Share News

Revanth Reddy Governance: ఇల్లు బాగుంది, ఇక పల్లె బాగుండాలి

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:42 AM

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా స్పష్టమైంది. ఇటు సొంత పార్టీ నేతలు, అటు విపక్ష నాయకుల వ్యూహాల మధ్య బలమైన నేతగా గుర్తింపు...

Revanth Reddy Governance:  ఇల్లు బాగుంది, ఇక పల్లె బాగుండాలి

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా స్పష్టమైంది. ఇటు సొంత పార్టీ నేతలు, అటు విపక్ష నాయకుల వ్యూహాల మధ్య బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం సఫలమైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో ఎవరి స్థానం ఏంటో నిర్దిష్టంగా తేల్చేశాయి. బీఆర్‌ఎస్‌ బలం పెద్దగా పెరగలేదు. ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ పంచాయతీ పోరులో చతికిల పడింది. మొత్తంగా చూస్తే ఇప్పటికీ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌పై రెట్టింపు కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయడం ఆషామాషీ విషయం కాదు.

ఉన్న వనరులతో పాలన గాడి తప్పకుండా నడపడం ఒక ఎత్తయితే, పరిపాలనకు వన్నె తెచ్చే నిర్ణయాలు తీసుకోవడం ఇంకో ఎత్తు. ఇలాంటి నిర్ణయాలే గతంలో తెలుగు ప్రజల జీవితాల్లో తిరుగులేని మార్పు తెచ్చాయి. ఆ నిర్ణయాలు తీసుకున్న నాయకుల్ని కూడా ఇంకోస్థాయిలో నిలబెట్టాయి. గత నాయకుల లాగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆడపడుచులకు ఉచిత రవాణా సౌకర్యం, రేషన్ షాపుల్లో సన్నబియ్యం నిర్ణయాలతో తనదైన ముద్రవేశారు. ఇంకా చాలా అంశాల్లో తనదైన పాలనాపరమైన నిర్ణయాలకు సంసిద్ధులవుతున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రయాణం మిగతా నాయకులకు పూర్తి భిన్నం తొలి నుంచీ ఆయన మామూలు నిర్ణయాల కన్నా భిన్నమైన పంథా ద్వారా ముందుకు వెళ్ళారు. అందుకే ఏ రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి కూడా చట్టసభల్లోకి అడుగుపెట్టి, తర్వాత పదహారేళ్ళకే ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్ఠించగలిగారు. ఆయన ఇప్పుడు పల్లె జీవితాన్ని మార్చడానికి కూడా అదే దారిలో వెళ్లగలగాలి. పంచాయితీ ఎన్నికలకు ముందు మేము పల్లెలో తిరిగినప్పుడు ఒకటే అనిపించింది– ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఒక్కో ఇల్లు బాగానే ఉంది. కానీ ఊరుగా చూసినప్పుడు వసతుల లేమి, అభివృద్ధి లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అదే స్థాయిలో ఊరికి ప్రభుత్వ నిధులు అందడం లేదు.


రెండు దశాబ్దాలుగా దేశ రాజకీయాల్లో నేరుగా లబ్ధిదారులకు ధనాన్ని బదిలీ చేసే పథకాలు ఊపందుకున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా చేసేందుకు రూపుదిద్దుకున్న ఈ పథకాలు చాలా చోట్ల రాష్ట్రాలకు ఆర్థికంగా భారంగా మారాయి. అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ భారాన్ని బాధ్యతగా తీసుకొని మోస్తున్నాయి. అంతవరకు బాగానే ఉన్నా కొన్నిచోట్ల పరిస్థితులు అంతకంతకూ తీసికట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా మారుతోంది.

ఓ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటే వ్యక్తిగత పథకాలు 100 మందికి గాను 90 మందికి సాఫీగా అందుతున్నాయి. ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. కానీ గడిచిన పదేళ్లలో ఆ గ్రామ పరిస్థితికి, ప్రజల జీవన ప్రమాణాలకు అద్దంపట్టే సమస్యలు ఇంకా అలాగే వున్నాయి. చాలా ప్రభుత్వ స్కూళ్లలో వంటగది, మరుగు వసతి లేవు, మురుగు కాలువలు లేవు, గుంటలుపడి రోడ్లు దెబ్బతిన్నాయి. మిషన్ భగీరథ పాక్షిక సఫలత మూలంగా ఇంకా తాగునీరు సమస్య చాలా గ్రామాల్ని పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా గ్రామస్థాయిలో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి.

