వేయివిధాల వెర్రి
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:33 AM
అమెరికా అధ్యక్షుడు మరో విన్యాసం చేశారు. కెనడా, వెనెజువెలా, గ్రీన్‌ల్యాండ్‌లను తనదేశంలో కలిపేసుకున్నారు. మ్యాప్‌లో వీటిని చేర్చిన సంతోషాన్ని తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా మిగతా...
అమెరికా అధ్యక్షుడు మరో విన్యాసం చేశారు. కెనడా, వెనెజువెలా, గ్రీన్‌ల్యాండ్‌లను తనదేశంలో కలిపేసుకున్నారు. మ్యాప్‌లో వీటిని చేర్చిన సంతోషాన్ని తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా మిగతా ప్రపంచంతో పంచుకున్నారు. ఎవరి వెర్రి వారికి ఆనందం అని తేలికగా తీసిపారేయడానికి లేదు. ఈ మూడింటినీ ఆయన ఎప్పటినుంచో కలవరిస్తున్నాడు, అమెరికాలో విలీనం చేయాలని కలలు గంటున్నాడు. నిన్నటివరకూ మాటలకే పరిమితమైనవాడు నేడు మ్యాపులవరకూ వచ్చాడు. రేపోమాపో తాను చేయబోయేదీ, ఆరునూరైనా జరగబోయేదీ ఇదేనని తేల్చి చెబుతున్నాడు.
సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టుచేసిన రెండు చిత్రాలు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో రూపొందినవి. మిగతాదేశాధినేతలకంటే ఆయనకు కృత్రిమమేధ సహాయం ఎక్కువ అవసరం. ఒక చిత్రంలో ఆయన గ్రీన్‌ల్యాండ్‌లో అమెరికా జెండా పాతుతున్నాడు, పక్కన ఒక బోర్డుమీద అమెరికా భూభాగం–2026అని రాసివుంది. మరోపోస్టులో కొత్త అమెరికా మ్యాప్ వెనకన ఉండగా, ఓవల్ ఆఫీసులో నాటో దేశాధినేతలతో ముచ్చటిస్తున్నాడు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డేర్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్టే సహా ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ ఇత్యాది నేతలంతా ట్రంప్ ఉపన్యాసాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో వింటున్నారు. ఆయన ఈ మూడుప్రాంతాలనూ దురాక్రమించి తన దేశంలో కలిపేసుకున్నప్పటికీ, వీళ్ళెవ్వరూ తలొంచడం వినా ఏమీ చేయలేకపోయారని ఆ చిత్రం సందేశం. వాళ్ళకంత సీన్ లేదు అని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగా ఇది రూపొందింది. గ్రీన్‌ల్యాండ్ విషయంలో తాను ఏమి చేసినా యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేయగలిగేదేమీ ఉండబోదని ట్రంప్ ఇప్పటికే తేల్చేశారు. ఈ భూప్రపంచంమీద అమెరికాను మించిన శక్తిమంతమైన దేశం మరొకటి లేదని కూడా ఆయన సందర్భోచితంగా భయపెట్టారు.
అమెరికా రక్షణకు గ్రీన్‌ల్యాండ్ అత్యావశ్యకమని, దానిని సాధించి తీరుతానని ట్రంప్ చెబుతున్నారు. అది గనుక రష్యా, చైనాల చేతుల్లోకి పోతే అమెరికా ఉనికికే ప్రమాదం కనుక కలిపేసుకోవాలన్నది లక్ష్యం. ఈ ఆర్కిటిక్ ద్వీపం, పాక్షికంగా దానిని నియంత్రిస్తున్న డెన్మార్క్ అందుకు ఒప్పుకోవడం లేదు. గ్రీన్‌ల్యాండ్‌ను కాపాడుకోవడం కోసం డెన్మార్క్ ఏకంగా కొంత సైన్యాన్ని తరలించి, ప్రచ్ఛన్నయుద్ధకాలం నాటి కనిపిస్తే కాల్చివేత తరహా ఆదేశాలు కూడా అమల్లో పెట్టింది. అమెరికా సైనికులు కనిపించగానే, ఉన్నతస్థాయి ఆదేశాలకోసం కూడా ఎదురుచూడనక్కరలేకుండా డెన్మార్క్ యోధులు తుపాకులు పేల్చవచ్చు. దృశ్యాన్ని ఊహిస్తే గలివర్–లిలీపుట్ చిత్రం గుర్తుకు వస్తుంది కానీ, ఈ చర్యతో డెన్మార్క్ అందించిన ప్రతిఘటన సందేశం మెచ్చదగింది. అమెరికా పక్షాన నిలవకుండా డెన్మార్క్‌ను వెనకేసుకొస్తున్న ఐరోపా దేశాలమీద పదిశాతం సుంకాన్ని శిక్షగా విధించిన ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ వంటివారు పంపిన రహస్య సయోధ్య సందేశాలను సైతం బహిర్గత పరుస్తూ కయ్యానికి కాలుదువ్వుతున్నారు. మరోపక్క, హిందుమహాసముద్రంలోని డీగోగార్షియా దీవిని మారిషస్‌కు అప్పగించడానికి సిద్ధపడిన బ్రిటన్ ప్రధానిని చేతకానివాడంటూ నిందిస్తూ, చైనా రష్యాలు దమ్మున్నవారిని మాత్రమే గుర్తిస్తాయనీ, అందుకే తాను అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలోనే అమెరికాకు ఎక్కడలేని గౌరవమూ దక్కిందని ఆయన చెప్పుకున్నాడు.
గ్రీన్‌ల్యాండ్ అమ్ముడుపోదని ఎందరు నినదించినా, మిత్రదేశాలు అడ్డంపడుతున్నా, ‘నోరాడ్’ ముసుగులో అమెరికా తన విమానాలను గ్రీన్‌ల్యాండ్‌కు తరలించడం ఉద్రిక్తతలను పెంచుతోంది. అమెరికా అధ్యక్షుడి దూకుడునూ, తమపై విధించిన సుంకాలను నిరసిస్తూ ఆ దేశంతో కుదర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఈయూ పార్లమెంట్ నిర్ణయించుకోవడం, గ్రీన్‌లాండ్ ప్రజలపక్షాన నిలబడాలని ఐరోపా దేశాలు ఏకమాటగా అనుకోవడం విశేషమైన పరిణామాలు. దశాబ్దాల స్నేహాన్ని వమ్ముచేస్తూ అమెరికా తన పాశ్చాత్యమిత్రదేశాలపైనే కాలుదువ్వుతోంది. ట్రంప్ ఏలుబడిలో ఉన్నంతకాలం ఆ దేశాన్ని ఏమాత్రం నమ్మకూడదన్న జ్ఞానం వాటికి ఈ పాటికే కలిగివుండాలి. మిత్రదేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించని ట్రంప్ ధోరణి నాటో ఐక్యతను దెబ్బతీస్తోంది. కృత్రిమమేధతో తయారైన ఆ మ్యాప్ మూడింటిని మాత్రమే విలీనం చేసుకున్నప్పటికీ, అగ్రరాజ్య ప్రయోజనాల ముందు ఏ దేశ సార్వభౌమత్వమూ నిలవదని మిగతా ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News