Sankranti Splendor at Kothakonda: సంక్రాంతి శోభ.. వీరభద్ర ప్రభ
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:19 AM
పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడి జాతర రాష్ట్రంలోని అతి పెద్ద జాతరల్లో ఒకటి. ఇది ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో ఘనంగా...
పూర్వ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండలో కొలువుదీరిన వీరభద్రుడి జాతర రాష్ట్రంలోని అతి పెద్ద జాతరల్లో ఒకటి. ఇది ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో ఘనంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. భోగి పండుగకు ముందు రోజు రాత్రి ‘కొత్తకొండ వీరభద్రస్వామికి శరభ’ అనే శరణుఘోషతో పరిసర గ్రామాల ప్రధాన రహదారులు మార్మోగుతాయి. దారి వెంట శివసత్తుల నృత్యాలు చూపు తిప్పుకోనివ్వవు. అందంగా అలంకరించిన ప్రభ బండ్లు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీరభద్రుడికి భోగి రోజున వీరబోనం సమర్పించేందుకు అంతకుముందు రోజు రాత్రే కడిపికొండ, దామెర గ్రామాల నుంచి శాలివాహన (కుమ్మరి) కులానికి చెందిన దామెరుప్పుల వంశీయులు, ఇతర భక్తులు కలిసి కొత్తకొండకు బయల్దేరతారు. స్వామికి వీరబోనం సమర్పించి, సంక్రాంతి ఉత్సవాల అనంతరం కనుమనాడు ఇంటికి తిరుగుముఖం పడతారు. దాదాపు ఏడు శతాబ్దాలుగా ఈ ఆచారం కొనసాగుతోంది.
కొత్తకొండ వీరభద్రస్వామి జాతరకు సంబంధించి ఒక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. ‘కాకతీయుల కాలంలో– ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని మడికొండ మెట్టుగుట్ట సమీపంలో దామెరుప్పుల వంశానికి చెందిన ఏడుగురు అన్నదమ్ములు నివాసముండేవారు. కలప సేకరణ కోసం వారంతా ఒకనాడు ఎండ్ల బండ్లు కట్టుకుని కొత్తకొండ గుట్ట వద్దకు వెళ్లారు. కలప సేకరణ అనంతరం ఆ అన్నదమ్ములు అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి ఎద్దులు ఉన్నట్టుండి కన్పించకుండా పోయాయి. వాటి కోసం వెతికిన అనంతరం అలసటతో వారంతా నిద్రలోకి జారుకున్నారు. వారిలో ఒకరికి వీరభద్రుడు కలలో సాక్షాత్కరించాడు. తాను అక్కడే కొత్తకొండ గుట్టపై కొలువై ఉన్నానని, అంత పైకి భక్తులు రాలేకపోతున్నారని, భక్తుల సౌకర్యార్థం తనను గుట్ట కింద భాగంలో ప్రతిష్ఠించాలని ఆదేశించాడు. ఆ అన్నదమ్ములు నిద్ర నుంచి మేల్కొన్న కొంతసేపటికే వారి ఎద్దులు దొరికాయి. కొత్తకొండ సమీపంలోని ఇతర గ్రామస్థుల సహకారంతో వీరభద్రస్వామి విగ్రహాన్ని గుట్ట కిందకు తీసుకువచ్చారు. అక్కడి చెంచులక్ష్మి ఆలయం వద్ద భద్రకాళీ సమేత వీరభద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.’ ఇలా ఎడ్లబండ్లపై వచ్చి, భోగి నాడు వీరభద్రుడికి వీరబోనం సమర్పించే ఆచారం, ఈ సందర్భంగా జరిగే జాతర అప్పటి నుంచే మొదలైందని భక్తులు చెబుతారు. తమ పూర్వీకులు అందించిన సంప్రదాయాన్ని దామెరుప్పుల వంశస్థులు శతాబ్దాల తరబడి కొనసాగిస్తూ వస్తున్నారు. వీరభద్రుడి దర్శనం కోసం జాతరకు ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పిల్లల భవిష్యత్తు, చదువు, ఉద్యోగం, పెళ్లి, ఇంటి నిర్మాణం... ఇలా తమ కోరికలు నెరవేరితే, అక్కడ బండి కడతామని భక్తులు వీరభద్రుడికి మొక్కుకుని, అనంతరం తమ మొక్కులు చెల్లించుకుంటారు.
ఇంత ప్రసిద్ధి చెందిన కొత్తకొండ జాతరకు వచ్చే భక్తులను మౌలిక వసతులు, సదుపాయాల కొరత వేధిస్తోంది. దూరప్రాంతాల నుంచి వచ్చి, అక్కడే మూడు రోజులపాటు బసచేసే భక్తులకు సరైన వసతులు నేటికీ అందుబాటులోకి రాకపోవడం విచారకరం. దేవాదాయ, పోలీసు శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అనాదిగా కొనసాగుతూ వస్తున్న గర్భాలయ ప్రత్యేక దర్శనాన్ని కూడా నిలిపివేశారు. మరోవైపు, వాహనాలను కొండ పరిసరాల్లోకి అనుమతించకపోవడం, ఒక్కోసారి ఏకంగా ఎడ్లబండ్లను ఆపేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, కొత్తకొండ జాతరకు వచ్చే భక్తుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలి. వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలి.
సతీశ్ కుమార్ నూటెంకి
ఇవి కూడా చదవండి..
డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి