యుద్ధంలోనూ ఓడినట్టేనా..?
ABN , Publish Date - Nov 17 , 2026 | 01:58 AM
మధ్యంతర ఎన్నికలు కాస్తదూరంగా ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు ప్రతీరోజూ ఇరాన్‌ను అమెరికాతో కాళ్ళబేరానికి రాకపోతే దుంపనాశనం తప్పదని బెదిరించేవారు....
మధ్యంతర ఎన్నికలు కాస్తదూరంగా ఉన్నప్పుడు, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు ప్రతీరోజూ ఇరాన్‌ను అమెరికాతో కాళ్ళబేరానికి రాకపోతే దుంపనాశనం తప్పదని బెదిరించేవారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఆయన స్వరంలో మార్పువచ్చింది. అవి ముగిసేవరకూ ఇరాన్‌మీద కయ్యానికి కాలుదువ్వనని హామీ ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నారు కూడా. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి కనుక ఆయన మళ్ళీ భేరీలు మోగించాలి, రణనినాదాలు చేయాలి. కానీ, తిరిగి యుద్ధంలోకి దిగే, లేదా కొనసాగించే ఆలోచన తనకు లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. తమ గల్ఫ్ మిత్రదేశాలు యుద్ధం వద్దంటూ అదేపనిగా ఒత్తిడిచేస్తున్నాయని, తాను కూడా కాలుదువ్వే ఆలోచనలో లేనన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.
ఇదంతా మధ్యంతర ఎన్నికల ఫలితాల ప్రభావమే అన్నది ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ట్రంప్ వీరంగాలను మిగతా ప్రపంచమంతా చేష్టలుడిగి చూస్తూంటే, అమెరికన్ ఓటరే ఆయనకు ముకుతాడు వేశాడు. ఇరాన్‌మీద తాము చేస్తున్నది యుద్ధం కాదనీ, అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదని ఆ మధ్యన వ్యాఖ్యానించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే అది యుద్ధమేనని జ్ఞానోదయం కలిగింది. ఇరాన్‌తో పెట్టుకున్నందువల్లనే ఘోరంగా ఓడిపోయామని గోసపడ్డాడు ఆయన. వాన్స్ వ్యాఖ్యలు నిజమేనని అధ్యక్షులవారు కూడా ఒప్పుకుంటూనే, ఇరాన్‌వద్ద అణ్వాయుధాలు లేకుండా చేయడానికి యుద్ధం తప్పడం లేదని సమర్థించుకున్నారు. ట్రంప్, వాన్స్ మధ్య ఇరాన్ యుద్ధం అగాధాన్ని పెంచిందని, వాన్స్ తన రాజకీయ భవిష్యత్తు విషయంలో పునరాలోచనలో పడ్డారని, ఒకప్పుడు ట్రంప్ తరువాత కాబోయే అధ్యక్షుడు అనుకున్న ఈయన 2028 ఎన్నికల్లో పోటీచేయాలా వద్దా అన్న సంశయంలో మునిగితేలుతున్నారని వార్తలు విన్నాం. యుద్ధానికి దూరంగా జరుగుతూ ఇలా చేతులు దులిపేసుకుంటున్న వాన్స్‌ను ట్రంప్ ఇరాన్ చర్చల నుంచి తప్పించేసి, డెమోక్రాటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి, నేరాలమీద పనిచేయమంటూ పంపేశారు. ఇరాన్‌ను అణ్వాయుధరహితం చేయడానికే యుద్ధమనీ, అది ఆగాలంటే ఇరాన్ దిగివచ్చి తనతో ఒప్పందం కుదర్చుకోవాలని మొన్నటివరకూ అంతగట్టిగా చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఎలాంటి ఒప్పందం అవసరం లేదంటున్నారు. ఇరాన్‌కు చెందిన వందల బిలియన్ డాలర్లు, హార్ముజ్ జలసంధి తన గుప్పిట్లోనే ఉన్నాయి కనుక, ఇరాన్ ఆర్థికవ్యవస్థ తనకు తానుగానే కుప్పకూలిపోతోంది కనుక యుద్ధం అవసరం లేకుండానే దానంతటదే దారికి వస్తుందంటున్నారు ఆయన. అన్ని సభల్లోనూ డెమోక్రాట్లకు ఆధిపత్యం కట్టబెట్టిన ఎన్నికల ఫలితాలే కాదు, సంప్రదాయ రిపబ్లికన్ ఓటర్లకు సైతం తనమీద మనసు విరిగిపోవడానికి ఇరాన్‌తో యుద్ధం, దాని పర్యవసానాలే కారణమని పలుసర్వేలు కూడా నిర్ధారించిన నేపథ్యంలో, మళ్ళీ ఆ జోలికి పోవద్దని ట్రంప్ అనుకొని ఉంటారు.
గత పాలకుల మాదిరిగా ఎడతెగని యుద్ధాలు చేయనని, ఎవరి ప్రయోజనాలకోసమో అమెరికా సైన్యాన్ని, అమెరికన్ల కష్టార్జితాన్ని బలిపెట్టనని హామీ ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చారు ట్రంప్. నోబెల్ పీస్ ప్రైజ్‌కు తనను మించిన అర్హులెవరూ లేరంటూ అది తనకు రానందుకు కూడా ఆగ్రహించారు, అలిగారు. ఇరాన్‌తో ఆయన యుద్ధం యావత్ ప్రపంచాన్ని తీవ్ర కష్టనష్టాల్లోకి నెట్టింది. 2018లో బరాక్ ఒబామా హయాంలో ఇరాన్‌తో కుదర్చుకున్న ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దుచేసిన ఆయన, గత ఏడాది జూన్‌లో ఇరాన్ మీద ఇజ్రాయెల్‌తో కలిసి తానూ బాంబులేశారు. ఆ దెబ్బతో ఇరాన్ అణుకార్యక్రమాన్ని సమూలంగా నాశనం చేశానని గొప్పలు చెప్పుకొని, ఎనిమిదినెలలు కూడా తిరక్కుండా మళ్ళీ అదే అణు కార్యక్రమం పేరిట యుద్ధం ప్రకటించారు. హార్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ ఇంధనధరలు పెరిగేట్టు చేసి ట్రంప్ కాళ్ళకింద సెగరాజేయడంతో ఎన్నికల్లో ఓడిన ఆయన ఇప్పుడు వెనకడుగువేయాల్సి వచ్చింది. యుద్ధం, ఒప్పందం రెండూ అక్కరలేదన్న ఈ వైఖరి సరైనది కాదు. యుద్ధం ఆపేయాలని ఆయన నిజంగానే అనుకుంటున్నపక్షంలో దౌత్యం ద్వారా మాత్రమే దానిని ముగించాలి. అందుకు ఇరాన్‌తో ఒప్పందం కుదర్చుకోవాలి. అయితే, అందుకు తాను యుద్ధంలో ఓడిపోయానని ఒప్పుకోవాల్సి వస్తుంది కనుక, ఇరాన్ తనకు తానుగా కూలిపోతుందనీ, తాను అమలుచేస్తున్న దిగ్బంధంతో దారికి వస్తుందని ఆయన చెప్పుకుంటున్నారు. ఇంత సుదీర్ఘయుద్ధం తరువాత కూడా ఇరాన్ దిగిరాలేదు, తన డిమాండ్లను సడలించలేదు. మాట నిలకడ లేనితనానికి మారుపేరైన ట్రంప్ ఎంతకాలం ఈ మాటమీద నిలబడతారో చూడాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల
సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్