Share News

సాధ్యమేనా..?

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:58 AM

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనా స్వదేశంలో కాలుమోపే సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు ఉభయదేశాల మధ్యా మళ్ళీ అగ్గిరాజేసింది. నేను వస్తున్నాను, వెంటనే పాస్‌పోర్టు, గుర్తింపుకార్డు ఇవ్వండి..

సాధ్యమేనా..?

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌హసీనా స్వదేశంలో కాలుమోపే సాహసోపేతమైన నిర్ణయం ఇప్పుడు ఉభయదేశాల మధ్యా మళ్ళీ అగ్గిరాజేసింది. నేను వస్తున్నాను, వెంటనే పాస్‌పోర్టు, గుర్తింపుకార్డు ఇవ్వండి అంటూ బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి ఆమె పెట్టుకున్న దరఖాస్తును, టెర్రరిస్టులకు, నేరస్తులకు అటువంటివి ఇవ్వరు అంటూ అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది. విదేశాంగమంత్రి హుమాయూన్‌ కబీర్‌ దీనిని డ్రామా అంటూ తీసిపారేశారు. ఆమె నిజంగా బంగ్లాదేశ్‌ రావాలనుకుంటే ఒకే దారి ఉన్నదంటూ, భారత్‌–బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని గుర్తుచేశారు. తనను అప్పగించవలసిందిగా భారత్‌ను కోరి, ఆ మార్గంలో బంగ్లాదేశ్ వచ్చి, కోర్టుకు లొంగిపోయి శిక్ష అనుభవించాలన్నారు ఆయన. రెండేళ్ళక్రితం విద్యార్థి ఉద్యమాన్ని అణిచివేసి, అనేకమంది ప్రాణాలు కోల్పోవడానికి కారకురాలంటూ అక్కడి కోర్టు ఆమెకు ఉరిశిక్ష విధించింది కనుక, వస్తే ఉరితప్పదని అక్కడి చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ కూడా మరోమారు గుర్తుచేశారు. తనను అరెస్టు చేస్తారని, ఉరితీస్తారని తెలిసికూడా డిసెంబరులో తాను బంగ్లాలో కాలూనడం ఖాయమని, ప్రజలకోసం తాను ప్రాణత్యాగానికి కూడా వెరవనని హసీనా చాలాసార్లు ప్రకటించారు. ఇప్పుడు మళ్ళీ ఆమె రాకతో ముడిపడి అక్కడ హింస రేగింది, ఆమె పార్టీ దాడులకు తెగబడుతూ తమను భయపెట్టేందుకు ప్రయత్నిస్తోందని అక్కడి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.

ఇలాంటి ప్రయాణాలకు ట్రావెల్‌ డాక్యుమెంట్‌ తప్పనిసరి కదా అన్నది భారత్‌ స్పందన. స్వదేశానికి తిరిగివచ్చే ఆమె హక్కును బంగ్లాదేశ్‌ ఎలా కాదంటుంది? అన్న ప్రశ్నకు బంగ్లాదేశ్‌ హైకమిషన్‌ మరింత చక్కగా సమాధానం చెబుతుందని, అప్పగింత గురించి తాము కొత్తగా మాట్లాడేదేమీ ఉండబోదని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వ్యాఖ్యల సారాంశం. భారత్‌ అప్పగించదు, బంగ్లాదేశ్‌ ఆహ్వానించదు కనుక ఈ సంక్లిష్ట పరిణామాల నేపథ్యంలో ఆమె డిసెంబరులో బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టడం జరిగేపని కాదని కొందరి నమ్మకం. అయితే, హసీనా అదేపనిగా వచ్చేనెల వెళ్ళడం ఖాయమని అంటున్నారు కనుక, అనధికారికంగా సరిహద్దులు దాటిపోవడానికి సైతం సిద్ధపడతారా? అని కొందరి అనుమానం. బంగ్లాదేశ్‌లో అవామీలీగ్‌ కూడా ఆరునూరైనా డిసెంబరులో ఆమె రాక ఖాయమని ఉధృతంగా ప్రచారం చేసుకుంటోంది.


