Donald Trump Iran Threat: ఇరాన్‌కు ట్రంప్ గండం!
ABN , Publish Date - Jan 08 , 2026 | 01:02 AM
తన దేశం ప్రజాస్వామ్యం వైపు ప్రయాణిస్తోందని ఇరాన్ చిట్టచివరి షా పెద్దకుమారుడు మహ్మద్ రెజా పహ్లావి అంటున్నారు. మతపెద్దల పాలనలో యాభైయేళ్ళుగా విసిగివేసారిన...
తన దేశం ప్రజాస్వామ్యం వైపు ప్రయాణిస్తోందని ఇరాన్ చిట్టచివరి షా పెద్దకుమారుడు మహ్మద్ రెజా పహ్లావి అంటున్నారు. మతపెద్దల పాలనలో యాభైయేళ్ళుగా విసిగివేసారిన ఇరానియన్లు తమ ఉజ్వల భవిష్యత్తుకోసం, భావితరాల అభ్యున్నతికోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాటాలు చేస్తున్నారని పహ్లావి ప్రశంసించారు. ఒక హంతకుడినో, రేపిస్టునో సంకెళ్ళు వేసి జైలుకు తరలించినట్టుగా ఒకదేశాధ్యక్షుడిని సైనికహెలికాప్టర్‌లో అమెరికా తరలించుకుపోయిన డోనాల్డ్‌ట్రంప్ అదేరీతిలో ఇరాన్‌లోనూ చొరబడి, అక్కడి పాలకులను కూల్చి తనను ప్రతిష్ఠిస్తారని పహ్లావీకి ఆశలు చిగురించి వుంటాయి. మదురోను అమెరికా ముట్టడించిన తీరు చూసిన వారికి తరువాత దెబ్బ ఇరాన్‌కు తగలక తప్పదనిపించడం సహజం. సామాన్యులే కాదు, మహామహా మేధావులు సైతం ట్రంప్ త్వరలోనే ఇరాన్ పాలకులను మట్టుబెట్టి, ఇజ్రాయెల్ ముచ్చట తీర్చడం ఖాయమని అంటున్నారు. మాదకద్రవ్యాల ఉగ్రవాది అన్న ఆరోపణమీద మదురోను సునాయాసంగా ఎత్తుకుపోయి అమెరికా బోనులో నిలబెట్టిన ట్రంప్, ఇజ్రాయెల్ పక్షాన ఇరాన్‌తో యుద్ధం చేసి, శత్రువులను హతమారుస్తాడని నమ్ముతున్నారు. ట్రంప్ దూకుడుని ఎన్నో దేశాలు ఖండించినా, అంతకుమించి ఎవరూ ఏమీ చేయని, చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు, ఇటువంటి నమ్మకాలు కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు.
ఇరాన్‌లో కరెన్సీ విలువపడిపోయినందుకు దుకాణదారులు ఆగ్రహంతో రోడ్డుమీదకు వస్తే, పదిరోజుల్లోనే అది మహోధృత ప్రజాఉద్యమంగా రూపాంతరం చెందడం వెనుక అమెరికా ప్రోద్బలమూ, ఆశీస్సులు ఉన్నాయని అంటారు. గతంలో ఇలాంటి అందోళనలు రేగినా, ఇరాన్ పాలకులు వాటిని సునాయాసంగా అణచివేశారు. కానీ, ఇప్పుడు దేశంలో సగానికిపైగా ప్రావిన్సులకు విస్తరించిన నిరసనలు ఇటీవలికాలంలో చూడనివని, నియంత్రించడం కష్టమని వార్తలు వస్తున్నాయి. మదురోను అమెరికా ముట్టడించిన ఘట్టం ఇరానియన్లలో ఉత్సాహాన్ని పెంచిందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న నమ్మకాన్ని పెంచిందని, మరోపక్క, నిరసనలను కఠినంగా అణచివేసే విషయంలో ఇరాన్ పాలకులు వెనక్కుతగ్గుతున్నారని మీడియా అంటోంది. నిరసనకారులమీద బలప్రయోగం వద్దు అన్న ఇరాన్ అధ్యక్షుడి ఆదేశాల వెనుక, వారి జోలికి వస్తే ఊరుకొనేదిలేదని, బరిలోకి దిగుతానని ట్రంప్ చేసిన హెచ్చరిక పనిచేసిందని కొందరి నమ్మకం. వందలాది అరెస్టులు జరిగిపోయి, ముప్పైఐదుమంది ప్రాణాలు పోయిన నేపథ్యంలో, అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ శాంతియుతంగా నిరసిస్తున్నవారి జోలికిపోకండని తన బలగాలకు ఓ మాట చెప్పడం కూడా ఇప్పుడు ట్రంప్ ఖాతాలోకే పోతోంది.
మందుగుండు దట్టించి, లాక్ బిగించానంటున్న ట్రంప్.. మదురో తరహాలో ఇరాన్ పెద్దలతో వ్యవహరించలేరన్నది వాస్తవం. తొలివిడత ఏలుబడిలోనే ఆయన వెనెజువెలాలోకి చొరబడాలని నిర్ణయించుకొని మలి రాకడలో ఆ పనిచేశాడని, ఈ కొత్త సంవత్సరం తొలిరోజున ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ పక్కన ఉండగా ‘ఇరాన్.. నెక్స్ట్ నువ్వే’ అని హెచ్చరికలు చేశారు కనుక, త్వరలోనే చొరబాటు ఖాయమని అంతా విశ్లేషిస్తున్నారు. కానీ, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా మధ్య హస్తిమశకాంతరం ఉన్నదని ట్రంప్‌కు తెలియనిది కాదు. అణ్వస్త్రాలు లేకపోవచ్చు కానీ, క్షిపణి సంపత్తి దండిగా ఉన్న ఇరాన్ గట్టిగానే జవాబు చెబుతుంది. రష్యా, చైనాలు సైతం రంగంలోకి దిగే ప్రమాదమూ ఉంది. ఇరాన్‌లో నిరసనలు కొత్తకాదు. గత పాతికేళ్ళలోనే వందలాది నిరసనలు జరిగాయి, అనేకం వాటంతటవే ఆగిపోయాయి, కొన్నింటిని పాలకులు తమ నిర్ణయాలను సరిదిద్దుకోవడం ద్వారా చల్లారిపోయేట్టు చేశారు. ప్రధానంగా చమురు ఎగుమతులు బాగా తగ్గి ఆర్థికంగా ఇప్పుడు మరింత కఠినమైన పరిస్థితులను ఇరాన్ ఎదుర్కొంటున్నది. కరెన్సీ విలువ సగానికి పడిపోవడం, కొనుగోలు శక్తినశించడం ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. గత ఏడాది జూన్‌లో ఇరాన్‌మీదకు కాలుదువ్విన ఇజ్రాయెల్ పక్షాన అమెరికా రంగప్రవేశంచేసి మూడు అణుకేంద్రాలను ధ్వంసం చేసింది. పన్నెండురోజుల ఆ యుద్ధంలో పైచేయి ఎవరిదన్న ప్రశ్న అటుంచితే, ఈ కొత్త సంవత్సరంలో ఇరాన్ జోలికి అమెరికా పోయిన పక్షంలో అది సరిహద్దులకే పరిమితం కాబోదనీ, ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందన్నదీ వాస్తవం.
ఈ వార్తలు కూడా చదవండి..
కోడలి హత్య.. అత్తగారితోపాటు మరో మహిళ అరెస్ట్..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం.. ఉన్నతాధికారులతో సమీక్ష
For More AP News And Telugu News