వీటికి పరిష్కారం కోసం ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంత ప్రయత్నించినా ఫలితం అంతంతమాత్రమే. అధికారుల నుంచి వస్తున్న సహజ సమాధానం ‘డబ్బులు ఎక్కడ?’ అన్న ప్రశ్న మాత్రమే. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.


90శాతం ప్రజల సమస్యలు, బాధలు కేవలం 12 డిపార్ట్‌మెంట్‌ల ద్వారా తీర్చబడతాయి. వాటికి బడ్జెట్లో భారీగా నిధులు కూడా ప్రతి సంవత్సరం కేటాయించుకుంటాం. కానీ ఆ నిధులు గ్రామాల దాకా రావన్నది ఈ 75 సంవత్సరాల అనుభవ సారాంశం. ఈ 12 శాఖల్లో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా ప్రతి ఏడాది వ్యయం అంచనాలున్నాయి. ఇందులో కేవలం 2శాతం నిధుల్ని ప్రత్యక్షంగా పల్లెలకు ఇవ్వగలిగితే చాలు.

తెలంగాణలో ఉన్న దాదాపు 12,800 గ్రామ పంచాయతీలకు గాను వస్తున్న కేంద్ర నిధులు రూ.3,000 కోట్లు మాత్రమే. ఒక్కో గ్రామానికి సగటున ఏడాదికి 50 లక్షల నిధులు ఇవ్వాలన్న ఇంకా రూ.3,500 కోట్లు అవసరం. ఈ నిధుల్ని నేరుగా ఆ గ్రామాల్లో ఇవ్వలేకపోయినా ముఖ్యమైన 12 ప్రభుత్వ మంత్రిత్వ శాఖల ద్వారా ఖర్చు చేసే అవకాశం ఉంది. స్థానిక ఎమ్మెల్యే, సర్పంచులతో పాటు కలెక్టర్‌ను బాధ్యునిగా చేస్తూ ఏటా రూ.25 కోట్లు ఎమ్మెల్యే నిధులు కేటాయిస్తే, మూడు నాలుగేళ్ళల్లో గ్రామీణ తెలంగాణ స్వరూపమే మారిపోతుంది.

గ్రామసీమల్లోకి ప్రత్యక్ష నిధులను మళ్ళించినందుకే బిహార్‌లో నితీష్, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలం పరిపాలించగలిగారు. అంతేకాదు ఒకప్పుడు వెనకబాటుతనానికి అద్దంపట్టిన ఆ రాష్ట్రాలు ఇప్పుడు ప్రగతి పథంలోకి వెళ్తున్నాయి. అభివృద్ధి చేయాలంటే డబ్బులు లేవనే సమాధానం కన్నా కాస్త సృజనాత్మకత, సరికొత్త ప్రయోగాలు మేలైన పరిష్కారం. కొత్తగా ఆలోచించడమే కాదు, రాజకీయంగా దొరికిన పట్టును పల్లె జీవన ప్రమాణాల్ని మార్చడానికి ఇంధనంగా మార్చుకునే సాహసం చేయగలగాలి. ఇలాంటి సాహస నిర్ణయాలే రేవంత్‌ను దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించగలిగే స్థాయికి తీసుకువెళ్ళగలవు. గ్రామీణ తెలంగాణాన్ని ప్రగతి పథంలో నడపడానికి మరికొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోగలిగితే రేవంత్‌ పల్లె ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. తెలంగాణ పల్లె ప్రగతి రథాన్ని పరుగులు పెట్టించడానికి ఇదే సరైన తరుణం.

ప్రతి ఎమ్మెల్యేకి ఏడాదికి రూ.25 కోట్ల నిధులు ఇచ్చి వాటి వ్యయానికి సరైన విధివిధానాల రూపకల్పన చేస్తే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గ్రామీణ తెలంగాణ కొత్త హంగులతో అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళడం ఖాయం. తెలంగాణ గ్రామాలు దేశంలోనే నెంబర్ వన్‌ స్థాయికి రావాలంటే ఇది ఒక అవసరమైన పెట్టుబడిగా మన ముఖ్యమంత్రి భావిస్తే, ఇంకో పది సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు వందశాతం మెరుగుపడతాయి.

యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 01:42 AM