విస్మరించలేని విషాదం
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:13 AM
కశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఏడాది క్రితం జరిగిన నరమేథం దేశప్రజల మనసులను తొలిచివేస్తూనే ఉంది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండను స్మరించుకుంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి సహా....
కశ్మీర్‌లోయలోని పహల్గాంలో ఏడాది క్రితం జరిగిన నరమేథం దేశప్రజల మనసులను తొలిచివేస్తూనే ఉంది. 26మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఆ మారణకాండను స్మరించుకుంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి సహా పలువురు నివాళులు ఘటించారు. ఉగ్రవాదానికి భారత్ ఎన్నటికీ తలవంచదని, నేరస్తులకు శిక్షలు ఖాయమని ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. జాతికి తగిలినదెబ్బను ఎప్పటికీ మరిచిపోలేమని అంటూ, పొరుగుదేశం పాకిస్థాన్ పేరు ఎత్తకుండా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్‌ను ప్రమాదంలో పడేయాలనుకొనేవారిపట్ల ప్రతిస్పందన ఏ స్థాయిలో ఉంటుందో చూశారంటూ ఆపరేషన్ సిందూర్‌ను ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో భారత్ తమపట్ల తప్పుగా వ్యవహరిస్తే కోల్‌కతాపై దాడిచేస్తామంటూ పాకిస్థాన్ రక్షణమంత్రి ఇటీవల నోరుపారేసుకున్న నేపథ్యంలో, రాజ్‌నాథ్ హెచ్చరికలు సముచితం, అవసరం.
జమ్మూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్న భారతదేశ పాలకుల వాదనను వమ్ముచేయడం పహల్గాం ఘాతుకం ప్రధాన లక్ష్యం. ఈ దారుణం జరిగిన బైసరన్ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్‌గా పిలుచుకుంటారు. హనీమూన్‌కు వచ్చే కొత్తదంపతులతో సహా పర్యాటకులంతా ఆహ్లాదంగా ఉన్న స్థితిలో పాక్ కేంద్రంగా పనిచేసే లష్కర్–ఎ–తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ మారణకాండకు ఒడిగట్టారు. 2019 పుల్వామా ఘటన తరువాత, లోయలో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇది. ప్రత్యేక ప్రతిపత్తి రద్దు తరువాత రేగిన ఆగ్రహావేశాలు, అశాంతి తగ్గుముఖం పట్టి, కశ్మీర్‌లో పరిస్థితులు గాడినపడడం, ఆ తరువాత ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నచ్చిన ప్రభుత్వాన్ని నెలకొల్పుకోవడం పొరుగుదేశానికి కంటకింపుగా మారింది. ఈ నేపథ్యంలో, పర్యాటకులను ఊచకోతకోయడం ద్వారా కశ్మీర్‌లో అడుగుపెట్టడానికి విదేశీయులు సైతం వొణికిపోవాలన్నది ఉగ్రవాదుల లక్ష్యం. భారత్‌లో మతపరమైన చీలికలు సృష్టించడం ఉగ్రవాదుల ఉద్దేశమని వారి దుశ్చర్యలు స్పష్టంచేశాయి. ఈ ఘాతుకానికి ముందు, ప్రవాస పాకిస్తానీ సదస్సులో పాక్ సర్వసైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్ తమ సైన్యానికి కశ్మీర్ విషయంలో అల్లాహ్ అప్పగించిన కొన్ని కర్తవ్యాలు మిగిలేవున్నాయంటూ చేసిన వ్యాఖ్యల్లోని అంతర్లీనమైన ఆదేశాలను ఉగ్రవాదులు అందిపుచ్చుకొని ఉండవచ్చు. పహల్గాం ఘాతుకం దేశాన్ని కుదిపేసి, మాధ్యమాలన్నీ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న తరుణంలో, సమీపంలో ఎన్నికలు జరగబోతున్న బిహార్ రాష్ట్రాన్ని వేదికగా ఎంచుకొని ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదులకు బలమైన హెచ్చరికలు చేశారు. సరిహద్దుల మూసివేత, దౌత్యసంబంధాల కుదింపు, సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వంటి తక్షణచర్యలకు తోడుగా, మరో రెండువారాలకు ఆపరేషన్ సిందూర్‌తో భారత్ ఘాటైన జవాబు ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరుకు భారత్ ఎన్ని హద్దులైనా దాటుతుందని ఈ చర్య చాటిచెప్పింది. పాకిస్థాన్‌తో అంతకుపూర్వం ఉన్న లెక్కలన్నీ ఈ యుద్ధంతో మారిపోయాయి.
ఈ ఏడాదికాలంలో కశ్మీర్‌లోయలో పర్యాటకం పూర్వస్థితికి చేరనప్పటికీ, లోయలో భద్రత పెరిగింది, పర్యాటకం కూడా క్రమంగా ఊపందుకుంటోంది. ఈ ఘటన తరువాత కశ్మీర్ మిగతా దేశానికి మానసికంగా మరింత దగ్గరైందన్న విశ్లేషణలు కూడా లేకపోలేదు. అయితే, 2019 ఆగస్టులో జమ్మూకశ్మీర్ తన స్వతంత్రతను పూర్తిగా కోల్పోయి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధీనంలోకి వచ్చి, భద్రత పూర్తిగా కేంద్రమే చక్కబెడుతున్న తరుణంలో జరిగిన ఈ ఘోరంమీద సమాధానం లేని ప్రశ్నలు ఇంకా చాలా మిగిలిపోయాయి. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి చొరబడటం, ఇంటలిజెన్స్ వైఫల్యం, పర్యాటక ప్రాంతాల్లో కెమెరాలు లేకపోవడం, వందలాదిమంది సైనికులు ఉన్నా యాభైమందిని కాపాడలేకపోవడం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కూడా అందుబాటులో లేకపోవడం ఇత్యాది ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. అదేవిధంగా, ఆపరేషన్ సిందూర్ జయాపజయాలు, పాకిస్థాన్‌లో నాశనమైన ఉగ్రవాదస్థావరాలు, హతమార్చిన ఉగ్రవాదుల సంఖ్య వంటి అంశాల్లో విభిన్నవాదనలు, కథనాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన వివరణ లభించలేదు. దీనికితోడు, పాక్ పాలకులు కాళ్ళావేళ్ళాపడితే కాల్పుల విరమణకు అంగీకరించామని మన పాలకులు అంటూంటే, తానే హెచ్చరించి యుద్ధాన్ని ఆపించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ యాభైసార్లు చెప్పుకున్నారు. కశ్మీరీల మనసు గెలుచుకోవడం ద్వారా, పహల్గాం వంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International