సరానికి 13.1 గంటలుగా నమోదైనది.
భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోవటానికి ప్రధాన కారణం గాలిలో ‘ఏరోసోల్స్’ కణాల సాంద్రత పెరగటం. ఏరోసోల్స్ అంటే గాలిలో తేలియాడుతూ ఉండే ఘన పదార్థాలు లేదా ద్రవ బిందువులు. ఇవి కంటికి కనిపించవు, లేదా చాలా తక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు పొగ, మంచు. ఈ ఏరోసోల్స్ పరిశ్రమల ఉద్గారాలు, వాహన ఉద్గారాలు, పంట వ్యర్థాలు, బొగ్గు కాల్చటం ద్వారా గాలిలోకి విడుదల అవుతాయి. వాతావరణంలోని నీటి ఆవిరి ‘ఏరోసోల్స్’ చుట్టూ వచ్చి చేరటం వల్ల, చిన్న చిన్న ద్రవ బిందువులుగా మారి మేఘాలు ఏర్పడతాయి. సహజంగా మేఘాలలోని చిన్న చిన్న ద్రవ నీటి బిందువులు ఒకదానితో మరొకటి కలసిపోయి పెద్ద పెద్ద నీటిబిందువులుగా మారి వాటి బరువు పెరిగి మేఘాలు వర్షిస్తాయి. కానీ ఏరోసోల్స్ ఎక్కువైతే నీటిబిందువుల సంఖ్య పెరుగుతుంది కానీ ప్రతి నీటిబిందువు చాలా చిన్నగా ఏర్పడుతుంది. ఇవి సులభంగా ఒకదానితో ఒకటి కలిసిపోకపోవడం వల్ల వర్షం ఏర్పడడం ఆలస్యం అవుతుంది. దీని వల్ల మేఘాలు ఎక్కువసేపు ఉండిపోయి, సూర్యకాంతి భూమిపై పడకుండా అడ్డుకుంటాయి.
ఈ కారణంగానే ఋతుపవనాల సమయమైన జూన్ నుండి సెప్టెంబర్ వరకు భూమిపై పడే సూర్యరశ్మి సమయం బాగా తగ్గిపోయిందని అధ్యయనం పేర్కొంది. ఋతుపవనాల సమయంలో ఆకాశం నిరంతరం మేఘావృతమై ఉండటం, వర్షం లేని రోజుల్లో కూడా ఆకాశం తరచుగా మేఘావృతం కావటాన్ని ఈ పరిశోధనలో గమనించారు. దీనికి కారణం కాలుష్యం వల్ల గాలిలో ‘ఏరోసోల్స్’ సాంద్రత పెరగటం. ఈ పరిశోధనలో అక్టోబర్ నుండి మే వరకు భూమిపై పడే సూర్యరశ్మి సమయం పెరిగిందని తెలిసింది. దాని కారణంగా గాలి కాలుష్యం తగ్గిందనో లేక ఏరోసోల్స్ సాంద్రత తగ్గిందనో భావించలేం. శీతాకాలంలో పొగమంచు వల్ల సూర్యకాంతి తీవ్రత తగ్గుతుంది, కానీ పూర్తిగా నిరోధించబడదు. అందువల్ల ఈ కాలంలో భూమిపై పడే సూర్యకాంతి తీవ్రతను వార్షిక సూర్యకాంతి గంటలుగా పరికరాలు నమోదు చేసుకొంటాయి. ఈ పరిశోధన అధ్యయన కాలం 2018 వరకు అయినా ఇటువంటి ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది.
ప్రస్తుతం భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో సౌరశక్తి వాటా 47 శాతం. 2030 నాటికి 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తగ్గుముఖం పడుతున్న సూర్యరశ్మి వల్ల దేశ సౌరశక్తి ఉత్పత్తి ఆశలపై నీలినీడలు కమ్మే ప్రమాదం ఉంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి దేశ వార్షిక సౌరశక్తి ఉత్పత్తిని 6-28 టెరావాట్ గంటల విద్యుత్తు మేర పెంచగలదని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ఇది లక్షలాది ఇళ్లకు ఒక సంవత్సరం పాటు విద్యుత్తును అందించడానికి సరిపోతుంది. భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గటం వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆహార సంక్షోభానికి దారితీస్తుంది. దేశంలోని అత్యంత కలుషిత ప్రాంతాలలో ప్రధానంగా వరి, గోధుమ పంటలలో సుమారు 36–50శాతం నష్టానికి ఇది కారణమవుతోంది. భూగోళానికి ప్రధాన శక్తి వనరు సూర్యుడు. భారతదేశం వంటి అధిక కాలుష్య దేశాలు సూర్యునిశక్తిని పొందే అవకాశాన్ని క్రమేపీ కోల్పోతున్నాయి. భూమిపై పడే సూర్యరశ్మి సమయం తగ్గిపోవటం వలన భవిష్యత్తులో అనేక పర్యావరణ సమస్యలు కలిగే అవకాశముంది.
డా. శ్రీధరాల రాము
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News