Share News

సోమనాథ్ ఉత్సవాల్లో నెహ్రూ ఎందుకు?

ABN , Publish Date - May 21 , 2026 | 12:24 AM

గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టి ఈ నెల 11తో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మే 8 నుంచి 11 వరకు అక్కడ వివిధ వేడుకలు జరిగాయి. భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల ప్రచారాన్ని...

సోమనాథ్ ఉత్సవాల్లో నెహ్రూ ఎందుకు?

గుజరాత్‌లోని సోమనాథ్‌ దేవాలయం పునర్నిర్మాణం చేపట్టి ఈ నెల 11తో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మే 8 నుంచి 11 వరకు అక్కడ వివిధ వేడుకలు జరిగాయి. భారత ప్రభుత్వం ఆ ఉత్సవాల ప్రచారాన్ని భారీ ఎత్తున చేపట్టింది. మూడు రోజుల పాటు అక్కడ జరిగే కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా పత్రికల్లో, టీవీల్లో వరుస ప్రకటనలు వచ్చాయి. ఈ ప్రచారమంతా సోమనాథ్ ట్రస్ట్‌కు బదులు గవర్నమెంట్ ఆఫ్ భారత్ లేదా వివిధ విభాగాలు చేపట్టినట్లు ఆయా ప్రకటనల్లో ఉంది. దీని కోసం కోట్లలో ప్రజాధనం వెచ్చించారని తెలుస్తోంది. పత్రికా ప్రకటనల్లో ఆ గుడి విశేషాలు, భక్తుల సందడిని చూపే బదులు దేవాలయంతో పాటు ప్రధాని మోదీ చిత్రాన్ని వేశారు. ఘన చరిత్ర కలిగిన సోమనాథ్ దేవాలయం 75 ఏళ్ల ఈ సంరంభాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ, మోదీ ప్రచారానికి వాడుకుంటూ నెహ్రూపై మరోమారు విమర్శకు వేదికగా మలచుకుంది.

నెహ్రూ హయాంలో దీని పునర్నిర్మాణం పట్ల మంత్రుల్లో విభేదాలు వచ్చిన మాట నిజమే. ఆలయ పునర్నిర్మాణం విషయంలో ప్రభుత్వ ప్రమేయాన్ని నెహ్రూ వ్యతిరేకించారు తప్ప కట్టవద్దనలేదు. ప్రభుత్వ నిధులు కేటాయించవద్దన్నారు. ఇదే మాట మహాత్మా గాంధీ కూడా అన్నట్లు రికార్డులున్నాయి. సోషలిస్టు ఆలోచనలున్న నెహ్రూ దేశంలో మత ప్రస్తావన, జాతి విభేదాలకు తావు ఉండొద్దని కోరుకున్నారు. అందుకే మతపర నిర్మాణాలకు ప్రభుత్వం, మంత్రులు దూరంగా ఉండి దేశ సమైక్యతను, లౌకికతను నిలబెట్టాలని ఆశించారు. అయితే నెహ్రూ ఆలోచనాసరళి అందరికీ నచ్చలేదు. ఆయనతో విభేదించినవారు క్రమంగా ఆయన క్యాబినెట్ నుంచి, ఆ తరవాత కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. అలా వచ్చిన కాంగ్రెస్ చీలిక దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కారణమైంది.

దేశ ఉపప్రధాని హోదాలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 1947, డిసెంబర్ 12న జునాగఢ్ సంస్థానంలో పర్యటించినపుడు జరిగిన సభలో సోమనాథ్ దేవాలయం పునర్నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. అనుకోకుండా పటేల్ 1950 డిసెంబర్‌లో మరణించగా, ఆ కార్యాన్ని కేంద్రమంత్రి కేఎం మున్షీ తమ భుజాలపై వేసుకున్నారు. ఆనాడు ప్రజల, సంస్థానాధీశుల నుంచి సేకరించిన రూ.25 లక్షలతో ఈ నిర్మాణం జరిగింది. 1951లో విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రధాని నెహ్రూ రాకపోవడంతో తొలి దేశాధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక మతానికి చెందిన నిర్మాణానికి ప్రభుత్వ బాధ్యులు పాల్గొంటే తమ పాలన ఏకపక్షంగా ఉన్నట్లు ప్రజలు భావిస్తారని నెహ్రూ భావించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకున్నా ఆలయ ఆరంభోత్సవానికి సౌరాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు కేటాయించడం సక్రమం కాదు అని 1951, ఏప్రిల్ 22న మున్షీకి నెహ్రూ రాసిన లేఖలో ఉంది.


