Share News

ట్రంప్‌ కొత్త ఎత్తు!

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:28 AM

ఇరాన్‌తో తిరిగి యుద్ధం ఆరంభించి, పశ్చిమాసియాలో మంటలు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, అక్కడ మరో ప్రమాదకరమైన ఆటకు తెరదీశారు. సౌదీ అరేబియాతో ‘శాంతియుత అణు సహకార ఒప్పందం...

ట్రంప్‌ కొత్త ఎత్తు!

ఇరాన్‌తో తిరిగి యుద్ధం ఆరంభించి, పశ్చిమాసియాలో మంటలు పెడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, అక్కడ మరో ప్రమాదకరమైన ఆటకు తెరదీశారు. సౌదీ అరేబియాతో ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందనీ, అధ్యక్షుడు సంతకాలు చేశారని అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సౌదీని అడ్డుపెట్టుకొని ఆ ప్రాంతంలో అమెరికా ఆరంభించిన ఈ ఆయుధపోటీమీద తీవ్రమైన విమర్శలు వస్తున్న తరుణంలో, ఇది పౌర అణువిద్యుత్‌ తయారీకి ఉద్దేశించినదేనని, నిన్నటిదాకా ఇరాన్‌ చేసిందే, రేపటినుంచి సౌదీ చేయబోతున్నదని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వ్యాఖ్య చేశారు. సౌదీలో యురేనియం శుద్ధి జరగబోదన్న అర్థంలో కూడా ఆయన ఓ వివరణ ఇచ్చారు. కానీ, యురేనియం శుద్ధిప్రక్రియ అణువిద్యుదుత్పత్తి అవసరాన్ని మించి జరగకుండా నియంత్రించే ‘గోల్డ్‌ స్టాండర్డ్’ విషయంలో సౌదీకి అమెరికా మినహాయింపులు ఇచ్చిందన్న లోగుట్టు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. గతంలో అరబ్‌ ఎమిరేట్స్‌తోనూ అమెరికా ఇదే తరహా ఒప్పందం చేసుకున్నా అది ఈ గీత దాటలేదు.

అణుబాంబు తయారీకి ఇరాన్‌ అతిదగ్గరలో ఉన్నదని, దాని యురేనియం శుద్ధి హద్దులు దాటిందని, కొండకోనల్లో భారీగా నిల్వలను దాచిపెడుతోందని ఆరోపిస్తున్న ట్రంప్‌ రేపటి రోజుల్లో సౌదీ కూడా అదేదారిలో నడవాలని కోరుకుంటున్నారేమో. ముప్పయ్యేళ్ళపాటు అమలులో ఉండే ఈ ఒప్పందం ద్వారా సౌదీకీ పౌర అణు విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మించడంలో అమెరికా తన సకల పరిజ్ఞానాలతోనూ సాయపడుతుంది. చమురు నిల్వలు అపారంగా ఉన్న సౌదీకి భవిష్యత్తులో ఇంధన బాధలు లేకుండా దాని అవసరాలన్నీ తీరేట్టు చేస్తుంది. సాంకేతిక పరిజ్ఞానం సహా సర్వమూ అమెరికన్‌ కంపెనీలే చక్కబెడతాయి కనుక ఈ ఒప్పదం నుంచి అవి అపారంగా లబ్ధిపొందబోతున్నాయి. ఒప్పందానికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానివ్వకుండా అటు అమెరికా, ఇటు సౌదీ తెగ జాగ్రత్తపడుతున్నాయి కనుక, లోగుట్టు వెలికితీత కోసం మీడియా తెగ కష్టపడుతోంది. చాలా దేశాలు అణువిద్యుత్‌ ఉత్పత్తి చేసుకుంటున్నప్పటికీ, అవి సొంతంగా యురేనియం శుద్ధిచేయకుండా దిగుమతులమీద ఆధారపడినట్టుగానే, సౌదీ కూడా ఈ ప్రాజెక్టులకు అమెరికా నుంచో లేదా అది అనుమతించిన దేశాలనుంచో దిగుమతులు చేసుకుంటుందని, రాబోయే కాలంలో సౌదీ తలెగరేయకుండా ఈ విధానం అమెరికాకు ఉపకరిస్తుందని కొన్ని పత్రికలు అంటున్నాయి. శుద్ధి విషయంలో కనీసం రెండేళ్ళవరకూ అమెరికా ఏ నిర్ణయం చేయదనీ, ఒకవేళ సౌదీలోనే జరిగేందుకు అప్పటి అధ్యక్షుడు అనుమతించినా, శుద్ధి హద్దులు దాటకుండా, అది ఆయుధంగా మారకుండా అమెరికా ఓ కన్నేసి ఉంచుతుందని మీడియా విశ్లేషిస్తోంది.


సౌదీ భవిష్య ఇంధన అవసరాల విషయంలో ఎవరికీ ఏ సందేహమూ లేదు. డేటా సెంటర్లతో సహా చమురు ఉత్పత్తి, సరఫరాలకు కూడా దానికి విద్యుత్‌ అవసరం చాలా ఉంది. అయితే, అంతకుమించి ఇరాన్‌ను హద్దుల్లో ఉంచడమే లక్ష్యంగా సౌదీతో ఈ అణుస్నేహం కుదిరిందన్న విషయంలో ఎవరికీ ఏ సందేహాలు లేవు. ఎంతమంది అమెరికా అధ్యక్షులు మారినా ఈ ఒప్పందం కొనసాగుతుంది కనుక, రేపటి రోజుల్లో అమెరికా ఆదేశాలకు అనుగుణంగా అక్కడ యురేనియం శుద్ధి ఏ స్థాయిలోనైనా జరగవచ్చు, ప్లుటోనియం పక్కదారులూ పట్టవచ్చు. తన ప్రబల శత్రువు ఇరాన్‌ దగ్గర అణుబాంబు ఉంటే, తానూ అమ్ములపొదిలో ఒకటి ధరించకతప్పదని సౌదీ ఎప్పటినుంచో వాదిస్తోంది. అమెరికా కాంగ్రెస్‌ ఈ ఒప్పందాన్ని ఆమోదిస్తుందా లేదా అన్న సంశయాన్ని అటుంచితే, రెండు దశాబ్దాలుగా సౌదీ అరేబియా కంటున్న కల ఇది. దీనిని నెరవేర్చుకోవాలంటే అబ్రాహం ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్‌తో సౌదీ అరేబియా సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని ట్రంప్‌ నొక్కిచెబుతున్నారు. ఒప్పందం కుదిరిన తరువాత ఆట నియమాలు మార్చడం ట్రంప్‌కు మాత్రమే సాధ్యం. ఇజ్రాయెల్‌కు ఎటువంటి సందేహాలు భయాలు లేకుండా ట్రంప్‌ ఈ జాగ్రత్త తీసుకున్నట్టుంది. సర్వస్వతంత్ర సర్వసత్తాక పాలస్తీనా రాజ్యం ఆవిర్భవిస్తే తప్ప ఇజ్రాయెల్‌ మొఖం చూడనని హెచ్చరిస్తున్న సౌదీ అరేబియా ఈ విషయంలో ఏం చేస్తుందో మరి. హమాస్‌ దాడి కనుక జరగకపోతే సౌదీ అరేబియా ఈ పాటికే ఆ పనిచేసేదనీ, ఇజ్రాయెల్‌తో స్నేహం వెల్లివిరిసేదనీ అందరికీ తెలుసు.

ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

Updated Date - Jul 25 , 2026 | 12:28 AM