వెస్ట్‌బ్యాంక్‌పై బకాసుర కుట్ర
ABN , Publish Date - Feb 18 , 2026 | 01:07 AM
అద్భుతమైన గాజాను స్మశానంలాగా మార్చేసిన ఇజ్రాయెల్ దృష్టి ఇప్పుడు వెస్ట్‌బ్యాంక్‌మీదకు మళ్ళింది. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలన్నింటినీ తుంగలోతొక్కి, ఆ ఆక్రమిత ప్రాంతంలో అధికభాగం మింగేయడానికి ఇజ్రాయెల్...
అద్భుతమైన గాజాను స్మశానంలాగా మార్చేసిన ఇజ్రాయెల్ దృష్టి ఇప్పుడు వెస్ట్‌బ్యాంక్‌మీదకు మళ్ళింది. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలన్నింటినీ తుంగలోతొక్కి, ఆ ఆక్రమిత ప్రాంతంలో అధికభాగం మింగేయడానికి ఇజ్రాయెల్ సిద్ధపడుతోంది. వెస్ట్‌బ్యాంక్‌లోని పాలస్తీనియన్ల భూములను ప్రభుత్వ ఆస్తిగా మార్చివేసే ఈ కుట్రమీద ఐక్యరాజ్యసమితి ఆవేదనను, ఆశ్చర్యాన్నీ వెలిబుచ్చింది. అరబ్‌దేశాలతో పాటు, యూరోపియన్ యూనియన్ సైతం ఇజ్రాయెల్ మంత్రివర్గ నిర్ణయాన్ని ఖండించింది. స్వతంత్ర పాలస్తీనా ఆశనీ, ఆకాంక్షనీ సమూలంగా నాశనం చేసేందుకు ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాల్లో ఇదీ ఒకటి. ఇజ్రాయెల్ పాలస్తీనాలు ఇరుగుపొరుగుగా వర్థిల్లాలన్న ఆలోచనలను తుంచేయడానికీ, ఆ తరహా ప్రతిపాదనలు ఇకపై బలపడకుండా చేయడానికీ ఇజ్రాయెల్ వేసిన ఎత్తుగడ ఇది.
స్వతంత్ర పాలస్తీనా ఆకాంక్షకు పునాదివంటి వెస్ట్‌బ్యాంక్‌లోని అత్యధిక ప్రాంతాలను ఇజ్రాయెల్ రాజ్యం తన ఆస్తిగా మార్చేయడానికి ఈ కొత్తదారి వెదుక్కుంది. తమ భూములమీద యాజమాన్య హక్కును రుజువుచేసుకోవాల్సిన బాధ్యత పాలస్తీనియన్లదే. వారు తాతలకాలంనాటి భూమిని తమదిగా నిరూపించుకోలేనిపక్షంలో అది ఇజ్రాయెల్ ప్రభుత్వవశం అవుతుంది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో), ఇజ్రాయెల్ మధ్య 1993లోజరిగిన ఓస్లో ఒప్పందం ప్రకారం ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌ను ఏ, బీ, సీలుగా విభజించి, పాలస్తీనా అథారిటీకీ ఆయా ప్రాంతాలపై పాలనాపరమైన అధికారాలను కల్పించారు. సీ కేటగిరీ కిందకు వచ్చే 60శాతం భూభాగంపై నియంత్రణ కూడా వాస్తవానికి పాలస్తీనా అథారిటీకే దక్కవలసి ఉండగా, దానిని ఇజ్రాయెల్ తన నియంత్రణలోనే ఉంచుకొని సర్వహక్కులూ చెలాయిస్తోంది. అరవైయేళ్ళుగా భూ క్రయవిక్రయాలను, నిర్మాణాలను ఇజ్రాయెల్ దాదాపుగా నిలిపివేసిన కారణంగా ఈ ప్రాంతంలో ఇప్పటివరకూ పాలస్తీనియన్లు జరిపిన లావాదేవీలన్నీ అనధికారికమే