Share News

తెలుగు భాషా నిలయం @ 125 భాషా వికాసంలో మరిన్ని కొత్త పుటలు!

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:56 AM

నిజాం నిరంకుశ పాలనా కాలంలో నిరాదరణకు గురైన తెలుగు భాషను పునరుజ్జీవింపచేయాలన్న సంకల్పంతో 1901లో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున గల రెసిడెన్సీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ...

తెలుగు భాషా నిలయం @ 125 భాషా వికాసంలో మరిన్ని కొత్త పుటలు!

నిజాం నిరంకుశ పాలనా కాలంలో నిరాదరణకు గురైన తెలుగు భాషను పునరుజ్జీవింపచేయాలన్న సంకల్పంతో 1901లో హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున గల రెసిడెన్సీ ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం స్థాపన జరిగింది. దీనికి 125 సంవత్సరాలు నిండిన సందర్భంగా మరోసారి తెలుగుభాషా వికాసాన్ని కాంక్షిస్తూ భావిభారత పౌరులలో భాషా సంస్కృతి, సంస్కారం, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించాలన్న ఉద్దేశంతో పలు కార్యక్రమాలను చేపట్టాం.

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం తొలికార్యదర్శి రావిచెట్టు రంగారావు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల స్థాపించి ప్రసిద్ధ రచయితలచేత పుస్తకాలు రాయించి సరసమైన ధరలకు అందుబాటులో ఉంచారు. అదే స్ఫూర్తితో ప్రస్తుత అధ్యక్షులు డా. కె.వి. రమణాచారి నేతృత్వంలో ఇంతకాలం భాషానిలయానికి సేవలందించిన ప్రముఖుల లఘు జీవితచరిత్రలు, తెలంగాణ ప్రముఖుల గురించిన పుస్తకాలు ప్రచురించాం. ఇప్పుడు ‘పుస్తక ప్రసాదం’ అనే వినూత్న పథకాన్ని ప్రారంభిస్తున్నాం. గ్రంథాలయానికి పాఠకులను, అక్కడ నిర్వహించే సాహిత్య సభలకు ప్రేక్షకులను ఆకర్షించి, వారిచేత తెలుగు పుస్తకాలను చదివించటం దీని లక్ష్యం. ఇందుకు అనుగుణంగా గ్రంథాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక పుస్తకాన్ని ఉచితంగా ప్రదానం చేస్తాం. ఇది శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం ప్రచురించిన పుస్తకం కావచ్చు, లేదా ఇక్కడి గ్రంథాలయంలో ఇతర రచయితల పుస్తకమైనా కావచ్చు. గ్రంథాలయ సందర్శకుల సంఖ్య పెరిగితే మా గ్రంథాలయం రిజిస్ట్రర్‌లోకి ఎక్కకుండా పేరుకుపోయిన పుస్తకాలైనా ఈ పథకం కింద అందించాలని నిర్ణయించాం. ఈ పథకానికి ఇతర రచయితలెవరైనా సహకారం అందించి, తమ రచనలిస్తే స్వీకరిస్తాం. పుస్తకం తీసుకున్న పాఠకుడు చదివిన తర్వాత దాన్ని తిరిగి ఇచ్చినా, లేదా తన వద్ద ఉన్న ఇతర పుస్తకాలను గ్రంథాలయానికి ఇచ్చినా స్వీకరించి కావలసిన వారికి తిరిగి ఈ పుస్తకాలను అందచేస్తాం. ఈ పథకాన్ని హైదరాబాద్‌ రాష్ట్ర ప్రథమ ప్రజాముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణరావు జయంతిని పురస్కరించుకుని మార్చి 13 సాయంత్రం భాషానిలయంలో ప్రారంభిస్తున్నాం. అదే రోజు ‘బూర్గుల రామకృష్ణరావు ప్రతిభా పురస్కారా’న్ని బహుభాషా కోవిదుడు డా. నలిమెల భాస్కర్‌కు ప్రదానం చేస్తున్నాం. అలాగే బూర్గుల రామకృష్ణరావు జీవితం–వ్యక్తిత్వంపై వ్యాసరచన పోటీని నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మూడు ఆకర్షణీయమైన ప్రోత్సాహక నగదు బహుమతులను ప్రదానం చేస్తాం.


