Share News

విభజిత న్యాయం

ABN , Publish Date - May 21 , 2026 | 12:21 AM

తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, వివిధ కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉంటాయి. రాజ్యాంగం, పౌరహక్కులు, జెయిలూ బెయిలూ ఇత్యాది విషయాల్లో...

విభజిత న్యాయం

తీర్పులు ఎలా ఉన్నప్పటికీ, వివిధ కేసుల విచారణ సందర్భంలో న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు ఎంతో ఉన్నతంగా, ఆదర్శప్రాయంగా ఉంటాయి. రాజ్యాంగం, పౌరహక్కులు, జెయిలూ బెయిలూ ఇత్యాది విషయాల్లో వారి వ్యాఖ్యలు మనసు పొరల్లోంచి వచ్చివుండవచ్చునేమో కానీ, తీర్పుల్లో ప్రతిఫలిస్తాయని చెప్పలేం. ఊపావంటి దుర్మార్గమైన చట్టాల విషయంలో సర్వోన్నత న్యాయమూర్తుల మాటలు సామాన్యుడిని సైతం పులకింపచేస్తాయి. కొన్ని కేసుల్లో అప్పుడప్పుడు కాస్తంత దూకుడుగా, ప్రభుత్వం వాదనలను వీటో చేస్తూ నిందితులకు బెయిల్‌ మంజూరు చేసినప్పుడు అంతిమంగా న్యాయం నిలుస్తోంది, గెలుస్తోందన్న సంతోషం దక్కుతూంటుంది. మే 18న సయ్యద్‌ ఇఫ్తికార్‌ అద్రాబీ కేసులో ఐదేళ్ళుగా ఏ విచారణా లేకుండా జైల్లో మగ్గిపోతున్న అతడికి ‘బెయిల్‌ నియమం.. జైలు మినహాయింపు’ అనే ప్రాథమిక న్యాయసూత్రాన్ని కోర్టు వర్తింపచేసింది. దానితోపాటుగా, దిగువకోర్టులనుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఎన్నిమెట్లెక్కినా, ఎవరిని వేడుకున్నా బెయిల్‌ దక్కక ఆరేళ్ళుగా షర్జిల్‌ ఇమామ్‌, ఉమర్‌ ఖాలీద్‌కు జరిగిన అన్యాయాన్ని సైతం కోర్టు గుర్తించింది. ఈ ఏడాది తొలినెల తొలివారంలో సుప్రీంకోర్టు వారికి బెయిల్‌ ఇవ్వకపోవడాన్ని ఈ ఇద్దరు న్యాయమూర్తులు తప్పుబట్టడం విశేషం.

అరుదుకావచ్చునేమో కానీ, గత తీర్పులను సమీక్షించుకోవడం, సరిదిద్దుకోవడం సుప్రీంకోర్టు చేయకపోలేదు. ఈ రకమైన విమర్శ విధానం న్యాయం చేకూర్చే ప్రక్రియమీదా, న్యాయవ్యవస్థలోని అస్థిరతమీదా ఆరోపణలకు తావిస్తుందన్న, ప్రజల విశ్వాసాన్ని బలహీనపరుస్తుందన్న వాదనలు లేకపోలేదు. అయితే, ఏ కారణాలచేతనైతేనేమి, ఒకసారి అన్యాయం జరిగినంత మాత్రాన అదే కొనసాగాల్సిన అవసరం లేదని, దానిని సరిదిద్ది బాధితులకు న్యాయం చేకూర్చడానికి సర్వోన్నత న్యాయస్థానం భేషజాలకు అతీతంగా సిద్ధంగా ఉంటుందన్న నమ్మకాన్ని ఈ ప్రక్రియ చేకూర్చుతుంది. నిందితుడికి న్యాయాన్ని అందించే విషయంలో తప్పిదం జరిగిందన్న ఒప్పుకోలు సంస్థాగత విశ్వసనీయతను పెంచుతుంది. బెయిల్‌ కాదు, జెయిలే అంటూ ఉమర్‌ ఖాలీద్‌, షర్జిల్‌ ఇమామ్‌ విషయంలో సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో కఠినంగా వ్యవహరించడం హక్కుల కార్యకర్తలనుంచి న్యాయకోవిదుల వరకూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఢిల్లీ అల్లర్ల కేసులో మిగతా ఐదుగురికీ కఠినషరతులతోనైనా బెయిల్‌ దక్కింది కానీ, ఈ ఇద్దరూ ఆ అల్లర్లకు ప్రధాన కారకులనీ, మార్గనిర్దేశకులన్న ప్రాసిక్యూషన్‌ వాదనను కోర్టు తన బెయిల్‌ నిరాకరణకు ఆధారంగా తీసుకుంది. ఏడాది తరువాత మళ్ళీ రండి అని ఎంతో ఔదార్యంగా పంపించివేసిన కోర్టుకు అప్పటివరకూ జైల్లో గడిపిన ఐదేళ్ళూ బెయిల్‌కు కనీసార్హతగా కనిపించలేదు.


‘ఊపా’ మోపిన నిందితులందరినీ ఏకరీతిగా చూడకుండా వీరిద్దరినీ వేరు చేయడమే కాదు, ఏ విచారణాలేకుండా జైల్లో ఎంతకాలం ఉన్నా, బెయిల్‌ ఇవ్వాలన్న నియమం ఏమీ లేదని కూడా కోర్టు తేల్చేసింది. బెయిలూ జెయిలూ ఆదర్శాన్ని కనీసం సుప్రీంకోర్టు పాటిస్తూ, ఊపా వంటి బహుకోరలున్న చట్టాల్లో సైతం దానిని వర్తింపచేస్తున్నది కనుక, తమ విషయంలో మనసు కరుగుతుందనుకున్నారు. కానీ, అంతిమంగా అక్రమ నిర్బంధంతో నేరనిర్ధారణకు ముందే శిక్షలు వేస్తున్న ప్రభుత్వానిదే పై చేయి అయింది. అరవింద్‌కుమార్‌, జారియా తీర్పును ఇప్పుడు నాగరత్న, ఉజ్జల్‌ భుయాన్‌ తప్పుబడుతూ, 2021లో కె.ఎ. నజీబ్‌ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన ఉదారమైన తీర్పునూ, మార్గదర్శకాలను సైతం ఈ తీర్పు బేఖాతరు చేసిందని ప్రకటించారు. బెయిల్‌ను ఒక రాజ్యాంగ నియమంగా పేర్కొంటూ, జీవించే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యతను తెలియచెప్పిన ఐదేళ్ళనాటి ఆ తీర్పులోని కీలకమైన అంశాలను భుయాన్‌ చదివి వినిపించారు కూడా. పూర్వపు తీర్పులను, చట్టాల్లోని స్ఫూర్తినీ పట్టించుకోకుండా తమకు నచ్చే, పాలకులు మెచ్చే రీతిలో తీర్పులు చెప్పడం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, నాగరత్న, భుయాన్‌ వంటివారు దారిదీపాల్లా కనిపిస్తారు. అయితే, ఈ వ్యాఖ్యలు, ఈ ఆదర్శాలు రేపటి తీర్పుల్లో ప్రతిఫలిస్తాయనీ, దిగువ కోర్టులను ప్రభావితం చేస్తాయనీ, వాటికి దారిచూపుతాయనీ అనుకోవడానికి లేదు. సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిన మర్నాడే ఢిల్లీ కోర్టు ఒకటి జబ్బుపడి ఆస్పత్రిలో ఉన్న తల్లిని చూసుకోవడం కోసం ఉమర్‌ ఖాలీద్‌ పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించింది.

ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:22 AM