Share News

పాక్‌ బూటకం!

ABN , Publish Date - Sep 16 , 2026 | 02:15 AM

జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌పై ఉన్న రివార్డును పాకిస్థాన్‌ ప్రభుత్వం మరింత పెంచడాన్ని భారత్‌ ‘గిమ్మిక్‌’గా అభివర్ణించింది...

పాక్‌ బూటకం!

జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌పై ఉన్న రివార్డును పాకిస్థాన్‌ ప్రభుత్వం మరింత పెంచడాన్ని భారత్‌ ‘గిమ్మిక్‌’గా అభివర్ణించింది. ఈ ఉగ్రవాద నాయకుడిని అప్పగించిన లేదా ఆచూకీ తెలిపినవారికి ఇస్తామంటున్న ఐదుమిలియన్‌ పాకిస్థాన్‌ రూపాయలను ఇకపై ఏడు మిలియన్లు చేస్తున్నట్టుగా పాకిస్థాన్‌ ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) చేసిన ప్రకటనపై భారత విదేశాంగ శాఖ మంగళవారం ప్రతిస్పందిస్తూ, ఉగ్రవాదాన్ని తన విధానంలో భాగం చేసుకున్న పాకిస్థాన్‌ ప్రభుత్వానికి ఈ తరహా బూటకపు చర్యలు అలవాటేనని వ్యాఖ్యానించింది. ఈ విన్యాసాలను కట్టిపెట్టి మసూద్‌ అజర్‌ విషయంలో నిజాయితీగా వ్యవహరించాలని భారత్‌ కోరింది. రివార్డును పెంచడంతో పాటు, తన తాజా రెడ్‌బుక్‌లో అతడి పేరును పాక్‌ ప్రభుత్వం పరారీలో ఉన్న ‘మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్టుల’ జాబితాలోనూ ఉంచింది. అక్టోబర్‌లో ‘ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌’ (ఎఫ్‌ఏటీఎఫ్‌) సమావేశం తరుముకొస్తున్న నేపథ్యంలో, ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటున్నట్టుగా నమ్మించడానికి పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

ఎఫ్‌ఐఏ తన తాజా రెడ్‌బుక్‌లో ‘మోస్ట్‌వాండెడ్‌’ జాబితాలో చేర్చిన ఉగ్రవాదుల సంఖ్య 2021తో పోల్చితే ౩6శాతం పెరిగి, 1804కు చేరిందట. 2008 ముంబై ఉగ్రదాడులతో సంబంధం ఉన్నట్టుగా పాకిస్థాన్‌ దర్యాప్తు సంస్థలు గుర్తించిన 19 మంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే, వీరిలో ఇద్దరి ఫోటోలు, వారి కార్యాచరణకు సంబంధించిన వివరాలు, లష్కర్‌–ఎ–తోయ్‌బా (ఎల్‌ఈటీ)తో వారి సంబంధాలను తొలగించి ఉత్తి పేర్లను మాత్రమే ఉంచారని, నిజానికి 2021 జాబితాలో ఆ వివరాలన్నీ ఉన్నాయని వార్తలు వింటున్నాం. ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ వైఖరికి ఇది ఓ మచ్చు తునక. మసూద్ అజర్‌ తమదేశం నుంచి ఎప్పుడో పారిపోయాడని పాక్‌ వాదిస్తున్న విషయం తెలిసిందే. 2019 మే నెలలో అతడు డురాండ్‌లైన్‌ దాటేశాడని ప్రకటించిన పాకిస్థాన్‌, ఆ తరువాత తాలిబాన్‌తో సంబంధాలు చెడిన నేపథ్యంలో, అఫ్ఘానిస్థాన్‌లో ఉన్నాడని అనడం ప్రారంభించింది. నాలుగేళ్ళనుంచీ అఫ్ఘానిస్థాన్‌ ఈ ఆరోపణను ఖండిస్తోంది. గతవారం కూడా పాక్‌ వాదనను అఫ్ఘాన్‌ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. అజర్‌ తమదేశంలో లేడని, పాకిస్థాన్‌ మిగతా ప్రపంచాన్ని తప్పుదోవపట్టిస్తోందని తాలిబాన్‌ ఆగ్రహించింది. ఇతరదేశాలపై దాడులకు అఫ్ఘాన్‌ భూభాగాన్ని అనుమతించబోమని తాలిబాన్‌ మరోమారు నొక్కిచెప్పడం ప్రధానంగా భారత్‌ను దృష్టిలో పెట్టుకొనే.


భారత్‌లో 2001నాటి పార్లమెంట్‌పై దాడి, 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్‌కోట్‌ వైమానికస్థావరంపై దాడి, 2019నాటి పుల్వామా బాంబుదాడి వంటి ప్రధాన ఉగ్రవాద ఘటనల్లో మసూద్‌ అజర్‌ హస్తం ఉంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ‘అపరేషన్‌ సిందూర్‌’ చేపట్టి పాకిస్థాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మసూద్‌ అజర్‌కు చెందిన బహావల్పూర్‌ ప్రధాన స్థావరాన్ని భారత వైమానిక దళాలు నేలమట్టం చేసినప్పుడు అజర్‌ తప్పించుకున్నా, అతడి కుటుంబీకులు, సన్నిహితులూ పదిమంది మరణించారు.

2018–22మధ్యకాలంలో గ్రే లిస్టులో ఉంటూ అప్పుపుట్టక పాకిస్థాన్‌ ఆర్థికంగా అనేకకష్టాలు పడింది. మనీలాండరింగ్‌, ప్రధానంగా లష్కర్‌, జైషే సంస్థలకు నిధులు చేరకుండా నిరోధించకపోవడం ఎఫ్‌ఏటీఎఫ్‌ ఆగ్రహానికి కారణం. ఆ తరువాత ఈ సంస్థలను నిషేధించి, కొందరిని జైళ్ళలో పెట్టి, అజర్‌ను న్యాయస్థానాల్లో దోషిగా నిర్థారించి, ఎట్టకేలకు అమెరికా సాయంతో పాకిస్థాన్‌ ఆ గ్రే లిస్టునుంచి బయటపడగలిగింది. కానీ, ఎఫ్‌ఏటీఎఫ్‌కు ఇచ్చిన హామీల అమలును మాత్రం తదనంతరం గాలికి వదిలేసింది. ముఖ్యంగా, మసూద్‌ అజర్‌ విషయంలో ఏ చర్యలూ లేకపోవడంతో అక్టోబర్‌ 26నుంచి 30వతేదీ వరకూ పారిస్‌లో జరగబోయే ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తప్పకపోవచ్చునని అంటున్నారు. ఈ తరహా చిత్తశుద్ధిలేని విన్యాసాలతో మళ్ళీ గ్రే లిస్టులోకి పోకుండా పాకిస్థాన్‌ తనను తాను కాపాడుకోగలదా? అన్న ప్రశ్నను అటుంచితే, అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ప్రకటించిన వ్యక్తి ఏడేళ్ళుగా తప్పించుకుతిరగడం విచిత్రం, విషాదం.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్

మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 02:15 AM