Share News

‘చీపురు’వదిలేసిన చద్దా

ABN , Publish Date - Apr 25 , 2026 | 03:17 AM

అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుమానించినట్టే జరిగింది. రాఘవ్‌ చద్దా తమ మనిషి కాదని, మా పార్టీలో ఉంటూ బీజేపీ పక్షాన పనిచేస్తున్నాడని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కొంతకాలంగా చేస్తున్న విమర్శలు...

‘చీపురు’వదిలేసిన చద్దా

అరవింద్‌ కేజ్రీవాల్‌ అనుమానించినట్టే జరిగింది. రాఘవ్‌ చద్దా తమ మనిషి కాదని, మా పార్టీలో ఉంటూ బీజేపీ పక్షాన పనిచేస్తున్నాడని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కొంతకాలంగా చేస్తున్న విమర్శలు శుక్రవారం నాటి పరిణామాలు గమనించినవారికి నిజమేనని అనిపించివుంటాయి. బీజేపీతో చేతులు కలుపుతున్నారంటూ రాఘవ్‌చద్దాని రాజ్యసభలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి నుంచి తొలగించిన కేజ్రీవాల్‌ ఏకంగా ఏడుగురి తిరుగుబాటును ఊహించగలిగారో లేదో మరి. చద్దాతో పాటు బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీల్లో అశోక్‌ మిట్టల్‌ ఉండటం మరింత పెద్ద దెబ్బ. ఇరవైరోజుల క్రితం చద్దా హోదాని స్వీకరించిన వ్యక్తి కూడా తిరుగుబాటుదారుల్లో ఒకరు కావడం విశేషం.

రాజ్యసభలో మూడింట రెండువంతులమంది సభ్యులను ఎత్తుకుపోయినందుకు భారతీయ జనతాపార్టీని ‘ఆపరేషన్‌ కమల్‌’ అంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నిందిస్తోంది. ఇంతకాలం తప్పుడు పార్టీలో ఉన్న చక్కనిమనిషి తానని చద్దా చెప్పుకుంటున్నారు. పదిహేనేళ్ళపాటు ఆప్‌కోసం చెమటానెత్తురూ చిందించి దానిని పెంచిపెద్దచేశానని, తనబోటివారిని వెళ్లగొట్టడమే పనిగా పెట్టుకున్న కేజ్రీవాల్‌ కేవలం తన స్వార్థంకోసమే పార్టీ నడుపుతున్నారు తప్ప, ప్రజలకోసమూ దేశం కోసం కాదని చద్దా విమర్శిస్తున్నారు. ఆవిర్భావం నాటి ఆదర్శాలు, లక్ష్యాలు వదిలేసి వ్యక్తి ప్రయోజనాలకోసం నడుస్తున్న పార్టీలో ఉండటం కంటే పెద్ద శిక్ష ఏదీ లేదంటున్నాడు ఆయన. రాజ్యసభలో తన హోదాని తొలగించినప్పుడు చద్దా తన గురించి తాను చాలా చెప్పుకున్నారు. అనేక ప్రజాసమస్యలను సభలో ప్రస్తావించి, ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కారం కోసం కృషిచేశానన్నారు. కానీ, ఇప్పుడు ఆప్‌ అధిష్ఠానం తన గొంతునొక్కేసి ఇంతకాలమూ తనను నోరువిప్పనివ్వలేదని అంటున్నారు. ఇకపైన, సభలో సమధికోత్సాహంతో, అంకితభావంతో ప్రజల పక్షాన పోరాడతానని హామీ ఇస్తున్నారు. కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక పార్టీలో ఉండగా ప్రజల గురించి మాట్లాడలేకపోయానంటున్న వ్యక్తి ఇప్పుడు నేరుగా అధికారపక్షంలో చేరిన తరువాత ఏదో చేస్తానంటున్నారు. బీజేపీలో ఇలా చేరగానే ఆ పార్టీ అద్భుతంగా, ఆదర్శవంతంగా చద్దాకు కనిపించడంలో తప్పుపట్టాల్సిందేమీ లేదు. ప్రధాని నరేంద్రమోదీ ధైర్యసాహసాలను కీర్తిస్తూ, ఉగ్రవాదాన్ని అంతం చేయడంలోనూ, దేశాన్ని ఆర్థికంగా ఉన్నతస్థాయిలో నిలబెట్టడంలోనూ ఆయనను మించినవారెవ్వరూ లేరని, గత ప్రధానులెవ్వరూ చేయని సాహసాలు మోదీ చేశారని చద్దా తేల్చేశారు.


