Share News

కొరియా న్యాయం

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:17 AM

దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌ ఇక సుదీర్ఘ జైలుజీవితం గడపాల్సి ఉంటుంది. 2024 డిసెంబరులో దేశంలో సైనికపాలన విధించేందుకు ఆయన చేసిన ఓ ప్రయత్నం ఈ శిక్షకు కారణం. పార్లమెంటును అదుపులోకి తీసుకొని...

కొరియా న్యాయం

దక్షిణకొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌యోల్‌ ఇక సుదీర్ఘ జైలుజీవితం గడపాల్సి ఉంటుంది. 2024 డిసెంబరులో దేశంలో సైనికపాలన విధించేందుకు ఆయన చేసిన ఓ ప్రయత్నం ఈ శిక్షకు కారణం. పార్లమెంటును అదుపులోకి తీసుకొని, రాజకీయనేతలను అరెస్టు చేయాల్సిందిగా భద్రతాదళాలను ఆదేశించిన ఆయనకు ఈ శిక్షసరిపోదని, మరణశిక్ష విధించాల్సిందేనని ప్రాసిక్యూటర్లు న్యాయస్థానంలో గట్టిగా వాదించారు. సైనికపాలన నిర్ణయాన్ని కొద్దిగంటల్లోనే ఉపసంహరించుకున్నా, తన దుశ్చర్యకు తీవ్ర పశ్చాత్తాపాన్ని ప్రకటించినా, ఆయన అటు అధికారాన్నీ నిలబెట్టుకోలేకపోయారు, ఇటు శిక్షనీ తప్పించుకోలేకపోయారు. ఎంత పెద్ద తప్పుచేసినా తమను తాము సమర్థించుకొనే నాయకులను, వారిని గుడ్డిగా సమర్థించే దిగువస్థాయి నేతలను చూస్తున్న మనకు దక్షిణకొరియా పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.

అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఆయన పదవి పోగొట్టుకొనే పరిస్థితులను సృష్టించుకున్నాడు, కుర్చీని రక్షించుకొనే ప్రయత్నంలో మరిన్ని తప్పటడుగులు వేశాడు. భార్యకు గిఫ్ట్‌రూపంలో వచ్చిన ఒక బ్యాగ్‌ ఈయన రాజకీయజీవితాన్ని తిరగరాసిందంటారు. ఈ మార్షల్‌ లా ప్రకటించడానికి కొన్ని నెలలముందు ఆమె ఒక పాస్టర్‌ నుంచి సుమారు లక్షన్నర రూపాయలు విలువచేసే బ్యాగ్‌ను బహుమతిగా స్వీకరించారు. మొదట్లో అధ్యక్షకార్యాలయం దానిని దుష్ప్రచారంగా కొట్టిపారేసినా, ఆ తరువాత వెలుగుచూసిన ఒక వీడియోలో పాస్టర్‌నుంచి ఆమె బహుమతి స్వీకరిస్తున్న దృశ్యాలు బయటపడి, అధ్యక్షకార్యాలయం తప్పు ఒప్పుకోవాల్సివచ్చింది, అధికార పార్టీ క్షమాపణలు కోరింది. పాస్టరే రహస్య కెమెరాతో ఈ ఘట్టాన్ని చిత్రీకరించారనట్టుగా ఓ ప్రచారం ఉంది. అప్పటికే పలు అవినీతి ఆరోపణలతో అధ్యక్షులవారి భార్యపట్ల ప్రజల్లో సదభిప్రాయం లేనందున, ఈ సంఘటన యూన్‌సిక్‌యోల్‌ పరువుప్రతిష్ఠలను మరింత దిగజార్చింది. ఒక ఎక్స్‌ప్రెస్‌ వే ప్రాజెక్టుకోసం అమాంతంగా భూమి ధరలు పెంచారని, అక్రమంగా అనుమతులు ఇచ్చి యోన్‌ కుటుంబీకులు బాగుపడ్డారని తీవ్రప్రచారం జరిగిన నేపథ్యంలో అధికారపార్టీ నుంచి కొందరు బయటకుపోయారు కూడా.


