Nobel Peace Prize Controversy: శాంతి భూతం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:33 AM
అనుకున్నంతా అయింది. భయపడ్డట్టే జరిగింది. కలలోనైనా, మెలకువనైనా శాంతిని వల్లెవేస్తున్నాడు, ఒక్క పీస్ ప్రైజ్ ప్లీజ్ అని అదేపనిగా అడుగుతున్నాడు, ఓ నోబెల్ ఇచ్చి శాలువా కప్పండని...
అనుకున్నంతా అయింది. భయపడ్డట్టే జరిగింది. కలలోనైనా, మెలకువనైనా శాంతిని వల్లెవేస్తున్నాడు, ఒక్క పీస్ ప్రైజ్ ప్లీజ్ అని అదేపనిగా అడుగుతున్నాడు, ఓ నోబెల్ ఇచ్చి శాలువా కప్పండని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినకపోతిరి. ఓ పాకిస్థాన్, ఓ ఇజ్రాయెల్ వినా యూరప్‌లో ఆప్తులనుకున్నవారూ, ఆసియాలో ఆత్మీయులమన్నవారూ అమెరికా అధ్యక్షుడి పక్షాన వకాల్తా పుచ్చుకోలేదు, కమిటీతో ఒక్క మాటైనా చెప్పలేదు. ఇప్పుడు ఆయన ఉగ్గబట్టుకున్న ఆగ్రహాన్నంతా కక్కేశాడు. తనను శాంతిదూతగా గుర్తించని, ఓ అవార్డు కూడా ఇప్పించని ఈ మానవలోకంమీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. యుద్ధాలనుంచి ప్రపంచాన్ని తాను ఎందుకు రక్షించాలని అడుగుతున్నాడు. ఎప్పుడైతే తనకు నోబెల్ దక్కలేదో, అప్పుడే శాంతికోసం తపించాల్సిన అగత్యం తనకు తప్పిపోయిందని, యుద్ధాలు లేని ప్రపంచంకోసం వెంపర్లాడాల్సిన అవసరం లేకపోయిందన్నది ఆయన వ్యాఖ్య సారాంశం. ఇది ఆయన అప్పటికప్పుడు ఆవేశంగా అన్నమాట కాదు. నార్వే ప్రధానమంత్రికి రాసినలేఖలో ఎనిమిది యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ పీస్ దక్కనందునే గ్రీన్‌ల్యాండ్ మీదకు దండెత్తుతున్నానని చెప్పకనే చెప్పారు. అమెరికా ప్రయోజనాలు తప్ప ఇక శాంతి గురించి దేబిరించాల్సిన అవసరం తనకు లేదనడం ద్వారా రేపోమాపో దురాక్రమణ తథ్యమని తేల్చేశారు.
తనకు ఆ కాస్తంత సత్కారం కూడా చేయని ఈ పాడులోకాన్ని ఆయన మాత్రం ఎంతకని కాపాడుకొస్తాడు? అప్పటికీ, తాను ఏయే యుద్ధాలు ఆపానో ఈ ప్రపంచానికి గుర్తుచేస్తూనే వచ్చాడు. నోబెల్ శాంతి ప్రకటనకు ముందు మరింత గట్టిగా చెప్పిచూశాడు. ఆపరేషన్ సిందూర్‌ను అర్థంతరంగా ఆపించింది తానేనని ఏకంగా యాభైఅరవైసార్లు చెప్పుకున్నాడు. ఆపింది అమెరికా అధిపతులు కాదు, ఇక చాలు మహాప్రభో అని పొరుగుదేశం మొరబెట్టుకుంటే, మేమే ఆపేశామని మన పాలకులు చెప్పుకోవడంతో ట్రంప్‌కు ఇంకా చిర్రెత్తుకొచ్చింది. తళతళలాడే సరికొత్త విమానాలు ఇన్ని కూలాయి, ఇలా కూలాయి అంటూ ఏవో కొత్త పద్దులు విప్పాడు. పాకిస్థాన్ సైనికాధిపతికి కమ్మటిభోజనం పెట్టి ఎంత భజన చేయించుకున్నా, తమ్ముడు షరీఫ్ నోబెల్ కమిటీకి రాసిన లేఖను చూపినా ట్రంప్‌కు తపనతీరలేదు. ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహూ ట్రంప్‌ను శాంతిదూతగా కీర్తించి, నోబెల్ కమిటీకి రాసిన లేఖ పూర్తిపాఠాన్ని చదివి వినిపించినా, ఈయన ఆశలైతే పెరిగాయి కానీ, కల మాత్రం నెరవేరలేదు.
