Share News

సిసలైన జెంటిల్మన్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 01:49 AM

క్రికెట్‌లో అపర చాణుక్యుడిగా ఖ్యాతిగాంచిన మహేంద్రసింగ్‌ ధోనీ ఆటను పూర్తిగా వదిలేశాడు. ధోనీ అంతర్జాతీయ కెరీర్‌కు ఇదివరకే వీడ్కోలు పలికినా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రూపంలో...

సిసలైన జెంటిల్మన్‌

క్రికెట్‌లో అపర చాణుక్యుడిగా ఖ్యాతిగాంచిన మహేంద్రసింగ్‌ ధోనీ ఆటను పూర్తిగా వదిలేశాడు. ధోనీ అంతర్జాతీయ కెరీర్‌కు ఇదివరకే వీడ్కోలు పలికినా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) రూపంలో ఇన్నాళ్లూ అలరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ లీగ్‌లో కూడా ఆడకుండా పూర్తిగా మైదానానికి దూరమవుతున్నట్టు ప్రకటించడం అభిమానులను నిరాశపరిచే అంశమే. ఆటగాడిగా దూరమైనా ఆ జట్టుకే మార్గదర్శిగా ఎంపిక కావడం అతని అద్భుత నాయకత్వ పటిమకు నిదర్శనం.

ఎంతటి మేటి ఆటగాడైనా ఏదో ఒకరోజు వైదొలగక తప్పదు. సీనియర్‌ ఆటగాళ్లు గుడ్‌బై చెప్పడం.. కొత్త తరం కుర్రాళ్లు మైదానంలోకి అడుగుపెట్టడం క్రికెట్‌లో సాధారణంగా జరిగేదే. కానీ, ఆటను వీడినా అతడి గురించి కొన్నేళ్ల దాకా చర్చించుకునే ఆటగాళ్లు అరుదుగా లభిస్తారు. మహీ అలాంటి కోవలోకే వస్తాడు. అందుకే ఆరేళ్ల క్రితం అతడు అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నప్పుడు క్రీడా ప్రపంచంలో ఎంతటి చర్చ జరిగిందో, ఇప్పుడు ప్రైవేట్‌ లీగ్‌ అయిన ఐపీఎల్‌ను వీడినప్పుడు కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్నది. తనదైన ప్రతిభతో భారత క్రికెట్‌ రారాజుగా వెలుగొందిన ధోనీ, అంతే దీటుగా ఐపీఎల్‌కు సమ్మోహన శక్తిగా మారాడు. ప్రపంచ క్రికెట్‌లో ఆ లీగ్‌ బ్రాండ్‌ విలువను పెంచడంలో తనవంతు పాత్ర పోషించాడు. లీగ్‌ మొదలైనప్పటి నుంచి రెండేళ్లు మినహా చివరిదాకా చెన్నై సూపర్‌కింగ్స్‌ వెన్నంటే ఉండి ఆ ఫ్రాంచైజీ అభిమానులతో పాటు జట్టుకు తలమానికమయ్యాడు. లీగ్‌ మధ్యలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో సూపర్‌ కింగ్స్‌పై రెండేళ్లపాటు నిషేధం విధించినప్పుడు రైజింగ్‌ పుణె జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, నిషేధం ముగిసి చెన్నై జట్టు లీగ్‌లో అడుగుపెట్టినప్పుడు ఆ ఫ్రాంచైజీ మళ్లీ ధోనీని రప్పించుకొని పగ్గాలు అప్పగించింది. ఆ పునరాగమన సమయంలో జట్టు క్లిష్ట పరిస్థితుల్లోనూ చెన్నైని చాంపియన్‌గా నిలబెట్టి తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నాడు. ఆ జట్టుతో తన ప్రస్థానంలో చెన్నైని ఏకంగా పదిసార్లు ఫైనల్‌ దాకా తీసుకొచ్చాడు. పరాజయాలు ఎదురైనా మనోధైర్యం కోల్పోకుండా జట్టును నడిపించడం అతనికే చెల్లింది. గెలిపించకపోయినా ఫర్వాలేదు కానీ, జట్టులో తానుంటే చాలు అని ఆటగాళ్లతోపాటు అభిమానులు కోరుకునే స్థాయికి ధోనీ ఎదిగాడు. చెన్నై అంటే ధోనీ అనేలా చెరగని ముద్ర వేశాడు. మైదానంలో స్థిమితంగా ఆలోచించడం, వ్యూహాత్మకంగా ఎత్తులు వేయడం, సమష్టిగా బలగాలను ముందుండి నడిపించడం, ఎంతటి క్లిష్ట పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండడం ధోనీ ప్రత్యేకత. జట్టులోని సహచరులపై విశ్వాసముంచడమే అతని విజయమంత్రం. గెలుపు కోసం తుదివరకు పోరాడే అసలైన నాయకుడు. జట్టులో బలహీనతలున్నా.. తన మాయాజాలంతో భర్తీ చేస్తాడు. విజయాన్ని అందరికీ పంచుతాడు.. ఓటములు, విమర్శలను సారథిగా తానే స్వీకరిస్తాడు. అందుకే చెన్నై తరఫున ఆటడానికి ఎంతో మంది యువ క్రికెటర్లు ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఇక స్వయంగా లీగ్‌ ఆరంభంలో ఎంత విలువైన ఆటగాడిగా ఉన్నాడో, చివరిదాకా ఆ ప్రత్యేకతను నిలబెట్టుకున్నాడు.


