Panchayati Raj System: పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:38 AM
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం నెలకొనాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. పంచాయతీరాజ్ వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రతీక....
గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు. గ్రామ స్వరాజ్యం నెలకొనాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. పంచాయతీరాజ్ వ్యవస్థ నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు ప్రతీక. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థలోని వివిధ స్థాయిలకు సమాంతరంగా మరికొన్ని సంస్థలు కొనసాగడం వల్ల ఆ వ్యవస్థకు సంబంధించిన ప్రధాన లక్ష్యాలు నెరవేరడం లేదు. ఈ సమాంతర సంస్థలు అధికారం, నిధులు, ఆధిపత్యం వంటి అంశాల్లో ఘర్షణలు సృష్టించి స్థానిక అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయి.
మన దేశంలో 73వ రాజ్యాంగ సవరణకు ముందు కూడా కొన్ని సమాంతర సంస్థలు ఉండేవి. ఉదాహరణకు– ఉమ్మడి అటవీ యాజమాన్య సంస్థ, నీటి వినియోగదారుల సమూహం వంటివి. 73వ సవరణ అనంతరం అనేక రాష్ట్రాల్లో విభిన్న రకాల సమాంతర సంస్థలు ఏర్పడ్డాయి. దీంతో జిల్లా పరిషత్ అధికారాలు పరిమితం అయ్యాయి. కేంద్రం లేదా అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే నిధులను నేరుగా ఏజెన్సీలకు పంపడం, ప్రజా ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల స్థానిక సమస్యలకు తగిన పరిష్కారం కష్టమవుతోంది. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రెండూ ఒకే మంత్రిత్వశాఖ పరిధిలో ఉండేవి. తర్వాత గ్రామీణాభివృద్ధి విభాగాన్ని వేరు చేసి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేశారు. ఫలితంగా పంచాయతీరాజ్ వ్యవస్థ రాజకీయ అలంకరణగా మారింది. నిధుల సమస్య వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి అయిదేళ్లకు ఎన్నికలు తప్పనిసరి. కానీ, రకరకాల కారణాలతో ఈ నిబంధన అమలుకావడం లేదు. పంచాయతీరాజ్ భావన గ్రామ స్వరాజ్యం సాధించి నిజమైన ప్రజాస్వామ్యం సాధించడానికి ఉద్దేశించినది. ప్రస్తుతమున్న లోపాలను సరిచేసి, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి.
పి.హరీశ్, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News