Share News

చక్కని నిర్ణయం

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:23 AM

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుమీద ఆంక్షలు విధిస్తూ, దానికి వ్యతిరేకంగా కక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడిని నోబెల్‌ శాంతిబహుమతి విజేత నవనీతం (నవీ) పిళ్ళై మంగళవారం ఒక కోరిక కోరారు...

చక్కని నిర్ణయం

అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుమీద ఆంక్షలు విధిస్తూ, దానికి వ్యతిరేకంగా కక్షపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడిని నోబెల్‌ శాంతిబహుమతి విజేత నవనీతం (నవీ) పిళ్ళై మంగళవారం ఒక కోరిక కోరారు. అమెరికా తన ప్రకటిత విలువలకు కట్టుబడుతూ, మిగతా ప్రపంచం హక్కులు, స్వేచ్ఛల పరిరక్షణలో కీలకపాత్ర పోషించాలన్నారు ఆమె. అమెరికా రాజ్యాంగంలోనూ, స్వాతంత్ర్య ప్రకటనలోనూ జీవించే హక్కు, సర్వమానవ సమానత్వం ఇత్యాది ఉదాత్త అంశాలను డోనాల్డ్‌ ట్రంప్‌కు గుర్తుచేయడం ఆమె ఉద్దేశం కావచ్చు. యుద్ధనేరస్తులను శిక్షిస్తూ, బాధితులను రక్షించేందుకు ఏర్పడిన ఐసీసీని బలహీనపరచేందుకు ట్రంప్‌, ఆయన బృందం చేస్తున్న ప్రయత్నాలను అత్యంత అమానవీయమైనవీ, క్రూరమైనవిగా అభివర్ణిస్తూ అంతర్జాతీయ చట్టాలను గౌరవించాల్సిన బాధ్యతను అమెరికాకు ఆమె గుర్తుచేస్తున్నారు.

మానవహక్కుల కోసం అలుపెరిగిన పోరాటం చేసిన, చేస్తున్న ఈ దక్షిణాఫ్రికా న్యాయవేత్తకు నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించడానికి రెండురోజుల ముందే, అమెరికా అధ్యక్షుడు తాను కూడా బరిలో ఉన్నానని మరోమారు కమిటీకి బహిరంగంగానే గుర్తుచేశారు. ఒకపక్క ఇరాన్‌తో యుద్ధం చేస్తున్న ఆయన తాను కనీసం ఎనిమిది నోబెల్‌ శాంతిపురస్కారాలకు పూర్తి అర్హుడినని చెప్పుకున్నారు. కమిటీ నిర్ణయం ఏమిటో తనకు తెలియదనీ, తనవంటివారికి ఇవ్వని చరిత్ర దానిదని మరోమారు ఆడిపోసుకుంటూనే, 2025 పురస్కారం తన చేతికి పరోక్షంగా వచ్చిచేరిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. వెనెజువెలా విపక్షనేత, మాజీ అధ్యక్షుడు నికోలాస్‌ మదురో ఆగర్భశత్రువు మారియో కొరినా మచాడోకు గత ఏడాది నోబెల్‌ దక్కిన విషయం తెలిసిందే. ఒక్క పీస్‌ ప్రైజ్‌ ప్లీజ్‌ అని అదేపనిగా అడుగుతున్నా, ఎప్పటికప్పుడు నేనూ గలనని అవార్డు ప్రకటనకు ముందు నార్వేకు గుర్తుచేస్తున్నా ఫలితం లేకపోవడం ట్రంప్‌కు మా చెడ్డకోపం తెప్పించింది. తనను శాంతిదూతగా గుర్తించని ఈ లోకాన్ని శపిస్తూ, యుద్ధాలు లేని ప్రపంచంకోసం కష్టపడాల్సిన అవసరం తనకు ఇక లేదని తేల్చేశారు కూడా. ఎనిమిది యుద్ధాలు ఆపినా నోబెల్‌ పీస్‌ దక్కనందుకే గ్రీన్‌ల్యాండ్స్‌ మీదకు దండెత్తుతున్నానని పరోక్షంగా చెప్పేశారు. ట్రంప్‌ను శాంతిదూతగా ఇజ్రాయెల్‌ అధినేత నెతన్యాహూ కీర్తించినా, పాకిస్థాన్‌ షరీఫ్‌ నోబెల్‌ కమిటీకి లేఖలు రాసినా అంతిమంగా కలనెరవేరలేదు. కానీ, మచాడోకు నోబెల్‌ రాగానే ఇది ట్రంప్‌కు దక్కినట్టేనని చాలామంది భావించారు. ఆ తరువాత ఓ అర్థరాత్రి మదురోను మాయం చేసి, అమెరికా జైల్లో కుక్కడంతో తనకంటే ఈ అవార్డుకు పూర్తి అర్హుడు ట్రంపేనని మచాడోకు అనిపించిందేమో, తనకు దక్కిన శాంతిపురస్కారాన్ని తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టారామె. ఆ అవార్డును ఎంతో ఆప్యాయంగా ఎత్తిచూపుతున్న ట్రంప్‌ చిత్రం ప్రపంచం ఎన్నటికీ మరిచిపోలేనిది. కానీ, వెనెజువెలా నుంచి మదురో పోయిన ఈ పదినెలల్లో పదిసార్లు ప్రయత్నించి కూడా ఇప్పటికీ ఎందుకు మచాడో తిరిగి స్వదేశంలో కాలూనలేకపోతున్నారో ఆ దేశ చమురును తవ్వితోడుకుపోతున్న అమెరికాకు మాత్రమే తెలుసు.