అలాగే– తెలుగు యువతలో భాషా, సాహిత్య, సంస్కృతుల పట్ల అభిమానాన్ని ప్రేరేపించడం కోసం ఏడాది పాటు ప్రతి నెల ఒకరోజు ‘యువతకోసం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భాషానిలయానికి దగ్గరలో ఉన్న డిగ్రీస్థాయి కాలేజీల విద్యార్థులను ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నెలనెలా వ్యక్తిత్వ వికాస బోధనా నిపుణుడు డా. వంగపల్లి విశ్వనాథం నిర్వహిస్తున్నారు. తొలుత పదమూడు కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను– ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్ట్రర్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్లలతో కూడి ఐదుగురు విద్యార్థుల చొప్పున పంపాల్సిందిగా కోరాం. కాని ఏడు కాలేజీల నుంచే విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మరికొందరు విద్యార్థులకు ఇంకా అవకాశం ఉంది. ఈ ఉచిత వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని నగరంలోని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు, విద్యార్థులకు మనవి చేస్తున్నాం.

అలాగే– మారుతున్న కాలానికి అనుగుణంగా రాబోయే తరాలకు, ప్రపంచం నలుమూల ఉన్న తెలుగువారికి విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న మహోన్నతాశయంతో ఆధునికతను జోడించి, మన వారసత్వాన్ని కాపాడుకునే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంలో మరెక్కడా లభించని ఎన్నో అరుదైన, అపురూపమైన గ్రంథాలు – పత్రికలు కొలువై ఉన్నాయి. ఈ విజ్ఞాన భాండాగారాన్ని డిజిటలైజ్‌ చేసి అన్‌లైన్‌ వేదికగా అందరికీ ఉచితంగా అందించబోతున్నాం. ఈ ప్రాజెక్టులో భాషాభిమానులైన యువకులకు భాగస్వామ్యం కల్పించాలని తీర్మానించాం. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ (ఏఐ), ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌ (ఓసీఆర్‌) టూల్స్‌ సహాయంతో పేజీలను డిజిటల్‌ టెక్స్‌ట్‌గా మార్చబోతున్నాం. ఈ సమాచారాన్ని ఇంటర్నెట్‌లో ఎవరైనా సులభంగా వెతికి పట్టుకునేలాగా దానికి అవసరమైన మెటా డేటాను కూడా రూపొందిస్తున్నాం. ఈ ప్రక్రియ ద్వారా పాత పుస్తకాలకు ఆధునిక డిజిటల్‌ రూపం వస్తుంది. ఈ ప్రాజెక్టులో పని చేయడానికి యువకులకు ఎలాంటి ముందస్తు సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేదు. కేవలం మొబైల్‌ఫోన్‌ ద్వారా పుస్తకాల్లోని ముఖ్య పేజీలను స్కాన్‌ చేయడం AI, OCR టూల్స్‌ వాడి వాటిని టెక్స్‌ట్‌గా మార్చడం –అంతే. తెలుగు భాషపై అభిమానంతో, ఈ ప్రక్రియను నేర్చుకోవాలన్న ఆసక్తితో యువకులు ఎవరు ముందుకు వచ్చినా వారికి ఉచిత శిక్షణను ఇస్తాం. దీనిద్వారా భవిష్యత్తులో ఎంతో కీలకమైన ఏఐ టూల్స్‌, డిజిటల్‌ ఆర్కైవింగ్‌ పద్ధతులలో యువకులకు ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. ఇందుకోసం నాలుగు నుంచి ఆరువారాల ఇంటర్న్‌షిప్‌ విజయవంతంగా పూర్తి చేసినవారికి, కనీసం వంద పుస్తకాలు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్‌ కూడా అందచేస్తాం.

టి.ఉడయవర్లు

(సీనియర్‌ జర్నలిస్టు)

ఈ వార్తలు కూడా చదవండి..

వీల్ చైర్ నుంచి వీర యాత్ర

రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 12:56 AM