ప్రజల్లో ఆదరణ తగ్గి, నమ్మకం సన్నగిల్లుతున్నప్పుడు నాయకుడు కొత్త ఎత్తులు వేస్తాడు. వారిని మాయచేయగలనని అనుకుంటాడు. ఉత్తరకొరియాను బూచిగా చూపి ప్రజల్లోనూ, స్వపక్షంలోనూ తనపై పెరిగిపోతున్న వ్యతిరేకతని అధిగమించగలనని ఆయన భ్రమపడ్డాడు. విపక్షనేతలు దేశవ్యతిరేకశక్తులనీ, దేశద్రోహులతో రహస్య మంతనాలు సాగిస్తున్నారనీ, దేశం తీవ్ర ప్రమాదంలో పడిందనీ, ఉత్తరకొరియా కమ్యూనిస్టు దళాలనుంచి దానిని రక్షించుకోవాల్సి ఉన్నదనీ బెదిరిస్తూ ఆయన సైనికపాలన విధించాడు. అయితే, ప్రజలూ వారి నాయకులూ ఆయన కుట్రని సాగనివ్వలేదు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న నాయకుడు మరో నియంతగా తయారైనాడని గ్రహించిన వేలాది ప్రజలు ఎవరి ప్రోద్బలమూ లేకుండా, స్వల్పకాలంలోనే రోడ్లమీదకు వచ్చి, నినాదాలతో, నిరసనలతో అధినాయకుడిని గడగడలాడించారు. ఉత్తచేతులతో సైన్యం చేతుల్లో ఉన్న తుపాకులు లాక్కున్నారు. స్వపక్ష, విపక్షాలకు చెందిన రెండువందలమంది ఎంపీలు రాత్రికిరాత్రి గేట్లు దూకి, కంచెలు దాటి పార్లమెంట్‌ భవనంలోకి ప్రవేశించి అక్కడ ఏకకంఠంతో అధ్యక్షుడి నిర్ణయాన్ని తిరగదోడారు. నెత్తిన యుద్ధవిమానాలు తిరిగే వాతావరణంలో బతుకుతూండే దక్షిణకొరియన్లకు పొరుగుదేశం ఎంత ప్రమాదకరమైనదో తెలిసినప్పటికీ, ఉత్తరకొరియా బూచిని చూపి తమ దేశాధ్యక్షుడు తన తప్పుడు పనులను సమర్థించుకోవడానికి వారు ఒప్పుకోలేదు. అధ్యక్షుడి ఆదేశాలు ఉన్నప్పటికీ, జనాన్ని కొట్టకుండా, కాల్చకుండా వారి నిరసనలను సైన్యం గౌరవించడం మరో విశేషం. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి వారూ వీరూ అన్నతేడాలేకుండా అంతా మద్దతు ఇవ్వడంతో యూన్‌ సుక్‌యోల్‌ మారుమాట్లాడకుండా గద్దెదిగాల్సివచ్చింది. తిరుగుబాటుకు ప్రయత్నించారన్న ఆరోపణలమీద ఆయనపై దర్యాప్తు సాగింది. నాలుగుదశాబ్దాల క్రితం వరకూ సైనికపాలనను అనుభవించిన దక్షిణకొరియా ప్రజలు నియంతృత్వం తిరిగి తలెగరేయకుండా జాగ్రత్తపడినందుకు మెచ్చుకోవాలి. దక్షిణకొరియాలో అరెస్టయిన తొలి సిట్టింగ్‌ ప్రెసిడెంట్‌గా రికార్డులకు ఎక్కిన సుక్‌యోల్‌ ఇకపై మిగతా జీవితం జైల్లో గడపాల్సివస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..

నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 12:17 AM