శ్రీలంకలో తెలుగును బతికించండి
ABN , Publish Date - May 12 , 2026 | 12:33 AM
‘అమ్మా... తెలుగు జాతివాళ్లం ఈ శ్రీలంకలో దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నాం. మాలో చాలా మంది బ్రిటిష్ కాలంలో పనుల కోసం ఇక్కడికి వచ్చినవాళ్లమే. కొద్దో గొప్పో బాగానే ఉన్నాం. అయితే మేం...
‘అమ్మా... తెలుగు జాతివాళ్లం ఈ శ్రీలంకలో దాదాపు ఎనిమిది లక్షల మంది ఉన్నాం. మాలో చాలా మంది బ్రిటిష్ కాలంలో పనుల కోసం ఇక్కడికి వచ్చినవాళ్లమే. కొద్దో గొప్పో బాగానే ఉన్నాం. అయితే మేం తెలుగువాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మీలా చక్కని తెలుగులో మాట్లాడలేకపోతున్నాం. మా పిల్లలైనా తెలుగు మాట్లాడాలని, తెలుగులో రాయాలని ఆశపడుతున్నాం. మేము తెలుగు నేర్చుకోవడానికి సహాయం చేస్తారా? మన భాష పోతే తెలుగు ఆచారాలు, పద్ధతులు అన్నీ పోతాయి.. శ్రీలంకలో తెలుగు జాతికి అస్తిత్వమే ఉండదు’. ఇటీవల శ్రీలంకకి వెళ్లినప్పుడు కలసిన కొలంబో నివాసి ఎం.అంబులగన్ ఆవేదన ఇది. ఆయన ‘ఆల్ సిలోన్ తెలుగు కాంగ్రెస్’ అధ్యక్షులు.
శ్రీలంకలో తెలుగు సంతతివాళ్లు మూడు రకాలు. 1) కాండీని మదురై నాయక రాజులు పరిపాలించిన సమయంలో వారి పరివారంలో భాగంగా శ్రీలంకకు వెళ్లినవాళ్లు. 2) బ్రిటిష్ వారి హయంలో తేయాకు తోటల్లో పనుల కోసం శ్రీలంకకు వలస వెళ్లినవాళ్లు. 3) అహికుంతికలు– శ్రీలంక మూలవాసుల్లో ఒకరు.
మొదటి రెండు వర్గాలవాళ్లు కాలమాన పరిస్థితులను బట్టి మారుతూ జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇక మూడో వర్గం వాళ్లు సామాజికంగా అట్టడుగు స్థాయిలో ఉన్న సంచార జాతుల వాళ్లు. సాంఘిక కట్టుబాట్ల వల్ల అందరితో కలవలేక ఇప్పటికీ తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే వాళ్లు మాట్లాడే తెలుగు చాలా పాతతరాలకి చెందినదే అయినా ఇంకా నిలచి ఉంది. వాళ్ల మాటల్లో పాత తెలుగు మాటలు ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. ఆకుకూరల్ని వాళ్లు ‘కూరాకు’ అంటారు. చెట్లని ‘మానులు’ అని, డబ్బుని ‘లెక్క’ అని అంటారు. వాళ్ల ఇళ్లల్లో ఇప్పటికీ ధాన్యం ‘గరిసెలు’ ఉన్నాయి. ఇవన్నీ స్వచ్ఛమైన తెలుగు పదాలు. అనురాధపురా, పుత్తలం, ట్రింకోమలి, బట్టికులోవా, అక్కరైపట్టు తదితర ప్రదేశాలలో సుమారు పదివేల మంది నివసిస్తున్నారు. పాముల్నీ కోతుల్నీ ఆడిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ తరానికి చెందిన చాలా కొద్ది మంది డ్రైవర్లు, టూరిస్టు గైడ్లుగా కుదురుకుంటున్నారు.
ఇక బ్రిటిష్ హయాంలో వలసవాళ్లు తెలుగును ఓ మోస్తరుగా మాట్లాడగలరు. తమిళం, సింహళంలో ధారాళంగా మాట్లాడతారు. అందుకే అంబులగన్ తెలుగును రక్షించమని అడుగుతున్నారు. శ్రీలంకలో చాలా తక్కువగా ఉన్న మలయాళీలకు కేరళ ప్రభుత్వం ఏనాడో పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మించిందని, మన వాళ్లకి కూడా ఓ ‘తెలుగు భవనం’ కావాలని ఆయన కోరుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పూనుకుంటే, వందల ఏళ్ల నాటి తమ కల నెరువేతుందని, శ్రీలంకలో తెలుగువాళ్లకు గుర్తింపు లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో పర్యటించిన శ్రీలంక బుద్ధశాసన, రిలిజియస్ అండ్ కల్చరల్ అఫైర్స్ మంత్రి డా. హినిదుమా సునీల్ సేనేవిని కలిసి, ఆ దేశంలో తెలుగు వారి గురించి ఓ అవగాహనా పత్రాన్ని అందజేశాను. ఓ కార్యాచరణతో రమ్మని, తనవంతు సహాయం అందజేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. శ్రీలంకలో ‘తెలుగు భవనం... అందులో తెలుగు పాఠాలు’ సమీప భవిష్యత్తులో మొదలవుతాయని ఆశిద్దాం.
డి.పి. అనురాధ (జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం
కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News