పద్మప్రకాశాలు
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:50 AM
పద్మ పురస్కారాల గ్రహీతల ఎంపికలో మోదీ ప్రభుత్వం సిఫార్సులు, రాజకీయ పలుకుబడులకు అతీతంగా, కేవలం దేశ సేవను, ఆయా రంగాల్లో వారి వారి....
పద్మ పురస్కారాల గ్రహీతల ఎంపికలో మోదీ ప్రభుత్వం సిఫార్సులు, రాజకీయ పలుకుబడులకు అతీతంగా, కేవలం దేశ సేవను, ఆయా రంగాల్లో వారి వారి ప్రతిభాపాటవాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకొంటున్నదని చాలామంది నమ్మకం. అట్టడుగు వర్గాలనుంచి వచ్చిన అసాధారణ వ్యక్తులను గౌరవిస్తున్నారని, కిందిస్థాయి ప్రాతినిథ్యం బాగా పెరిగిందని వారంటారు. అయితే, అవార్డులకు ఎంపికైనవారు అర్హులా కాదా అన్నకంటే, ఎంపికలో రాజకీయ ప్రాథమ్యాలు పనిచేశాయన్న చర్చ ఇప్పుడూ తప్పడం లేదు. ఎన్నికలున్న ఏడాది అయితే సదరు జాబితాను మీడియా వేయికళ్ళతో తిరగేస్తూ, ప్రకటిత పద్మాల్లో ఏయే రాష్ట్రానికి ఎన్నెన్ని దక్కాయి, ఆయా పురస్కారాల ప్రభావం ఓటర్లమీద ఎంతమేరకు ఉంటుందన్న చర్చోపచర్చలతో తెగ ఊగిపోతూంటుంది.
ఈ ఏడాది మొత్తం అవార్డుల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అసోంలకు 37 దక్కాయి. ఆరునూరైనా స్టాలిన్‌ను అధికారంనుంచి దించేయాలని బీజేపీ పట్టుదలతో ప్రయత్నిస్తున్న తమిళనాడు 1౩ అవార్డులతో ప్రథమస్థానంలో ఉంది. అధికారానికి అరడుగుల దూరంలో ఉన్నామని, దీదీని గట్టిగా ఢీకొడితే గద్దెని గెలుచుకోవడం ఖాయమని నమ్ముతున్న పశ్చిమబెంగాల్ 11అవార్డులతో, కేరళ8 పురస్కారాలతో, ఐదింటితో అసోం ఉన్నాయి. రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్ ఐదింటిలోనూ మూడు కేరళకు దక్కడం విశేషం. గత ఏడాది జూలైలో కన్నుమూసిన సీపీఎం నాయకుడు వి.ఎస్.అచ్యుతానందన్, ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు నారాయణన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కె.టి. థామస్ ఈ అవార్డు అందుకున్నారు. మిగతా రెండు పురస్కారాలు సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసురాలు ఎన్.రాజమ్‌కు, ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ నటుడు, బీజేపీ మాజీ ఎంపీ ధర్మేంద్రకు లభించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో పలు అంశాల్లో విభేదించిన వారు అచ్యుతానందన్. పదహారేళ్ళక్రితమే పొలిట్‌బ్యూరోనుంచి బయటకువచ్చేసిన ఈయనను పార్టీలో అసమ్మతి గొంతులా కొందరు విశ్లేషకులు పరిగణిస్తారు. నంబూద్రిపాద్‌నుంచి ఇప్పటివరకూ సీపీఎం నాయకులు రత్నాలనీ, పద్మాలనీ తిరగ్గొడుతూ వచ్చిన విషయం తెలిసిందే. 2022లో బుద్ధదేవ్ భట్టాచార్యకు పద్మభూషణ్ ఇవ్వబోతే వద్దన్నారు. తమ పార్టీ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉన్నదని సీపీఎం అప్పట్లో సంతోషంగా వ్యాఖ్యానించింది. ఇప్పుడు అచ్యుతానందన్ కుమారుడు తన తండ్రికి మరణానంతరం ఈ గౌరవం ఇచ్చినందుకు కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు, ఆ కుటుంబం నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నట్టుగా సీపీఎం రాష్ట్రనాయకత్వం ప్రకటించి, గతంలో తమ నాయకులు చేసిన తిరస్కారాలన్నీ వ్యక్తిగతమైనవని కూడా ఓ మాటన్నది. ముఖ్యమంత్రి విజయన్ ఈ పురస్కారం గురించి మాట్లాడదల్చుకున్నట్టు లేదు.
ఇక, నాలుగునెలలక్రితమే కేరళ నటుడు మోహన్‌లాల్‌ను దాదాసాహెబ్ ఫాల్కేతో సత్కరించిన కేంద్రం, ఇప్పుడు మరోనటుడు మమ్ముట్టిని పద్మభూషణ్‌తో గౌరవించింది. హిందూ ఎళవ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నారాయణ ధర్మ పరిపాలనాయోగం (ఎస్‌ఎన్‌డిపి) జనరల్ సెక్రటరీ వెల్లంపల్లి నటేశన్‌కు మరో పద్మభూషణ్ ఇవ్వడానికి కారణం ఆయన కుమారుడి పార్టీ భారత్ ధర్మ జనసేన కేరళలో ఎన్డీయే భాగస్వామి కావడమేనంటారు. 2024 లోక్‌సభ ఎన్నికలు కేరళలో బీజేపీకి మంచి ఉత్సాహాన్నిస్తే, ఇటీవలి స్థానికసంస్థల ఎన్నికలు భవిష్యత్తుపై నమ్మకాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పి. నారాయణన్ సహా రాష్ట్రానికి చెందిన ప్రముఖుల ఎంపికలో కొన్ని లెక్కలు ఉన్నాయని కొందరివాదన. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్పూరీఠాకూర్, చౌదరీచరణ్‌సింగ్ ఎంపికలోనూ ఓట్లు, జాట్ల అంచనాలున్నాయని కొన్ని విమర్శలు వచ్చాయి. 2021లో మరోవారంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉండగా నటుడు రజనీకాంత్‌కు 2019దాదా సాహెబ్ ఫాల్కే ప్రకటించినప్పుడు అంతా సంతోషించారు కానీ, దానిని నాలుగునెలల ముందు లేదా నాలుగువారాలు ఆగి ప్రకటించివుంటే మరింత గౌరవంగా ఉండేదని అన్నారు. పురస్కారాల గ్రహీతల ప్రతిష్ఠనుంచి పొందగలిగే రాజకీయ ప్రయోజనం ఏమేరకు ఉంటుందో తెలియదు కానీ, అటువంటి చర్చకు ఆస్కారమే లేనివిధంగా పాలకులు వ్యవహరించడం అవసరం.
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News