లండన్‌లోని మాట్రిక్స్‌ చాంబర్స్‌ ద్వారా భారత్‌లోని బంగ్లాదేశ్‌ హైకమిషన్‌కు పాస్‌పోర్టుకోసం అభ్యర్థించడంతో 26 నెలల తరువాత హసీనా అధికారికంగా తన ప్రభుత్వంతో సంప్రదింపులు ఆరంభించినట్టయింది. భారత్‌ చేరిన ఏడాదిపాటు ఆమె దాదాపు నిశ్శబ్దంగానే ఉన్నారు. క్రమంగా సామాజిక మాధ్యమాల ద్వారా తన ఉనికిని చాటుకుంటూ, మరుసటి ఏడాది విలేకరుల సమావేశాలను ఏర్పాటుచేయడం వరకూ వచ్చి బంగ్లాదేశ్‌ మీద ఒత్తిడి పెంచారు. తన గత హోదాలతో సంబంధం లేకుండా కేవలం పాస్‌పోర్టు, పౌరసత్వ గుర్తింపుకార్డు అడిగితే కూడా బంగ్లాదేశ్‌ తిరస్కరించడం, తన పార్టీని పునరుద్ధరించుకొనే హక్కును ఆమెకు దక్కనివ్వకపోవడం ప్రపంచం గుర్తించింది. ఆరుగురు బ్రిటిష్‌ ఎంపీలు ఆమె పక్షాన ముందుకు రావడం బంగ్లా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే పరిణామం. రెండేళ్ళక్రితం బంగ్లాలో రాజకీయ సంక్షోభం, ఆగస్టులో హసీనా భారత్‌ రాక ఉభయదేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆమె ప్రబలశత్రువు, బంగ్లా ప్రధాని తారీఖ్‌ రహ్మాన్‌ దేశాలన్నీ తిరుగుతున్నారు కానీ, ఢిల్లీలో మాత్రం కాలూనడంలేదు. రహ్మాన్‌ పర్యటనను హసీనా అప్పగింతతో ముడిపెట్టి, అది జరిగిన తరవాతే పర్యటన ఉంటుందని బంగ్లాదేశ్‌ ఒత్తిడి తెస్తున్నట్టు వార్తలు వింటున్నాం. రహ్మాన్‌ వచ్చి, భారత ప్రధానితో ఈ విషయంపై చర్చించివుంటే, ఈ అంశం ఇంత సంక్లిష్టంగా మారేదికాదేమో. ఉభయ దేశాలు ఈపాటికే ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టగలిగేవి. రహ్మాన్‌తో సయోధ్యకు భారత్‌ తనవంతుగా చేసిన ప్రయత్నాలు కూడా తక్కువేమీ కాదు. అయినప్పటికీ, పలు కారణాలరీత్యా హసీనా పేరిట భారత్‌తో ఏ మాత్రం సానుకూలంగా వ్యవహరించకూడదని అక్కడి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుంది. కనీసంగా ఉండాల్సిన సుహృద్భావం కూడా లోపించిన కారణంగా అన్ని రంగాలపైనా దాని దుష్ప్రభావం పడింది. ద్వైపాక్షిక వాణిజ్యం పెద్దగా తగ్గకపోయినా, పరస్పరం విధించుకున్న వాణిజ్య ఆంక్షలతో దూరం పెరిగింది. గంగానదీ జలాల ఒప్పందాన్ని సైతం ఈ విభేదాలు ప్రభావితం చేస్తున్నాయి. దేశాన్ని వీడి రెండేళ్ళయిన సందర్భంలో ఆగస్టు 5న ఆమె చేసిన ప్రసంగం బంగ్లా పాలకులతో సంబంధాలను సంక్లిష్టం చేసింది. డిసెంబరులో ఆమె భారత్‌ను వీడుతారా, అది ఎలా జరుగుతుందన్నది అటుంచితే, రాబోయే రెండునెలల కాలం ఉభయ దేశాలకు విషమ పరీక్షే.

ఇవి కూడా చదవండి..

యుద్ధానికి ముగింపు పలకాలంటే.. అమెరికాకు ఇరాన్ ఏం చెప్పిందంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే...

Updated Date - Nov 12 , 2026 | 12:59 AM