Relief For Gig Workers: గిగ్ వర్కర్లకు ఊరట
ABN , Publish Date - Jan 14 , 2026 | 12:38 AM
గిగ్ వర్కర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ పదినిముషాల ప్రమాణాన్ని క్విక్‌కామర్స్ సంస్థలు వెనక్కు తీసుకోవడం బాగుంది. కేంద్రమంత్రి మాన్సుఖ్ మాండవీయ జోక్యం, ఒత్తిడి...
గిగ్ వర్కర్ల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆ పదినిముషాల ప్రమాణాన్ని క్విక్‌కామర్స్ సంస్థలు వెనక్కు తీసుకోవడం బాగుంది. కేంద్రమంత్రి మాన్సుఖ్ మాండవీయ జోక్యం, ఒత్తిడి కారణంగానే ఇది సాధ్యపడింది. పలు క్విక్‌కామర్స్ సంస్థలు పదినిముషాల్లోనే కస్టమర్లకు ఆర్డర్లను డెలివరీ చేస్తామంటూ ఊరించి, తదనుగుణంగా ఈ వర్కర్లను పరుగులు తీయిస్తున్న అమానవీయ విధానానికి తెరపడినందుకు సంతోషించాలి. దాదాపు అన్ని ప్రధాన సంస్థలూ తమ అప్లికేషన్లనుంచి ‘టెన్‌మినిట్ డెలివరీ’ ప్రమాణాన్ని ఉపసంహరించుకొని, డెలివరీ చేయగల కనిష్ఠ సమయాన్ని మాత్రం చూపిస్తున్నాయట. ఇది పదినిముషాలకు కాస్త అటూఇటూగా ఉంటున్నదంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆక్షేపిస్తున్నప్పటికీ, గడువులు, హామీల పేరిట గిగ్‌వర్కర్లను వాయువేగంతో ప్రయాణాలు చేయించే ప్రస్తుత విధానం సడలినందుకు సంతోషించాల్సిందే.
పదినిముషాల మాటకు కట్టుబడి పనిచేయడానికీ, త్వరితంగా సరుకులు చేరవేయడానికీ తేడా ఉంది. ట్రాఫిక్‌లో సిగ్నల్ జంప్‌లు చేయడం, అడ్డుతోవలో చొచ్చుకురావడం వంటివి చూసినప్పుడు గిగ్‌వర్కర్ల మీద మిగతా జనాలకు సహజంగానే ఆగ్రహం కలుగుతుంది. కానీ, చుట్టూ తిరిగి వస్తే సమయం మించిపోతుందన్న భయం, గడువులోగా డెలివరీ ఇవ్వాలన్న ఆత్రం వారితో ఇటువంటి పనులు చేయిస్తుంది. బుక్‌చేసిన పదినిముషాల్లో కస్టమర్ల చేతికి కోరింది చేరుతుంది కానీ, అందుకోసం ఈ కుర్రాళ్ళు తమ భద్రతనీ, ప్రాణాలను పణంగా పెట్టవలసి వస్తోంది. మానసికంగానూ, భౌతికంగానూ తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న డెలివరీ కుర్రాళ్ళపాలిట ఆ పదినిముషాలు శాపంగా పరిణమించాయి. ఒకపక్క మొబైల్‌లో దారి వెతుక్కుంటూ మరోపక్క వినియోగదారుల హెచ్చరికల మధ్య గాలితో పోటీపడి రెండు చక్రాల వాహనం మీద వీరు ఎగరవలసి వస్తోంది. కిందపడిపోవడం, ఒళ్ళంతా చీరుకుపోవడం, వాహనాలు దెబ్బతినడం ప్రతీ గిగ్‌వర్కర్‌కు సహజమైన అనుభవం. కాళ్ళూచేతులు విరిగినా, ఆస్పత్రుల పాలైనా వారిని పట్టించుకొనే అవసరం, బాధ్యత కంపెనీలకు లేదు. ‘ఇండిపెండెంట్ కాంట్రాక్టర్’ అన్న నిర్వచనంతో గిగ్‌వర్కర్లను దూరం పెడుతున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ వారితో గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నాయి. అంతిమంగా, వీరి కష్టాన్ని కంప్యూటర్లు, ఆల్‌గరిథమ్స్ లెక్కగట్టి, కొద్ది క్షణాల జాప్యానికే భారీగా కోతలు విధిస్తాయి. ఆ లెక్కలకు, శిక్షలకు ప్రాతిపదికలు ఏమిటో సదరు ‘ఇండిపెండెంట్ కాంట్రాక్టర్’కు తెలియదు. జాతీయ మానవహక్కుల సంస్థకు గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ చేసిన ఫిర్యాదులో దీనిని నిర్బంధ కార్మిక విధానంగా అభివర్ణించింది. దీనికితోడు, కస్టమర్ల క్రౌర్యాలు, అవహేళనలను నోరు మెదపకుండా భరించవలసి రావడమే కాదు, ఆ ఫిర్యాదులు ఏకంగా ఈ అర్భకుల జీవితాలనే ప్రభావితం చేస్తాయి.
దాదాపు 80 శాతం మంది డెలివరీ బాయ్స్ ఆదాయం ఏడాదికి రెండున్నర లక్షల రూపాయలలోపేనని చాలా సర్వేలు లెక్కగట్టాయి. కేవలం రెండుశాతం మాత్రమే ఐదులక్షల పరిధి దాటారట. రోజుకు పన్నెండు నుంచి పదహారు గంటలపాటు కాళ్ళకు చక్రాలు కట్టుకొని కాలంతో పోటీపడుతూ తిరిగే వీరు ఎండ, వాన, చలి లెక్కచేయకుండా మనకు ఏది కావాలంటే అది క్షణాల్లో తెచ్చిపెడతారు. జలప్రళయాలకు సైతం ఎదురీదుతూ వీరు విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను ఇటీవలి వర్షాలు, తుపానుల్లో చూశాం. తమకు ఓ గుర్తింపు కావాలని, ఆరోగ్య బీమా, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, అర్థంలేని శిక్షలు వేయవద్దని డిమాండ్ చేస్తూ కొత్త సంవత్సరం ప్రవేశానికి ఒకరోజు ముందు గిగ్‌వర్కర్లు చేసిన ఆకస్మిక సమ్మె ఈ కొత్త నిర్ణయానికి కారణం కావచ్చు. టెన్‌మినిట్ డెలివరీ రద్దు అందులో ప్రధానమైన అంశం. అప్పట్లో కొన్ని డిమాండ్లకు ఒప్పుకున్న సంస్థలు, ఈ విషయంలో మాత్రం దిగిరాలేదు. కొత్త లేబర్‌కోడ్స్ అమలులోకి వస్తున్న నేపథ్యంలో, వాటిలో గిగ్‌వర్కర్ల సంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం చెప్పుకుంటున్న తరుణంలో, క్విక్‌కామర్స్ సంస్థలను దారికి తేవడం అవసరమని పాలకులు భావించి ఉంటారు. లేబర్‌కోడ్స్‌తో గిగ్‌వర్కర్లకు పూర్తిన్యాయం జరగదన్న విమర్శలను అటుంచితే, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. సంక్షేమబోర్డులు, సంక్షేమనిధి వంటివి ఏర్పాటైతే వాటిద్వారా కార్మికులు తక్షణసాయం పొందే వీలుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?
బెట్టింగ్ యాప్ బారిన పడి యువకుడి బలి
Read Latest AP News And Telugu News