మ్యాచ్‌ గెలిచి అధికారికంగా ట్రోఫీ అందుకున్నాక దాన్ని సహచరుల చేతికివ్వడం ధోనీకి అలవాటు. 2011లో వాంఖడే స్టేడియంలో వన్డే వరల్డ్‌కప్‌ ట్రోఫీ స్వీకరించాకా అదే పని చేశాడు. ఆ ట్రోఫీ దక్కించుకున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయిన టీమిండియా ఆటగాళ్లంతా ఫొటోలపై ఫొటోలు దిగారు. కానీ వాటిల్లో ఎక్కడా ధోనీ కనిపించలేదు. 2007లో టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా కూడా అదే సీన్‌ కనిపించింది. అదే సంప్రదాయాన్ని తన తర్వాతి తరం కెప్టెన్లు కూడా అనుసరించేలా ధోనీ మార్గదర్శనం చేశాడు. రోహిత్‌ శర్మ సారథ్యంలో టీమిండియా 2019లో ఆసియా కప్‌ సాధించింది. ట్రోఫీ ప్రదానం అనంతరం.. దానిని యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ చేతికి ఇవ్వాలని రోహిత్‌కు ధోనీ సూచించాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలకు చేరినా భేషజాలకు పోకుండా సాదాసీదాగా ఉండడం ధోనీ ప్రత్యేకత. భారత జట్టు కెప్టెన్‌గా వైదొలిగాక 2016లో విజయ్‌ హజారే ట్రోఫీ టోర్నీకి మహీ జార్ఖండ్‌ జట్టు సారథిగా నియమితుడయ్యాడు. అయితే దిగ్గజ క్రికెటర్‌గా ధోనీ తన దర్పాన్ని ప్రదర్శించలేదు. విమానంలో కాకుండా.. జార్ఖండ్‌ జట్టు సహచరులతో కలిసి ఆ టోర్నీకోసం రైలులో ప్రయాణించి తన నిరాడంబరతను చాటుకున్నాడు. ఇలాంటి ఘటనలు యువ ఆటగాళ్లు భవిష్యత్‌లో మరింత రాణించేందుకు తోడ్పతాయని ధోనీ నమ్ముతాడు. మహీ వెన్నుతట్టి ప్రోత్సహించిన వారిలో విరాట్‌ కోహ్లీ కూడా ఉన్నాడు. ఇన్నేళ్ల తన జెంటిల్మన్‌ గేమ్‌ ప్రస్థానంలో అద్భుతమైన ఆటతోనే గాకుండా మరెన్నో జీవిత పాఠాలతో ఈ తరం ఆటగాళ్లు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ధోనీ సిసలైన జెంటిల్మన్‌.

ఈ వార్తలు కూడా చదవండి..

మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 01:49 AM