గత ఏడాది తనకు నోబెల్‌ దక్కనందుకు శాంతికాముకుడి ముసుగు తీసేసిన ట్రంప్‌కు ఈ ఏడాది ఏకంగా తన ప్రత్యర్థికే ఆ పురస్కారం లభించడం మరింత ఆగ్రహం కలిగించడం సహజం. నోబెల్‌ కమిటీని, పురస్కార గ్రహీతను ట్రంప్‌, ఆయన వందిమాగధులు తీవ్రంగా అవమానిస్తున్నారు, తూలనాడుతున్నారు. గాజాలో మారణకాండకు పాల్పడిన ఇజ్రాయెల్‌ను, దానికి ఆర్థిక, ఆయుధసాయం అందించిన అమెరికాను దోషులుగా నిలబెట్టిన పురస్కారం ఇది. ట్రంప్‌, నెతన్యాహూ చేయీచేయీ కలిపి సాగించిన మానవహననాన్ని దునుమాడి, బాధితుల పక్షాన ఆమె నిలబడ్డారు. ఇజ్రాయెల్‌ ముసుగు తొలగించి, ప్రపంచానికి దాని రాక్షసప్రవృత్తిని తెలియచెప్పారు. ఆమెకు నోబెల్‌శాంతి ప్రదానం తమను అభిశంసించడంగా వీరిద్దరూ భావించడం సరైనది. నవీ పిళ్ళై గురించి వినలేదని అంటూనే ఐసీసీని దుష్టన్యాయస్థానం అనీ, నోబెల్‌ కమిటీకి నైతికత లేదని అమెరికా, ఇజ్రాయెల్‌ అదేపనిగా దాడి కొనసాగిస్తున్నాయి. అసత్యాలు, అర్థసత్యాలతో జాతినిర్మూలనకు నడుంకట్టిన ఈ బలవంతులు ఇద్దరూ ఇలా ఎంత దాడిచేస్తున్నా, బలహీనుల పక్షాన నిలిచిన ఆమెకు ఈ ప్రపంచం కచ్చితంగా రుణపడివుంటుంది.

ఇవి కూడా చదవండి..

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:23 AM