Share News

ఆత్మనిర్భరత బాటలో...

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:04 AM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కొత్త బడ్జెట్‌ ఎలాంటి మెరుపులు, ఆశ్చర్యపరిచే ప్రకటనలు లేకుండా సాగిపోయింది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికలను...

ఆత్మనిర్భరత బాటలో...

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన కొత్త బడ్జెట్‌ ఎలాంటి మెరుపులు, ఆశ్చర్యపరిచే ప్రకటనలు లేకుండా సాగిపోయింది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, అస్సాం అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని జనాకర్షణ ప్రకటనలుండవచ్చునన్న ఊహాగానాలకు ప్రారంభంలోనే నిర్మలమ్మ తెర దించారు. ‘‘జనాకర్షణ కాదు... జన సంక్షేమమే ప్రధానం’’ అని తేల్చి చెప్పారు. నరేంద్ర మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బడ్జెట్‌ దిశ మారింది. భారీ తాయిలాలతో ప్రజలను బుజ్జగించే ధోరణులకు చరమగీతం పాడింది. దీర్ఘకాలిక వృద్ధికి పెద్దపీట వేయడం, 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’గా దేశాన్ని తీర్చి దిద్దడానికే పెద్దపీట వేసింది. ఈ ప్రయాణంలో మరో ముందడుగు 2026–27 సంవత్సరానికి నిర్మల ప్రకటించిన ఈ బడ్జెట్‌ అని చెప్పవచ్చు. గత ఏడాది ద్వితీయార్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన భారీ సుంకాల ప్రభావంతో చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం భారీగా దెబ్బతింది. ఉపాధి రంగంలో సింహభాగం ఈ రంగాలదే. అందుకే ఈ రంగాలను ఆదుకునేందుకు రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం అభిలషణీయమైన చర్య. దీనివల్ల ఎంఎస్‌ఎంఈ రంగంలో నిధుల కొరత తీరుతుంది. అలాగే గత కొన్నేళ్లుగా పలు కీలక రంగాలు సెమీ కండక్టర్‌ చిప్‌ల కొరతతో అల్లాడిపోతున్నాయి. దేశీయంగా వాటి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే ఈ బడ్జెట్‌లో ఇండియా సెమీ కండక్టర్‌ మిషన్‌ 2.0 ప్రకటించి కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచారు. ప్రస్తుతం అమలు జరుగుతున్న సెమీ కండక్టర్‌ మిషన్‌ 1.0 కేటాయింపులతో పోల్చితే సుమారుగా రెట్టింపు చేశారు. దీనితో పాటుగా రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్లు, టెక్స్‌టైల్స్‌, బయోఫార్మా, ఎలక్ర్టానిక్స్‌ ఉపకరణాలు, యంత్రపరికరాలు, రసాయనాల రంగాలను వ్యూహాత్మక ప్రాధాన్యతా రంగాలుగా ప్రకటించడం వల్ల వాటికి ప్రభుత్వం నుంచి మరింత అధికంగా మద్దతు లభిస్తుంది. బయోఫార్మా రంగం కోసం రూ.10,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం ఆ రంగానికి ఎంతో ఉత్తేజం కల్పిస్తుంది. దేశంలో మధుమేహం, క్యాన్సర్‌ వంటి జీవనశైలి వ్యాధులు ప్రబలిపోతున్న దశలో ఇది మంచి అడుగు. ఆ వ్యాధులను ఎదుర్కొనేందుకు అవసరమైన ఔషధాల తయారీకి ఇది మద్దతు ఇస్తుంది. అంతే కాదు...పలు కీలక రంగాలకు అరుదైన ఖనిజాల లభ్యతను పెంచేందుకు దేశంలో ఏర్పాటు చేయనున్న నాలుగు రేర్‌ ఎర్త్‌ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌కు కూడా స్థానం లభించడం హర్షదాయకం.


అలాగే దేశంలో ఇటీవల కాలంలో డేటా సెంటర్ల విస్తరణ జోరుగా సాగుతోంది. గతంలో ఐటీ తరహాలో ఉపాధికల్పనకు ఇప్పుడు డేటా సెంటర్లు కీలకంగా మారాయని నిపుణులంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు 2047 వరకు పన్ను విరామం ఇవ్వడం ఆ రంగాన్ని ఎంతో ఉత్తేజితం చేస్తుంది. ఇందులో ఇప్పటికే హైదరాబాద్‌ కీలక కేంద్రంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇప్పుడు ఆ పోటీలో ప్రవేశించింది. ఆ రకంగా ఈ చర్య రెండు రాష్ట్రాలకు ఎంతో సహాయకారి అవుతుంది. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తూ కేటాయింపులు సైతం పెంచుకుంటూ వస్తోంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ మూలధన వ్యయాలను రూ.12.22 లక్షల కోట్లకు, అంటే గత బడ్జెట్‌తో పోల్చితే 12.5శాతం పైబడి పెంచడం కూడా ఆర్థిక రంగాన్ని ఉత్తేజితం చేస్తుంది. కీలక రంగాలకు అవసరమైన నిధులు అందుబాటులోకి వచ్చి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇందులో భాగంగానే కొత్త బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్‌ కారిడార్లను ప్రతిపాదించగా వాటిలో మూడు హైదరాబాద్‌తో అనుసంధానమైనవి కావడం కూడా తెలుగు రాష్ట్రాలకు ఆనందం కలిగించే అంశం. దేశాన్ని విదేశీ మూకల నుంచి కాపాడాలంటే రక్షణ రంగాన్ని పటిష్ఠం చేయడం ఎంతో అవసరం. ఇటీవల కాలంలో పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, చైనా నుంచి ముప్పు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో రక్షణ బడ్జెట్‌ను ఏకంగా జీడీపీలో 2 శాతానికి పెంచడం సాయుధ దళాల పోరాట సంసిద్ధతను, సామర్థ్యాన్ని మరింతగా పెంచడానికి దోహదపడే చర్య. మొత్తం మీద ఈ బడ్జెట్‌ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ విభిన్న కోణాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ దేశాన్ని ఆత్మనిర్భరత బాటలో నడుపుతుందని ఆశించవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్

బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్

For More TG News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 03:04 AM