రెక్కలు విరిగిన విద్యార్థి విప్లవాలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:31 AM
నిన్న బంగ్లాదేశ్‌లో, మొన్న మయన్మార్‌లో ముగిసిన, మరో పక్షం రోజుల్లో నేపాల్‌లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలు దక్షిణాసియా రాజకీయ మనఃస్థితిని నిర్దేశిస్తున్నాయి. ఈ మూడు పార్లమెంటరీ ఎన్నికలు కేవలం ప్రజాస్వామిక...
నిన్న బంగ్లాదేశ్‌లో, మొన్న మయన్మార్‌లో ముగిసిన, మరో పక్షం రోజుల్లో నేపాల్‌లో జరగనున్న పార్లమెంటరీ ఎన్నికలు దక్షిణాసియా రాజకీయ మనఃస్థితిని నిర్దేశిస్తున్నాయి. ఈ మూడు పార్లమెంటరీ ఎన్నికలు కేవలం ప్రజాస్వామిక పరివర్తనలు మాత్రమే కాదు, అవి విద్యార్థుల తిరుగుబాటుతో సుదీర్ఘంగా కొనసాగిన రాజకీయ అల్లకల్లోల పరిస్థితుల నుంచి పర్యవసించిన చరిత్రాత్మక సంఘటనలు.
బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ ఛాత్ర శిబిర్, జాతీయోబాదీ ఛాత్రదళ్ నాయకత్వంలో యువజనులు షేక్ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజ్వరిల్లిన తిరుగుబాటులో యువనేతలు నహీద్ ఇస్లాం, సర్జిస్ ఆలం కీలకపాత్ర వహించారు. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వాన్ని శాసనోల్లంఘన ఉద్యమం ద్వారా ప్రతిఘటించడంలో విశ్వవిద్యాలయ విద్యార్థులు అగ్రగాములుగా నిలబడ్డారు. ప్రజాస్వామ్య అనుకూల శక్తులు అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీతోను, నేషనల్ యూనిటీ గవర్నమెంట్ లోని ప్రజాస్వామ్యవాదులతోను విద్యార్థులు కలసికట్టుగా, 2021లో కుట్రతో అధికారాన్ని కైవసం చేసుకున్న సైనికాధికారులను తీవ్రంగా వ్యతిరేకించారు.
నేపాల్‌లో ఉవ్వెత్తున ఎగసిన జెన్–జీ యువజనుల నిరసనలు ప్రభుత్వ వ్యవస్థలోను, సమాజంలోను పెచ్చరిల్లిపోయిన అవినీతిని ప్రతిఘటించి, నిర్మూలించడమే లక్ష్యంగా జరిగాయి. 2008 అనంతరం నేపాల్ రాజకీయాలలో చరిత్ర తిరస్కృతికి గురైన రాజరిక కాలం నాటి కులీన వర్గాలే మళ్లీ పెత్తందారులు కావడాన్ని జెన్–జీ తరం సహించలేకపోయింది. నేపాల్ చరిత్రాత్మక ఉద్యమాల (1990 జన్ ఆందోళన్, 2006 పీపుల్స్ మూవ్‌మెంట్ మొదలైనవి) వలే కాకుండా జెన్–జీ యువజనుల సమీకరణ చాలా నిష్పాక్షికంగా జరిగింది. సామాజిక మాధ్యమాల ద్వారా అపూర్వరీతిలో జెన్–జీ నిరసనకారుల మధ్య సమన్వయం సాధ్యమయింది. రాబోయే ఎన్నికలలో సంప్రదాయ రాజకీయవర్గాలను వ్యతిరేకిస్తున్న శక్తులను పటిష్ఠపరచడంలో యువ ఉద్యమకారులు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 2022లో ఖాట్మండ్ మేయర్ పదవికి ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి బాలెన్ షాకు పూర్తి మద్దతునిస్తున్నారు. సంప్రదాయేతర రాజకీయ శక్తుల వైపు జెన్–జీ మొగ్గు చూపుతోందనడానికి ఇది స్పష్టమైన తార్కాణం. అయితే నేపాల్‌లో జెన్–జీ నిరసనకారులు దేశవ్యాప్త యువజన పార్టీగా సంఘటితం కాలేదు.