అవుతాయి. వారసత్వాన్నీ, ఆస్తిహక్కునీ నిరూపించే డాక్యుమెంట్లు అధికుల వద్ద లేకపోవడంతో పాటు, వారిలో వారు చేసుకున్న రాతకోతల ఒప్పందాలు కూడా చెల్లవు కనుక, అక్రమ నిర్మాణాలన్న పేరిట వాటిని కూల్చివేయడానికి ఇజ్రాయెల్‌కు అవకాశం దక్కుతుంది. అనేకతరాలుగా అనుభవిస్తున్న భూమిమీద తమహక్కును అత్యధికశాతం పాలస్తీనియన్లు నిరూపించుకోలేని స్థితి అదంతా ప్రభుత్వ వశం అవుతుంది. ఏరియా సీ పూర్తిగా ఇజ్రాయెల్ అధీనంలో ఉన్నందున, ఇజ్రాయెలీల సెటిల్‌మెంట్లు కూడా ఇక్కడే అధికం. పాలస్తీనియన్లమీద ప్రభుత్వ బలగాలతో పాటు ఇజ్రాయెలీలు కూడా విరుచుకుపడి ప్రతి ఏటా వేలాదిమందిని అక్కడనుంచి తరమికొట్టడం రివాజు. ఓస్లో ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, ఈ ప్రాంతంలో ఇజ్రాయెలీలను స్థిరపరచే కార్యక్రమం క్రమంగా సాగి, నెతన్యాహూ అధికారంలోకి వచ్చిన తరువాత మరింత వేగం పుంజుకుంది. ఇజ్రాయెల్ దాష్టీకాలకు తట్టుకోలేక ఇక్కడనుంచిపోయినవారూ, ఉన్నవారూ కూడా తమ కాళ్ళకింద భూమి తమదేనని నిరూపించుకోలేని స్థితిలో ఉండటం ఇజ్రాయెల్‌కు అందివచ్చిన వరం. పాలస్తీనియన్లను తరిమికొట్టడం, ఉన్నవారికి ఎటువంటి హక్కులూ అనుమతులూ ఇవ్వకపోవడం, మరోపక్క ఇజ్రాయెలీలను తెచ్చి అక్కడ స్థిరపరచి, వారికి అన్ని అనుమతులూ ఇవ్వడం ద్వారా వెస్ట్‌బ్యాంక్‌ను వశపరచుకొనే వ్యూహం అమలవుతోంది.
గాజా మారణకాండ తరువాత, అమెరికా, ఇజ్రాయెల్ వినా మిగతా ప్రపంచమంతా ద్విదేశ సిద్ధాంతానికి కాస్తంత గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో అటువంటి ఆలోచనలకు ఊతమూ, ఊనికా లేకుండా చేయడం నెతన్యాహూ లక్ష్యం. పాలస్తీనియన్లనుంచి ఇలా భూమిని ప్రభుత్వపరం చేసుకొని, ఆ తరువాత దానిని ఇజ్రాయెలీలకు కట్టబెట్టేందుకు, కొత్త ఆవాసాలను సృష్టించేందుకు ఆయన వాడబోతున్నారు. కనీసం వందేళ్ళ వారసత్వాన్ని అరబ్బులు రుజువుచేసుకోవాల్సి ఉండగా, యూదులు మాత్రం యథేచ్ఛగా ఆ భూములను ఆక్రమించుకోగలుగుతారు. ఇక, జనావాసాలు లేని పెద్ద పెద్ద ప్రాంతాలను ప్రభుత్వం నేరుగా తన ఖాతాలో రాసుకోవడం సరేసరి. ఈ కొత్త భూ ఆక్రమణ విధానం ద్వారా వెస్ట్‌బ్యాంక్‌లో యాభైశాతం భూభాగాన్ని ఇజ్రాయెల్ వశపరచుకోగలదని మీడియా విశ్లేషణ. నెతన్యాహూ తెలివితేటలు చూసి ‘బోర్డ్ ఆఫ్ పీస్’ సృష్టికర్త ఎంత మురిసిపోతున్నారో మరి.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News