Share News

శాంతి ఆశలు!

ABN , Publish Date - Nov 13 , 2026 | 03:21 AM

దాదాపు తొమ్మిదినెలల విరామం తరువాత, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నేరుగా శాంతిచర్చలు జరగడం విశేషమే. అబుదాబిలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రెండుదేశాల ప్రతినిధుల మధ్య నవంబరు 10, 11 తేదీల్లో...

శాంతి ఆశలు!

దాదాపు తొమ్మిదినెలల విరామం తరువాత, రష్యా–ఉక్రెయిన్‌ మధ్య నేరుగా శాంతిచర్చలు జరగడం విశేషమే. అబుదాబిలో అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ రెండుదేశాల ప్రతినిధుల మధ్య నవంబరు 10, 11 తేదీల్లో జరిగిన కీలక చర్చలు గొప్ప ఫలితాన్నేమీ సాధించకపోయినా ఒక మంచి ముందడుగు. ఈ చర్చల్లోనే యుద్ధవిరమణ ఒప్పందం కుదిరిపోతుందని మిగతా ప్రపంచం కూడా ఆశించలేదు. ఈ చర్చల తరువాత అమెరికా అధ్యక్షుడి అల్లుడైన జారెడ్‌ కుష్నర్‌, స్టీవ్‌ విట్కాఫ్‌ మాస్కో చేరుకొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో చర్చలు జరిపిన్నట్టు, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ భేటీ కాబోతున్నట్టు వార్తలు వింటున్నాం. అబుదాబి చర్చల ఫలితంగా రష్యా, ఉక్రెయిన్‌లు భారీస్థాయిలో యుద్ధఖైదీల మార్పిడికి అంగీకరించినందున, ఇరుపక్షాలు కనీసం చెరో వెయ్యిమంది సైనికులను విడుదల చేసే అవకాశం ఉన్నది. దౌత్యచర్చలు జోరుగా సాగుతున్నంత మాత్రాన ఉభయ దేశాలు క్షేత్రస్థాయిలో తమ యుద్ధతీవ్రతను ఏమీ తగ్గించలేదన్నది వేరే విషయం.

ఫిబ్రవరిలో నిలిచిన చర్చలు తిరిగిపట్టాలెక్కడం, కొద్దినెలల్లోనే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ఇటీవల ఓ మాట అనడం ఐదేళ్ళ ఈ యుద్ధానికి త్వరలోనే ముగింపు లభిస్తుందన్న ఆశని అధికం చేస్తోంది. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని పూర్తిగా తన అధీనంచేస్తేనే ఉక్రెయిన్‌ కోరుతున్న శాంతి సాధ్యమని రష్యా పట్టుబడుతున్నది. ఇందుకు కీవ్‌ అంగీకరించకపోవడం సహజమే కనుక, ప్రతిష్ఠంభన ఊహాతీతమైనదేమీ కాదు. అయితే, అమెరికా ప్రతినిధులు పుతిన్‌తో నేరుగా భేటీ అయినందున కొన్ని అంశాల్లో ఆయన కఠిన వైఖరిని సడలించగలుగుతారని విశ్లేషకుల నమ్మకం. ప్రధానంగా యూరోపియన్‌ దేశాలకు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యం కల్పించాలన్నది అమెరికా, ఉక్రెయిన్‌ ప్రయత్నం. అయితే, శాంతిచర్చల్లో యూరప్‌ జోక్యానికి పుతిన్‌ ససేమిరా అంటున్నారు. ఈ చర్చలు జరుగుతున్నప్పుడే డబ్లిన్‌లో నలభై యూరోపియన్‌ దేశాలు సమావేశమై రష్యాపై ఆంక్షలు విధించడం గురించి మాట్లాడుకోవడం ఈ మేరకు ఒత్తిడిపెంచడానికే. ఈ సమావేశంలో జెలెన్‌స్కీ కూడా ఉన్నారు. ట్రంప్‌ ఏలుబడిలో ఉన్న అమెరికా మధ్యవర్తిత్వం మీద యూరప్‌కు అనుమానాలు ఉండటం, పుతిన్‌కు అనుకూలమైన నిర్ణయాలతో, నిబంధనలతో ఉక్రెయిన్‌ మీద ట్రంప్‌ ఒత్తిడిపెంచే ప్రమాదం ఉన్నదని భయపడటం సహజం. ఉక్రెయిన్‌ అధినేతతో ఆయన గతంలో ఎలా మాట్లాడారో, మళ్ళీ కొంతకాలంపాటు ఆయన పక్షాన ఉన్నాక, ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారో తెలియనిదేమీకాదు.