ఈ మూడు దేశాల– బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్– లోను యువజనుల నిరసనలు, ఉద్యమాల తరువాతనే ఎన్నికలు జరగడం గమనార్హం. రాజకీయ మార్పులను సాధించడంలో విద్యార్థి ఉద్యమాల ప్రభావశీలతను అది ధ్రువీకరిస్తోంది. ఈ విద్యార్థి ఉద్యమాలు ప్రభుత్వాలను కూల్చివేయడంలో విజయవంతమవుతున్నాయి, సందేహం లేదు. కొత్త పాలకులను ఎన్నుకునేందుకు ఎన్నికల నిర్వహణను అనివార్యం చేయగలుగుతున్నాయి. తీరా ఎన్నికల అనంతరం అధికార వ్యవస్థలను కైవసం చేసుకుంటున్నది మాత్రం సువ్యవస్థిత పార్టీలు, సంప్రదాయ రాజకీయ శక్తులే కావడం విస్మరించలేని వాస్తవం.
విద్యార్థి ఉద్యమాల ప్రభావశీలతకు, వాటి రాజకీయ లక్ష్యాల సాధనకు మధ్య ఉన్న అంతరానికి నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్‌సీపీ) ఒక తాజా ఉదాహరణ. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల తిరుగుబాటు నుంచి ప్రభవించిన ఈ పార్టీ కన్వీనర్ నహీద్ ఇస్లాం ఇటీవలి పార్లమెంటరీ ఎన్నికలలో ఢాకా నుంచి విజయం సాధించారు. ఢాకాతో పాటు కేవలం అయిదు స్థానాలలో మాత్రమే ఎన్‌సీపీ విజయం సాధించింది. ఈ యువ విప్లవకారులు ఒక సంఘటిత రాజకీయశక్తిగా ఎందుకు ప్రభవించలేకపోయారు? హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి పోరాటం ఒక తరం మార్పుకు ఆరంభంగా కనిపించింది. అయితే అది ఆరంభంగానే మిగిలిపోయింది. ఎన్నికల పోరాటంలో సంపూర్ణ విజయంగా పర్యవసించలేదు.. బంగ్లా విద్యార్థుల పోరాటం సువ్యవస్థిత పాలక వర్గాలను కదిలించి వేసింది. అయితే వారిని పూర్తిగా రంగం నుంచి తొలగించలేకపోయింది. తారీఖ్ రెహ్మాన్ నాయకత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మళ్లీ ఢాకాలో అధికారానికి వచ్చింది. బంగ్లా సంప్రదాయ పాలక పార్టీలలో అది ఒకటి. మౌలికంగా ప్రగతిశీల కొత్త శక్తులేవీ అధికారానికి రాలేదు.
ఇటీవలే ముగిసిన మయన్మార్ ఎన్నికలలో కూడా ఇటువంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి. సైన్యం మద్దతు ఉన్న యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) నిర్ణయాత్మక విజయం సాధించింది. విద్యార్థుల క్రియాశీలత పార్లమెంటరీ పోరాట పద్ధతులుగా పరిణమించలేదు. చారిత్రకంగా మయన్మార్‌లో ప్రభావశీల పౌర రాజకీయ శక్తి నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ. కుట్రతో అధికారంలోకి వచ్చిన సైనికాధికారులు ఆ ప్రజాస్వామిక సంస్థను పూర్తిగా అణచివేశారు. ఆంగ్‌సాన్ సూకీపైనే ఆధారపడి ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడంలో ఎన్‌ఎల్‌డీ విఫలమవడం కూడా దాని అణచివేతకు దారితీసింది. సూకీ అధికారంలోకి వచ్చిన తరువాత, 1988 విప్లవంలో ప్రముఖ పాత్ర వహించిన విద్యార్థినాయకులు ఎవరినీ ఆమె ఏ విధంగానూ ప్రోత్సహించలేదు.
విద్యార్థి ఉద్యమాలు విశాల సమాజం నుంచి సంపూర్ణ మద్దతును పొందుతున్నాయి. రాజకీయ, పాలనా వ్యవస్థల్లో మౌలిక మార్పులపట్ల విస్తృత స్థాయిలో ఆశాభావాలను నెలకొల్పుతున్నాయి. విశ్వవిద్యాలయాలు చైతన్యశీల భావాలకు నెలవులు. అక్కడి విద్యార్థి లోకంలో భావవ్యాప్తి శీఘ్రగతిన జరగడం పరిపాటి. వ్యవస్థలను ప్రతిఘటించడంలో ముందుండడమే కాకుండా, ఆ కర్తవ్య నిర్వహణలో ఎదురయ్యే ఎలాంటి చిక్కులనైనా ఎదుర్కోవడానికి వారు సాహసిస్తారు. ఆ సాహస గుణం వల్లే విద్యార్థి ఉద్యమాలు ప్రభావదాయకమూ, సంచలనాత్మకమూ అవుతున్నాయి.
