సాహిత్య సీమలో వైజ్ఞానికుడు
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:07 AM
ఆచార్య చందు సుబ్బారావు జనవరి 29న విశాఖపట్నంలోని తన గృహంలో మరణించారు. ఈ హఠాత్పరిణామానికి సాహితీలోకం ఘొల్లుమంది. అందరూ ముద్దుగా పిలిచే ‘చందు’...
ఆచార్య చందు సుబ్బారావు జనవరి 29న విశాఖపట్నంలోని తన గృహంలో మరణించారు. ఈ హఠాత్పరిణామానికి సాహితీలోకం ఘొల్లుమంది. అందరూ ముద్దుగా పిలిచే ‘చందు’ లేకుండా విశాఖపట్నంలో ఏ సాహితీ సమావేశం జరిగేది కాదు.
చందు సుబ్బారావు ప్రసంగాలు, పుస్తకాలు, సాహితీ విమర్శనా బాణాలు అందుకున్నవారు– ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులేమోనని అనుకునేవారు. కానీ ఆయన భూ భౌతికశాస్త్ర ఆచార్యుడు. అనేక పరిశోధనలు చేసి, పుస్తకాలు, వ్యాసాలు ప్రచురించి, పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేసిన సైంటిస్ట్. గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా చదలవాడ గ్రామంలో 1946 మే 18న సుబ్బారావు జన్మించారు. తల్లిదండ్రులు వెంకటకృష్ణయ్య, రాజ్యలక్ష్మి. వీరిద్దరూ కమ్యూనిస్టులుగా కొనసాగుతున్నప్పుడే పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న వారిలో వీరు తొలితరం దంపతులు. తండ్రి ఉపాధ్యాయుడు, మేనమామ ప్రఖ్యాత రచయిత బొల్లిముంత శివరామకృష్ణ కావడంతో సుబ్బారావుకు చిన్నప్పటి నుంచే వామపక్ష భావజాలం, సాహిత్యం అబ్బినవి.
సమాజంలో చెడు పోకడలు, సాహితీ ప్రపంచంలో వస్తున్న పెడధోరణులు, సైన్సు అనుకున్నంత గొప్పగా భారతదేశంలో అభివృద్ధి చెందకపోవడం... వంటి వాటితో పాటూ దళిత, బహుజన, మహిళల స్థితిపై చందు నిత్యం మానసిక ఘర్షణ పడేవారు. ఆ ఆవేదనలోంచి వచ్చిన ఉపన్యాసాలు జనాన్ని ఉర్రూతలూగించేవి. చందు వలే అటు ప్రాచీన సాహిత్యాన్ని, ఇటు ఆధునిక సాహిత్యాన్ని సమపాళ్లలో రంగరించి మాట్లాడేవారు తెలుగు రాష్ట్రాల్లో బహు అరుదు. చందు– శ్రీశ్రీ అభిమాని. 1970లో శ్రీశ్రీ పుట్టిన రోజు సందర్భంగా విశాఖలో నిర్వహించిన ‘విశాఖ విద్యార్థుల సభ’లో జ్వాలాముఖి ప్రసంగం విన్నవాళ్లలో చందు, నేనూ ఉన్నాం. తరువాత విశాఖ రచయితల సంఘంలో చేరి పురిపండా, రాచకొండ, కాళీపట్నం, చలసాని ప్రసాద్... అప్పుడప్పుడూ గొల్లపూడి, భమిడిపాటి వంటి అనేక సీనియర్ రచయితలతో కలిసి ఆయన సాహితీ చర్చలు చేసేవారు. ఆంధ్రా యూనివర్సిటీలో అప్పటికి తూమాటి దోణప్ప, పరిశోధకులుగా ఉన్న వెల్చేరు నారాయణరావు, బంగొరెతో పాటు కొర్లపాటి శ్రీరామమూర్తి, మలయవాసిని, అత్తలూరి నరసింహరావుతో సాహితీ సమాలోచనలు జరుపుతుంటే– ఈయనెవరు? ఆర్ట్స్ కాలేజీలో ఏ డిపార్టుమెంటువారు? అనుకునేవారంతా. చందు సుబ్బారావు సైన్స్ కాలేజీ మనిషి. ఫ్యాకల్టీ క్లబ్ నుంచి ఎక్కువగా సామాజిక శాస్త్రాలు, తెలుగు భాషా సాహిత్యం, ఆంగ్ల భాష అధ్యయనంతో పాటు, హిందీలో ఆదేశ్వరరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వంటి వారితో ఎక్కువ సమయం గడిపేవారు.
చందు తన సబ్జెక్ట్ అయిన భూ భౌతికశాస్త్రానికి సంబంధించి విశాఖ ప్రాంతంలో నీటి వనరులు, అక్కడి కాలుష్యంపై పరిశోధనలు చేశారు. గ్రౌండ్ వాటర్ పెరుగుదలకు సంబంధించి జాతీయ సెమినార్లు ఏర్పాటు చేయటం, దానికో సంఘాన్ని ఏర్పాటు చేసిన వాళ్లలో చందు ప్రముఖ పాత్ర పోషించారు. ఆ సందర్భంలోనే– ‘చందూ! నువ్వు తెలుగు సాహిత్యంపై కృషి చేస్తున్నా, మంచి గుర్తింపు ఉన్నా, మనం యూనివర్సిటీ అధ్యాపకులం... మన పరిశోధనలు, ప్రచురణలు, పరిశోధక నిర్వహణ ఆధారంగానే మనకు గుర్తింపు ఉంటుంది’ అని నేనాయనతో అంటే, అప్పుడు ఇంగ్లీషులో మూడు పుస్తకాలు ప్రచురించారు. బల్గేరియాలో పరిశోధన నిమిత్తం కొంతకాలం ఉండి, కమ్యూనిస్టు దేశాలు పర్యటించారు.
