వ్యాఖ్యలు–విమర్శలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:43 AM
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమంలో నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిని అత్యవసరంగా విచారించాలన్న...
కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నిర్వహించిన ‘చలో సంసద్’ కార్యక్రమంలో నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. దానిని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరస్కరించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అత్యవసర విచారణలను కోరడం, న్యాయస్థానాలు కాదనడం కొత్తేమీ కాదు. ఏది అత్యవసరమో, ఏది కాదో నిర్ణయించగల సమర్థత, అధికారం న్యాయమూర్తులకు కచ్చితంగా ఉంటుంది. చలో పార్లమెంట్ నిరసనలో పోలీసులు నిరాయుధులపై దారుణంగా విరుచుకుపడి, అమానవీయంగా వ్యవహరించారన్న ఆవేదనతో అత్యవసర విచారణకు పిటిషన్‌దారు అభ్యర్థించడంలో తప్పేమీ లేదు. అప్పటికే ఇటువంటి పిటిషన్ తక్షణ విచారణను ఢిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. దేశరాజధాని రణరంగంగా మారిన ఆ అంశంలోకి మమ్మల్ని లాగవద్దు అంటూ అక్కడి హైకోర్టు స్పష్టంచేసిన తరువాత సుప్రీంకోర్టులో తన అభ్యర్థన నెరవేరుతుందన్న నమ్మకం ఈ పిటిషనర్‌కు ఉన్నదేమో మరి. అయితే, తక్షణ విచారణను తిరస్కరించడం కంటే, ఆ సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృత చర్చకూ, విమర్శలకు దారితీశాయి.
బొద్దింకల పార్టీ ‘చలో పార్లమెంట్’లో ఇంత హింస జరగడం ఊహకు అందనిది. పాతికవేలకు మించి రారని అనుకుంటున్నప్పుడు, ముందురోజు వరకూ ఎటువంటి సంకేతాలూ లేకుండా హఠాత్తుగా యువత విరుచుకుపడింది. లక్షమందికి మించి వచ్చారని నిర్వాహకులు చెప్పుకున్నారు. నిరసనకారులు పార్లమెంట్‌వైపు దూసుకువచ్చి, బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో, పోలీసులు లాఠీచార్జీతోనూ, బాష్పవాయువుతోనూ, పెల్లెట్ల ప్రయోగంతోనూ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు, పోలీసులు గాయపడిన దృశ్యాలతో పాటు, నిరసనకారులతో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా దేశం చూసింది. తలలు పగిలిన, రక్తం ఓడుతున్న వారి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైనాయి. ఈ ఘటనలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలన్నది పిటిషనర్ కోరిక. ఇంకా ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో, మూడు అభ్యర్థనలతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. అక్కడ యువత పోలీసుల చేతుల్లో చావుదెబ్బలు తిన్నది, నా వద్ద ఆ అకృత్యాలను నిరూపించే వీడియోలు కూడా ఉన్నాయి, మీరు గురువారమే పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరిస్తే.. అని న్యాయవాది అభ్యర్థించినప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ప్రధానన్యాయమూర్తి దానిని మృదువుగా తిరస్కరించివుంటే సరిపోయేది. ఆ వీడియోలమీద తనకు ఆసక్తిలేదనడంతోపాటు, చూసేందుకు తమకు సమయం కూడా లేదన్నారు. అంతటితో ఆగకుండా, వాటిని అసలు చూసే ఉద్దేశమే లేదని కూడా తేల్చేశారు. పోలీసు దమనకాండ, సంబంధిత వీడియోల గురించి న్యాయవాది మళ్ళీ చెప్పబోవడంతో ఆయనకు చిరాకు కలిగిందేమో మరి, ఏ వీడియోలూ చూసేది లేదంటూ తమ సమయం వృధాచేయవద్దన్నారు. పనిలోపనిగా పిటిషనర్‌ను కూడా వృధాచేసుకోవద్దని సలహా ఇచ్చారు. ఉద్యమకారులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని సంస్కరించడంతో పాటు పలు విద్యాసంస్కరణలను డిమాండ్ చేస్తున్నారని న్యాయవాది ఏదోచెప్పబోతూంటే, థాంక్యూ వెరీమచ్ అనేశారట సీజేఐ. తాను ఇంకేమీ వినదల్చుకోలేదని దాని అర్థం.
ఢిల్లీలో నెలరోజులనుంచీ ఏమి జరుగుతోందో, జూలై 20న ఏమీ జరిగిందో చీఫ్ జస్టిస్‌కు తెలియకుండా ఉండదు. వాటిని ఆయన చానెళ్ళలోనో, పేపర్లలోనో చూసేవుంటారు. మే 15న ఆయన ఈ దేశంలోని కొందరు నిరుద్యోగ యువతీయువకులను బొద్దింకలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యలే కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావానికి దోహదపడిన విషయం తెలిసిందే. తీవ్రవిమర్శలు రావడంతో, మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించిదంటూ వివరణ కూడా ఇచ్చారు. బొద్దింకలు ఇప్పుడు పార్లమెంట్ గుమ్మం వరకూ రావడానికి కారకులైనవారు ఈ పిటిషన్‌పై కాస్తంత మృదువుగా స్పందిస్తే సరిపోయేది. కానీ, ఆ వ్యాఖ్యలు సీజేపీ ఉద్యమంమీద సీజేఐ ఆగ్రహంగా ఉన్నారనో, అధికారపార్టీలాగానే కక్షకట్టారనో ప్రచారం చేయడానికి అనవసర అవకాశం ఇచ్చాయి. సోషల్ మీడియా కంటెంట్ మీదా, కొందరు కమెడియన్ల వీడియోలపైనా సుప్రీంకోర్టు ఇటీవల ప్రతిస్పందించకపోలేదు. కానీ, వందలాదిమంది నడిరోడ్డుమీద దెబ్బలుతిన్న ఈ సందర్భంలో, ఓపికగా విని సముచితన్యాయం చేయాల్సిన కోర్టునుంచి ఇటువంటి వ్యాఖ్యలు వినబడటం ఆశ్చర్యం.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News