కీలక భూభాగాలు, యుద్ధానంతర భద్రతాహామీలు, యూరప్‌ పాత్ర, దాని భవిష్యత్తు ఇత్యాది అంశాల విషయంలో ప్రస్తుతానికి చర్చల్లో అడుగుముందుకు పడకపోయినా, ఇరాన్‌తో అమెరికా మొదలుపెట్టిన యుద్ధం కారణంగా నిలిచిన ఈ దౌత్యప్రక్రియ తిరిగి పట్టాలెక్కినట్టే. ఈ చర్చలకు ఒకరోజు ముందు భారతప్రధాని నరేంద్రమోదీతో జెలెన్‌స్కీ ఫోన్‌లో మాట్లాడారు. చర్చలను ముందుకు తీసుకెళ్ళడంలోనూ, ఆహారధాన్యాల ఎగుమతి కారిడార్లను కాపాడటంలోనూ మోదీ సహాయాన్ని జెలెన్‌స్కీ కోరారు. శాంతిప్రయత్నాలకు భారత్‌ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మోదీ హామీ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత భారత్‌–రష్యా విదేశాంగమంత్రుల మధ్య కూడా టెలిఫోన్‌ సంభాషణ జరిగింది. అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌తో సమాన సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నందున ఉభయ దేశాలను ఎంతోకొంత ప్రభావితం చేయగలస్థితిలో భారత్‌ ఉన్నది. యుద్ధాన్ని ఆపగలిగేస్థాయిలో భారత్‌ మధ్యవర్తిత్వం లేకపోవచ్చునుగానీ, వాణిజ్యనౌకలకు భద్రత, ప్రపంచదేశాలకు, అతిముఖ్యంగా దక్షిణ దేశాలకు ఆహారధాన్యాల సరఫరా వంటి ఎజెండాతో భారత్‌ వ్యవహరిస్తోంది. యుద్ధం కారణంగా ఆహారకొరత ఏర్పడకుండా భారత్‌ ఆ రెండుదేశాలపై ఒత్తిడిపెంచుతోంది. ఆహారం, ఇంధనం ఆధారంగా ఇరుదేశాలు ఒక అవగాహనకు రావచ్చునని గతంలోనే భారత్‌ ఒక రోడ్‌మ్యాప్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఉక్రెయిన్‌ ధాన్యం, రష్యా ఇంధనం నల్లసముద్రం మీదుగా నిక్షేపంగా ప్రయాణించగలిగితే అది భారత్‌ దౌత్యవిజయమే కాక, ఆ దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంచి, రేపటి రోజుల్లో మరిన్ని అడుగులు ముందుకు పడేందుకు ఉపకరిస్తుంది. అమెరికా మధ్యవర్తిత్వంలో, యూరప్‌ భాగస్వామ్యంతో మలివిడత చర్చలకు పుతిన్‌ అంగీకరించారన్న సమాచారం ఫిబ్రవరిలో ఐదేళ్ళు నిండుతున్న ఈ యుద్ధం అనతికాలంలోనే ముగుస్తుందన్న నమ్మకాన్ని మరింత పెంచుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?

ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..

Updated Date - Nov 13 , 2026 | 03:21 AM