చర్చలు–దాడులు
ABN , Publish Date - May 28 , 2026 | 03:12 AM
ఒకపక్క చర్చలు, మరోవైపు దాడులతో పశ్చిమాసియా శాంతి కథ నడుస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉండగా, మంగళవారం దక్షిణ ఇరాన్‌మీద అమెరికా జరిపిన దాడులు అత్యంత తీవ్రమైనవి...
ఒకపక్క చర్చలు, మరోవైపు దాడులతో పశ్చిమాసియా శాంతి కథ నడుస్తోంది. తాత్కాలిక కాల్పుల విరమణ అమలులో ఉండగా, మంగళవారం దక్షిణ ఇరాన్‌మీద అమెరికా జరిపిన దాడులు అత్యంత తీవ్రమైనవి. క్షిపణులను మోహరిస్తున్నదనీ, మందుపాతరలు అమరుస్తున్నదనీ ఆరోపిస్తూ ఇరాన్‌మీద జరిపిన ఈ దాడిని అమెరికా ఆత్మరక్షణగా చెప్పుకుంది. ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సైతం అమెరికా విమానాన్నీ, ఒక అత్యున్నతస్థాయి డ్రోన్‌ను కూల్చివేసింది. ఖతార్ చర్చల్లో ఒకరీతిగా, యుద్ధక్షేత్రంలో మరోవిధంగా ప్రవర్తించడం ద్వారా అమెరికా నిజంగానే ఇరాన్‌తో సయోధ్యకు సిద్ధంగా ఉన్నదా, లేక ఏకపక్షంగా ఆరంభించిన ఈ యుద్ధాన్ని తీవ్రంగా కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నదా అన్న అనుమానాలు కలగకమానవు.
ఇరుపక్షాలు మళ్ళీ తీవ్రయుద్ధానికి ఉపక్రమించే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువే. కానీ, ఎంతో కష్టంమీద ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏవో కారణాలతో ఉల్లంఘిస్తూ పోతే శాంతి సాధన అసాధ్యం. చిన్నదాడికి కూడా ప్రతీకారం తప్పదని హెచ్చరించి, ఎంతోకొంత స్థాయిలో దానికి బదులు తీర్చుకోవాల్సిన స్థితి. లెబనాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఏమాత్రం గౌరవించడం లేదు. హిజ్బొల్లాతో సాగుతున్న యుద్ధం పూర్తిగా నిలిచిపోయి, సామాన్యులకు ఊరట దక్కింది లేదు. మంగళవారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో యాభైమంది వరకూ లెబనాన్ పౌరులు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అణుకార్యక్రమం, హోర్ముజ్ దిగ్బంధం వంటి కీలకమైన అంశాల్లో ఇప్పటికీ అమెరికా–ఇరాన్ మధ్య సయోధ్య కుదరలేదు. శాంతి ఒప్పందం ఎంతో దూరంలో లేదన్నమాట ఎప్పటినుంచో వినబడుతున్నదే. ఏదో ఒక విధంగా హోర్ముజ్‌ను విముక్తం చేస్తామని అమెరికా ఇంకా చెబుతూనే ఉంది కానీ, క్షేత్రస్థాయిలో మార్పు కనబడటం లేదు. ఈ జలసంధి విషయంలో అడుగుముందుకు పడిందని ఉభయపక్షాల్లో ఎవరు చెప్పినా, అసత్యప్రచారం పేరిట మరొకరు ఖండించడం కొనసాగుతోంది. హోర్ముజ్‌ను తెరిచేందుకు ఉద్దేశించిన ముసాయిదాకు అమెరికా అంగీకరించిందన్న ప్రచారం కూడా ఇటువంటిదే.
ఒప్పందం కోసం ఇరాన్ అర్రులుచాస్తోంది కానీ, అందుకు తగిన వాతావరణం ఇంకా ఏర్పడలేదని ట్రంప్ తన మంత్రివర్గ సమావేశం సందర్భంలో ఓ వ్యాఖ్య చేశారు. రూబియో వ్యాఖ్యలు కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నాయి. యుద్ధానికి తాము సిద్ధమే కానీ, దౌత్యానికే ప్రాధాన్యం అంటున్నారు వీరిద్దరూ. చర్చలు చక్కగా సాగుతున్నాయంటూనే, ఇరుపక్షాలూ కనీసం ఒక్క అంశంలో కూడా ఏకమాటగా లేకపోవడం, అన్ని విషయాల్లోనూ ఖండించుకోవడం విచిత్రం. మూడు నెలలుగా ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో పరోక్ష చర్చలు సాగుతున్నప్పటికీ వ్యవహారం పెద్దగా ముందుకు కదలకపోవడం విశేషం. దీనికితోడు ఇరాన్‌తో శాంతిచర్చల్లో పాల్గొంటున్న దేశాలు అబ్రహాం ఒప్పందంపై సంతకాలు చేయడం వంటి ప్రతిపాదనలతో ట్రంప్ సరికొత్త అడ్డంకులను సృష్టిస్తున్నారు. ఖతార్‌లో చర్చలు చివరి అంకంలో ఉండగా ఇరాన్‌మీద మళ్ళీ దాడికి దిగడం, ఇజ్రాయెల్ ఉనికి, దురాక్రమణలకు నైతికతను చేకూర్చే అబ్రహాం ఒప్పందాలమీద సంతకాలు చేయాలంటూ ముస్లిందేశాల మీద ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు వ్యూహాత్మకమైనవి. ఎక్కువ దేశాలు తన ప్రతిపాదనను కాదుపొమ్మంటాయని ట్రంప్‌కు తెలియకపోదు. ఇజ్రాయెల్‌పై నమ్మకం లేనందున ఈ ఒప్పందంలో చేరేది లేదని పాకిస్తాన్ వెంటనే వ్యాఖ్యానించింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి దీనిని ఒక కీలకమైన మెట్టుగా ముందుకు తెచ్చి, క్రమంగా ఒక బలమైన డిమాండ్‌గా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వల్లనే ఇరాన్‌తో ఒప్పందం కుదరడం లేదని ట్రంప్ సన్నిహిత సెనెటర్ లిండ్సే వంటివారు ఎదురుదాడి ఆరంభించారు కూడా. ట్రంప్ తొలివిడత పాలనలో ఓ నాలుగుదేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేసిన మాట నిజం. ఇన్నేళ్ళపాటు ఊరుకొని, అప్పట్లో ససేమిరా అన్న మిగతాదేశాలను ఇప్పుడు ఒత్తిడిమీద లొంగదీయాలని అమెరికా అనుకుంటోంది. పూర్తిగా ఇజ్రాయెల్ పక్షాన నిలబడిన అమెరికా అధ్యక్షుడు ఇంకా ఎంతకాలం ఈ చర్చల అంకాన్ని కొనసాగిస్తూ ప్రపంచాన్ని మాయచేస్తారో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
న్యాయవాది మొయినుద్దీన్ హత్యకేసులో కీలక పరిణామం
లోకేష్ నాయకత్వంలో టీడీపీ మరింత బలంగా ముందుకెళ్తుంది: ఎంపీ శ్రీభరత్
For More AP News And Telugu News