చద్దా స్థానంలోకి వచ్చి కూర్చున్న పదిరోజులకే మిట్టల్‌ వ్యాపారాలమీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ దాడులు చేసింది. లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ సహా పంజాబ్‌, హర్యానాల్లో అనేక రంగాలకు మిట్టల్‌ వ్యాపార సామ్రాజ్యం విస్తరించివుంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న పంజాబ్‌లో ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటినుంచే ఆపరేషన్‌ మొదలెట్టేశారని ఆప్‌ అప్పట్లోనే విమర్శించింది. ఈడీ దాడులు జరిగిన పదిరోజుల్లోనే మిట్టల్‌ కూడా బీజేపీలో చేరిపోయారు. మిట్టల్‌పై దాడులు చద్దా చలువేనని ఆప్‌ ఆడిపోసుకుంటోంది. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఈ ఫిరాయింపులను తేలికగా తీసిపారేస్తున్నట్టు కనిపిస్తూ, రాష్ట్రరాజకీయాలమీద దాని ప్రభావం పెద్దగా ఉండబోదన్నట్టు ఏదేదో చెబుతున్నారు. కానీ, ఒక్క స్వాతి మలివాల్‌ మినహా మిగతా ఆరుగురూ పంజాబ్‌కు చెందిన వారే కనుక, ఈ పరిణామం ప్రభావం చిన్నదేమీ కాదు. పంజాబ్‌ను గెలుచుకున్న తరువాత అక్కడ నుంచి పెద్దలసభకు వెళ్ళిన వీరిలో చద్దా, మలివాల్‌ మాత్రమే పార్టీ ఆవిర్భావంతో సంబంధం ఉన్నవారు. పంజాబ్‌ రాజకీయాల్లో పేరున్న చద్దా ఒక్కడే బీజేపీలో చేరివున్నా ఆప్‌కు అంత సమస్యవుండేది కాదేమో. కానీ, ఆయన ఏకంగా రాజ్యసభలో పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. పార్టీ ప్రతిష్ఠ, వ్యక్తిగతంగా కేజ్రీవాల్‌ పరువు ఈ పరిణామంతో దెబ్బతింటాయి. పదేళ్ళక్రితం యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌తో ఆరంభమైన గెంటివేతలన్నీ మళ్ళీ ప్రస్తావనకు వస్తున్నాయి. ఆప్‌ వ్యవస్థాపకులను కేజ్రీవాల్‌ తన నియంతృత్వవైఖరితో దూరం చేసుకుంటున్నారన్న విమర్శలు పెరుగుతాయి. లిక్కర్‌ కుంభకోణంలో ఆప్‌ను నానాబాధలూ పెట్టి, కేజ్రీవాల్‌ సహా కీలకమైన నాయకులందరినీ జైళ్ళలోకి నెట్టి, ఢిల్లీని స్వాధీనం చేసుకోవాలన్న కలను బీజేపీ ఎట్టకేలకు నెరవేర్చుకుంది. పంజాబ్‌నుంచి కూడా ఆప్‌ను గెంటివేసే పని ఈ ఫిరాయింపులతో మొదలై, ఎక్కడకు చేరుతుందో చూడాలి.

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 03:17 AM