అయితే నెహ్రూ ఆలోచనను ఆనాటి దేశ సమగ్రతకు సంబంధించిన అంశంగా చూడాలి. దేశంలో ఒక మతానికి చెందిన ఆలయ నిర్మాణానికి దేశ ప్రధానిగా నెహ్రూ హాజరుకాకపోవడం ఆయన పాలనాపరమైన నిర్ణయంగా భావించాలి. అలా పాల్గొనడం తన లౌకిక విధానానికి విరుద్ధమని, పైగా ప్రభుత్వ నిధులతో ఆ కార్యం జరగడం నచ్చక నెహ్రూ ముందుకు రాలేదు. ఆలయ ప్రారంభోత్సవం ప్రభుత్వ కార్యక్రమం కాదని ఆయన పార్లమెంట్‌లోను, విపక్షాలకు స్పష్టం చేశారు. ఇప్పుడు హిందూ మతానికి, దేవాలయాల దర్శనానికి మోదీ ఇచ్చే ప్రాముఖ్యం ఆయన పాలనాపర విధానమయినట్లే నెహ్రూకు కూడా ఓ విధానం ఉండేది. ఆయన తన పాలనలో మత ప్రస్తావన రావద్దనుకున్నారు. ఎవరి ఆలోచనా తీరు వారిది. అంతేకాని నెహ్రూ ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకించారు అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించడం కావాలని చేసిన అపవాదే.

దేశ ప్రధాని ఒక మతానికి చెందిన దేవాలయ నిర్వహణ సంస్థకు అధ్యక్షుడిగా ఉండడం వ్యక్తిగతంగా భావించలేం. ప్రభుత్వ పదవులను వదిలేశాక ఈ పని చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సోమనాథ్‌ దేవాలయం శ్రీ సోమనాథ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంటుంది. ఆ ట్రస్ట్‌కు ప్రస్తుతం ప్రధాని మోదీ చైర్మన్‌గా ఉన్నారు. 2021 జనవరి నుంచి ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2023లో ఆ పదవీకాలాన్ని ఏడాది నుంచి ఐదేళ్లకు సవరించారు. ఆ దేవాలయ ట్రస్ట్ చైర్మన్‌గా మోదీకి ప్రకటనల్లో కనబడే హోదా ఉంటే, ఆరుగురు ట్రస్టీ మెంబర్ల పేర్లయినా ప్రకటనలో ఉండాల్సింది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కూడా ఆ ట్రస్ట్‌లో సభ్యులే.

శ్రీ సోమనాథ్ ట్రస్ట్‌కు మోదీ చైర్మన్ అయిన నాటి నుంచి గుజరాత్ ప్రభుత్వ అభివృద్ధి నిధుల్లో సింహభాగం ఈ ఆలయ అభివృద్ధి కోసమే కేటాయిస్తున్నారని పత్రికలు రాశాయి. 2017లో గుజరాత్ ప్రభుత్వం కోరిన వెంటనే కేంద్ర పర్యాటక శాఖ రూ.262 కోట్లను ఈ దేవాలయ అభివృద్ధి కోసం మంజూరు చేసింది. వాస్తవానికి గుడుల నిర్వహణ ఖర్చు వాటి ఆదాయం లోంచే జరగాలి. సోమనాథ్ దేవాలయం 75 ఏళ్ల సంరంభ ప్రచారం కోసం కేంద్రం నిధులు కేటాయించడం గర్హనీయమే. పూర్వకాలం రాజుల పాలనలో వారి మత విశ్వాసాల మేరకు గుడుల నిర్మాణం చేపట్టారు. రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లుగా తాము మొక్కే దేవతలకు రాజ్యంలో వీలయినన్ని గుడులను నిర్మించి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. అదే రాచరిక సంప్రదాయాన్ని ప్రజాస్వామ్య దేశంలో బీజేపీ పునరిద్ధరిస్తోంది.

బద్రి నర్సన్

ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:24 AM