చందు సుబ్బారావు సుమారు 20 పుస్తకాలు ప్రచురించారు. కొన్ని వందల వ్యాసాలు రాశారు. ఆయనే రాసుకున్నట్లు ‘‘రాసే గుణంతో పాటు గుర్తుంచుకునే బుర్ర ఉండడం వల్ల అయిదు దశాబ్దాల చరిత్రను (సాహితి) తెల్ల కాగితాలకెక్కించాను. 1968లో మహీధర రామమోహనరావు, శివరాం మావయ్య, మోహన్, గులాం గౌస్, పెద్దిబొట్ల, ప్రకాశ్ తదితరులు విశాలాంధ్ర వారిచ్చిన పేరుతో ఇతర పత్రికల్లో ప్రవేశించి ప్రఖ్యాతి కోసం ప్రయత్నించటం వాస్తవం.’’ ఇంత నిర్మొహమాటంగా తన గురించి ఎలా చెప్పుకున్నారో సాహిత్య విమర్శ రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు అంతే కచ్చితంగా మాట్లాడేవారు. శ్రీశ్రీ కవిత్వంపై మాట్లాడేటప్పుడు... అలవోకగా ఆయన కవిత్వం పలుకుతూ మధ్యమధ్యలో విశ్వనాథ సత్యనారాయణ సంస్కృత భూయిష్ఠమైన ఆంధ్ర భాషా పద్యాలు చదివి రంజింపజేసేవారు. ఆయన ప్రచురించిన సుమారు నాలుగు సాహితీ పుస్తకాలు, అందులో ఎక్కువ వ్యాసాలుగా వివిధ పత్రికల్లో అచ్చయినవి. అవి ఎప్పటికీ చందును తెలుగు సాహితీ విమర్శకుల జాబితా తొలి వరుసలో ఉండేలా చేశాయి. పాఠకులు తప్పనిసరిగా చదవాల్సిన గ్రంథాలుగా తెలుగు శాఖ వారు ఈ పుస్తకాలను పేర్కొంటారని ఆశిస్తున్నా. ‘కవికి విమర్శకుడు శత్రువు కాదు’ అన్న మకుటంతో వెలువడిన పుస్తకం ప్రతి కవి, విమర్శకుడు చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా తాను అనువదించి, విశాలాంధ్ర ప్రచురించిన ‘డా. బాబాసాహెబ్ అంబేడ్కర్’ గొప్ప అనువాదం.
ఒక సందర్భంలో వేగుంట మోహన్ ప్రసాద్ కవితా సంకలనాన్ని యూనివర్సిటీలో ఆవిష్కరింపజేసి, అద్భుతంగా మాట్లాడారు. నేను అకడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు మన రాష్ట్రం, వివిధ రాష్ట్రాల అధ్యాపకులు ముఖ్యంగా తెలుగు భాషా ఉపన్యాసకులు పునశ్చరణ తరగతులకు వచ్చినప్పుడు చందు సుబ్బారావు ప్రసంగాలు ఉండేవి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు, ఆంగ్ల, హిందీ ఉపన్యాసకులు అందరూ చందును గుర్తుపెట్టుకుంటారు. కొర్లపాటి శ్రీరామమూర్తి, మలయవాసిని కోఆర్డినేటర్లుగా నేను తెలుగు సాహిత్యంపై జాతీయ స్థాయిలో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తున్న సందర్భంలో అందరం ఆలోచించి 1989–90లో వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంపై వారం రోజులు జరిపిన సభలు ఇప్పటికీ గుర్తున్నాయి.
‘అరసం’కు అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసినా, విశాఖపట్నం అరసంను పురిపండా, చందు, ఉప్పల అప్పలరాజు చాలాకాలం నడిపించారు. 14వ రాష్ట్ర మహాసభలు విశాఖలో జరిపినప్పుడు రాష్ట్రంలోని అన్ని సాహితీ సంస్థల సభ్యులు, అరసం, విరసం, స్థానిక సంఘాల వారు పాల్గొని మరపురాని స్మృతులను మిగిల్చారు. ముఖ్యంగా తెలుగు పరిశోధకులు చేయని ఒక మంచిపని పరిశోధనలపై పరిశోధన అంటూ ఒక పీహెచ్‌డిని సమీక్షిస్తూ ‘‘అంకెలొక్కటే ప్రమాణాలు కావు, కాని ప్రమాణ సూచికలే’’ అన్నారు చందు. అంతేకాదు సామాజిక పరిశోధనలపై పరిశోధనలు చెయ్యాలని, ఆధునిక సామాజిక శాస్త్రవేత్తలు, భాషా సాహిత్యాల నుంచి రాబట్టవలసిన రాజకీయ, సాంఘిక శాస్త్రీయ నిర్ధారణలు అవసరం అన్నారు. నగ్నముని కొయ్యగుర్రంపై రాసిన చక్కటి విశ్లేషణ అరసంవారు, విరసం వారే కాదు, తెలుగు సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని ప్రేమించేవారు తప్పక చదవవలసిన వ్యాసం. తెలుగువారి సామ్యవాద ఉద్యమాలు, భారతీయ వైజ్ఞానిక పరిశోధనలలో తెలుగువారి కృషిని సవివరంగా గ్రంథస్థం చేయడమే కాదు, తాను అందులో ఒకడిగా నిలిచిన చందు సుబ్బారావు చిరస్మరణీయుడు.
ప్రొఫెసర్ కె.యస్.చలం
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More TG News And Telugu News