నేపాల్ పార్లమెంటుకు త్వరలో జరగనున్న ఎన్నికలు భారత్‌తో సహా ఇరుగు పొరుగు దేశాలనే కాకుండా అంతర్జాతీయ సమాజం దృష్టిని కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మున్నెన్నడూ లేని రీతిలో జెన్–జీ నిరసనలు ప్రజ్వరిల్లడమే అందుకు ప్రధాన కారణం. ఆ ఉద్యమానికి చెప్పదగ్గ ప్రభావశీల నాయకులు ఎవరూ లేరు. ఆ ఉద్యమం చాలావరకు వికేంద్రీకృతంగా జరిగింది. పార్లమెంటరీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యువ నాయకుల్లో కొంతమందికి మునిసిపాలిటీల స్థాయిలో పాలనానుభవం ఉన్నది. బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఉద్యమానికి నేషనల్ సిటిజన్స్ పార్టీ వలే నేపాల్ యువ ఉద్యమకారులను సంఘటితపరిచిన ఒక దేశవ్యాప్త సంస్థ ఏదీ లేదు. ఏ ఉద్యమానికి అయినా పటిష్ఠ సంస్థాగత నిర్మాణమూ, దీర్ఘకాలిక లక్ష్యమూ, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. బంగ్లాదేశ్‌లో వలే నేపాల్‌లో కూడా యువ ఉద్యమకారులు ఎన్నికలలో ప్రభావశీల విజయాలు సాధించలేకపోయేందుకే ఆస్కారమున్నది.
యువజన ఉద్యమాలు, నిరసన పోరాటాలూ స్వతఃస్సిద్ధంగా తాత్కాలికమైనవి. సువ్యవస్థిత రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, మత సంబంధ సంస్థల కార్యకర్తల వలే విద్యార్థి ఉద్యమకారులు లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించి సుదీర్ఘకాలం పోరాడేందుకు అవసరమైన యంత్రాంగం ఉండదు. సరైన, పటిష్ఠ నాయకత్వ లోపం గురించి మరి చెప్పనవసరం లేదు. మద్దతుదారులు కూడా ఉద్యమంపై త్వరితంగా ఆసక్తి కోల్పోవడం కద్దు. ఏ సమస్యల పరిష్కారానికి ఉద్యమం ప్రారంభమయిందో వాటిని విస్మరిస్తారు. నిజానికి చాలా మందికి ఆ సమస్యలపై సరైన, లోతైన అవగాహన ఉండదు. లక్ష్య సాధన పట్ల నిబద్ధత కూడా ఉండదు.
విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడతాయి. సమాజంతో సంభాషిస్తాయి. ప్రజా చర్చలను ప్రభావితం చేస్తాయి. అధికార పీఠాలపై ఉన్న వారిని కూలదోస్తాయి. తాము నిలదీసిన సమస్యలను పరిష్కరించేందుకు, ఎలుగెత్తిన లక్ష్యాల పరిపూర్తికై రాజ్యవ్యవస్థలో అంతర్భాగమయ్యేందుకు పోరాడుతాయి. అదొక ఎడతెగని పోరాటం! విద్యార్థి ఉద్యమాల చరిత్ర పాఠమిది. ఇది పునరావృతమవుతూనే ఉంటుంది. వీధుల్లో నిర్వహించే పోరాటాలకు మద్దతు పొందడమనేది ఎన్నికలలో విజయసాధనకు మౌలికంగా భిన్నమైనది. ఉద్యమిస్తున్న వేళ లభించే ప్రాధాన్యం, మహత్వాన్ని అధికార కైవసంగా భ్రమపడకూడదు. మన ఇరుగుపొరుగు దేశాల పార్లమెంటరీ ఎన్నికలే అందుకు నిదర్శనం.
రమీ నిరంజన్ దేశాయ్
ఇండియా ఫౌండేషన్
(ది ప్రింట్)
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News