నేపాల్ ఎటువైపు?
ABN , Publish Date - Mar 06 , 2026 | 02:44 AM
ఆర్నెల్లక్రితం జెన్‌జీ ఉద్యమాన్ని చవిచూసిన నేపాల్‌లో ఇటీవలికాలంలో ఎన్నడూ లేనంత తక్కువ పోలింగ్ జరిగిందట. దుష్టపాలకులను దించేయాలని కంకణం కట్టుకుని, వందమంది ప్రాణత్యాగంతో...
ఆర్నెల్లక్రితం జెన్‌జీ ఉద్యమాన్ని చవిచూసిన నేపాల్‌లో ఇటీవలికాలంలో ఎన్నడూ లేనంత తక్కువ పోలింగ్ జరిగిందట. దుష్టపాలకులను దించేయాలని కంకణం కట్టుకుని, వందమంది ప్రాణత్యాగంతో ఆ లక్ష్యాన్ని సాధించిన నేపాలీ యువత, ఇప్పుడు తమకు నచ్చినవారిని ప్రతిష్ఠించే విషయంలో అంత ఉత్సాహపడకపోవడం ఆశ్చర్యం. ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను కొత్తమలుపు తిప్పుతాయని అనుకుంటూ ఉంటే, ఎన్నికల బరిలో అవే పాతమొఖాలు కనిపిస్తున్నాయి.
పాలకుల అవినీతి, ఆశ్రితపక్షపాతంమీద అనాదిగా గూడుకట్టుకొని ఉన్న వ్యతిరేకతలకు తోడు, రాజకీయ నాయకుల సంతానం సోషల్ మీడియాలో డాబుగా ప్రదర్శించే ఆడంబరాలు, విలాసాలు సాధారణ నేపాలీ యువతను ఎంతగానో రెచ్చగొట్టాయి. తాము తీవ్ర పేదరికం, నిరుద్యోగంతో కాలం నెట్టుకొస్తూ ఉంటే, విదేశాల్లో ఉంటున్న నెపోకిడ్స్ ఖరీదైన జీవితాలు గడుపుతున్నారని సామాజిక మాధ్యమాలద్వారా సామాన్యులకు తెలిసొచ్చింది. బడా రాజకీయనేతల పిల్లలు తమ పుట్టినరోజుల్ని స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ వంటి చోట్ల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే, తమ పిల్లలు పూటగడవడం కోసం దేశం విడిచి వలసలు పోతున్నారని మధ్యవయసువారు సైతం బాధపడ్డారు. నెపోకిడ్స్ మీద విస్తృతంగా సాగుతున్న ప్రచారం, వైరల్ అవుతున్న చిత్రాలు, వ్యతిరేక వ్యాఖ్యలు సోషల్ మీడియా నిషేధానికి మరోకారణమని కూడా అంటారు. ఎన్నిసార్లు గడువు పెంచినా, దేశీయ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధపడని పలు సోషల్‌మీడియా వేదికలను నేపాలీ ప్రభుత్వం నిషేధించడంతో ప్రజాగ్రహం పెల్లుబుకిన విషయం తెలిసిందే. ఆ చర్యను తీవ్రంగా నిరసిస్తూ వేలాదిమంది యువతీయువకులు వీధుల్లోకి వచ్చిన నిరసనలు చేపట్టడం, అది ఒక మహోద్యమంగా రూపొంది, పోలీసుకాల్పుల్లో వందమంది వరకూ మరణించడం తెలిసిందే. జెన్‌జీ వేడి తట్టుకోలేక దేశాధ్యక్షుడు మొదలు దిగువస్థాయి నాయకుడి వరకూ అంతా రాజీనామా చేయాల్సివచ్చింది. లక్షల్లో ఫాలోవర్లు ఉన్న ధనిక యువత తమ సోషల్ మీడియా ఎకౌంట్లను మూసేసుకుంది.
అవినీతి మీద యువతలో పెల్లుబుకిన ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన రాజకీయ పార్టీలు అంతర్గత సంస్కరణలకు సంకల్పించాయి, వ్యవస్థలో మార్పుకు హామీ పడ్డాయి. యువతరం పక్షాన నిలుస్తామని, రక్షకులుగా వ్యవహరిస్తామని అవి చెప్పుకున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థలను విస్తృత అధికారాలతో బలోపేతం చేయడం, పాలనలో యువతకు వాటా ఇవ్వడం వంటి హామీలు గుప్పించాయి. గత మూడు దశాబ్దాల అవినీతిమీదా విచారణ చేయిస్తానని ఒక పార్టీ హామీ ఇచ్చింది. అంతర్గత సంస్కరణలతో పాటు, వ్యవస్థలో సమూల మార్పుకు ఆయాపార్టీలు, నాయకులు కట్టుబడటాన్ని యువతరం అతిగా నమ్మిందా? అన్నది అనుమానం.
నాలుగేళ్ళక్రితం ఖాట్మండూ మేయర్‌గా ఎన్నికై, జెన్‌జీ ఉద్యమానికి చోదకశక్తిగా పనిచేసిన బాలేన్ షా ఈ సార్వత్రక ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు, సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కె.పి.శర్మ ఓలీ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో ఘనమైన పాత్ర వహించిన బాలెన్‌షాకు మిగతా రెండు సంప్రదాయ పార్టీల కంటే ఎక్కువ ప్రజాదరణ ఉన్నదని విశ్లేషకుల అంచనా. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ గణనీయమైన స్థానాలు గెలిచి, దశాబ్దాలుగా నేపాల్‌ను ఏలుతున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులను కోలుకోలేనంత దెబ్బతీస్తుందని కొందరి నమ్మకం. ఆయన మాటతీరు, దూకుడుతనంతో పాటు ఖాట్మండూ మేయర్‌గా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ క్రేజ్‌కు కారణం. అపవిత్ర పొత్తులతో, ఆధిపత్య పోరాటాలతో సంప్రదాయ రాజకీయ పార్టీలు ప్రజలకు దూరమైపోయిన మాట వాస్తవం. గత రెండు దశాబ్దాల్లో అక్కడ పద్నాలుగు ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ, ఏ ఒక్కటీ పూర్తిగా ఐదేళ్ళూ అధికారంలో నిలబడలేదు. దశాబ్దాలుగా నేపాలీ రాజకీయం పూర్తిగా ఓలీ, దేవ్‌బా, దహల్ చుట్టూ తిరుగుతూ సామాన్య ప్రజలు విస్మరణకు గురైనారు. నిరాశా నిస్పృహల్లో ఉన్న నేపాలీలకు బాలెన్‌షా ఒక దైవదూతలాగా కనిపించాడని, నిజానికి ఆయన పగటివేషగాడని కొందరు అంటారు. రాజకీయ అనుభవం లేని ఈ వ్యక్తి చేతిలోకి నేపాల్ పెడితే గతంలో కంటే అన్యాయమైన పాలన చవిచూడాల్సి వస్తుందని వారి వాదన. ఉద్యమం దెబ్బకు గద్దెదిగిన కె.పి.శర్మ ఓలీపైనే పోటీకి నిలబడిన బాలెన్ ఈ ఎన్నికల్లో గెలిచి హీరో అనిపించుకుంటారో, జారిపోతారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
అసెంబ్లీలో అందరూ ఉంటేనే మసాలా: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
Read Latest AP News And Telugu News