వెనెజువెలా విపక్షనేత, మదురో ఆగర్భశత్రువు మచాడోకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రకటించినప్పుడు, అది ట్రంప్‌కు దక్కినట్టుగానే విశ్లేషకులు భావించారు. కాగల కార్యాన్ని తీర్చడానికే ఆమెకు ఈ అవార్డు ఇచ్చారని అంతా అన్నారు. వెనువెంటనే మదురోను మాయంచేసే కార్యక్రమమూ జరిగిపోయింది. ఒక అర్థరాత్రి అమెరికా సైనికబలగాలు వెనెజువెలాలోకి చొరబడి, వందలాదిమంది సిబ్బందిని కాల్చిపారేసి, తమ దేశాధ్యక్షుడినీ, అతడి భార్యనూ సైనిక విమానాల్లో ఎత్తుకుపోయి, అమెరికా జైళ్ళలో కుక్కి, అక్కడి కోర్టుల్లో శిక్షలు వేసి, రేపోమాపో ఉరికంబం ఎక్కించబోతున్నందుకు ఈ నోబెల్‌శాంతి విజేతకు ఎంతో సంతోషం కలిగింది. తమదేశపు చమురు సంపదను దౌర్జన్యంగా స్వాధీనం చేసుకొని, మిగతాదేశాలతో వ్యాపారం చేసుకుంటున్న ట్రంప్‌ను మించిన మంచోడెవరూ లేరని మచాడోకు అనిపించింది. పరుగుపరుగున వెళ్ళి నోబెల్ కమిటీ తనకు ఇచ్చిన శాంతి పురస్కారాన్ని అమెరికా అధ్యక్షుడి చేతుల్లో పెట్టింది. ఇలా నోబెల్ కమిటీ ఇచ్చిన అవార్డులను ఇంతవరకూ ఎవరెవరు ఇచ్చేశారు, వచ్చిన ధనాన్ని సమాజహితవుకోసం ఏం చేశారు ఇత్యాది వివరాలతో చాలా కథనాలు వచ్చాయి. పురస్కారం ట్రంప్‌కు ఇచ్చేసినా మా పద్దులో ఆమె పేరే ఉంటుందని నోబెల్ కమిటీ ఓ మాటన్నది కూడా. అయినప్పటికీ, తన పురస్కారాన్ని ట్రంప్ చేతుల్లో పెట్టడం వల్ల రాబోయేరోజుల్లో తనకు ఒనగూరే లబ్ధి ఎంతో ఆమెకు బాగా తెలుసు. అవార్డు ఆమెకు ఇచ్చినా, అది ట్రంప్‌దేనని అప్పట్లో అన్నవారు ఈ పరిణామాలతో తమమాట నిజమైనందుకు సంతోషించారు. తనది కాని అవార్డును స్పృశించిన ట్రంప్‌కు తాను భవిష్యత్తులో చేయబోయే యుద్ధాలకు, దురాక్రమణలకు నోబెల్‌శాంతిని అడ్డుపెట్టుకోవచ్చునని భలే ఆలోచన కలిగింది. శాంతికాముకుడి ముసుగు తీసిపారేసి, అస్త్రశస్త్రాలు చేబూని, ఇరాన్, గ్రీన్‌ల్యాండ్ సహా ఆశించినవన్నీ సాధించుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News