Share News

‘కృత్రిమ’ సదస్సు

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:56 AM

కృత్రిమ మేధ (ఏఐ)రంగంలో భారత్‌ సాధించిన విజయాలు చూసి ప్రపంచదేశాల అధినేతలు ఆశ్చర్యపోయారంటూ, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026ని ఒక గొప్ప మేలిమలుపుగా తన ఆదివారం నాటి...

‘కృత్రిమ’ సదస్సు

కృత్రిమ మేధ (ఏఐ)రంగంలో భారత్‌ సాధించిన విజయాలు చూసి ప్రపంచదేశాల అధినేతలు ఆశ్చర్యపోయారంటూ, ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026ని ఒక గొప్ప మేలిమలుపుగా తన ఆదివారం నాటి మన్‌కీబాత్‌లో అభివర్ణించారు ప్రధాని నరేంద్రమోదీ. రాబోయేరోజుల్లో ఏఐ శక్తిని ఎంత సమర్థంగా, సవ్యంగా ఉపయోగించుకోవచ్చునో ఈ సదస్సు తెలియచెప్పిందన్నారు ఆయన. సదస్సుకు ప్రపంచదేశాల అధినేతలు, గ్లోబల్‌స్థాయి కంపెనీల సీఈవోలు హాజరైన విషయాన్ని గుర్తుచేశారు. అమూల్‌ రైతులు తమ పాడిపశువులను ఏఐ సాయంతో సాకడం నుంచి, ప్రాచీన విజ్ఞానాన్ని ఏఐ టెక్నాలజీతో పరిరక్షిస్తూ కొత్తతరానికి అందించడం వరకూ భారత్‌ సాధిస్తున్న పలు విజయాలు చూసి వారంతా ఆశ్చర్యపోయారని మోదీ చెప్పారు. ఇక, ఆ సదస్సులో యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్థనగ్నంగా నిరసనలు తెలపడం మీద ఆదివారం నాటి తన మీరట్‌ పర్యటనలో మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒక గ్లోబల్‌ సదస్సును కాంగ్రెస్‌ తన మురికిరాజకీయాలకు వేదికగా మార్చి భారత్‌కు తలవంపులు తెచ్చిందన్నారు. ఊళ్ళోపెళ్ళి జరిగితే ఊరంతా కలిసి వైభవంగా దానిని జరిపిస్తుందని, కానీ, ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని కూడా అప్రదిష్ఠపరచేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నించి, స్వదేశాన్నే అవమానించిందన్నారు. కాంగ్రెస్‌ తన సమాధిని తవ్వాలనుకుంటోందని, తన తల్లిని సైతం దూషించిందని, కానీ, దేశ ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూడడం మాత్రం సహించరానిదని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

మూడు స్వదేశీ ఏఐ మోడల్స్‌ ఆవిష్కరించడం సహా, వర్థమాన ప్రపంచంలో తొలిసారిగా జరిగిన ఈ సదస్సు భారత్‌ కచ్చితంగా గర్వించదగ్గది. అతివేగవంతమైన మార్పులతో కృత్రిమమేథ అన్ని రంగాలమీదా ప్రభావం చూపుతున్న తరుణంలో, దానిని చర్చించి, భవిష్యత్‌ పరిణామాలను, ఉపద్రవాలను గుర్తించి మార్గాంతరాన్ని అన్వేషించడం అత్యవశ్యకం. మిగతా ప్రపంచం, అందునా అమెరికా, చైనా వంటివి ఏఐలో ఎక్కడున్నాయో తెలిసిందే కనుక, భారత్‌ ఇప్పటివరకూ చేసిందేమిటో, చేయాల్సింది ఎంతో కూడా ఈ సదస్సు గుర్తుచేసింది. మానవ వనరులకు, నైపుణ్యానికీ భారత్‌లో కొదువలేదని మన నాయకులు ఇటువంటి అంతర్జాతీయ వేదికలమీద చెబుతూంటారు. ఇప్పటికీ విదేశీ నమూనాలు, ఉత్పత్తులమీదే అధికంగా ఆధారపడవలసివస్తున్న నేపథ్యంలో, ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగడానికి పెట్టుబడులనుంచి, పరిశోధనల వరకూ మనం పెంచుకోవాల్సినవి ఏమిటో, అందుకు ఎంతకాలం పడుతుందో ఈ సదస్సు పరోక్షంగా గుర్తుచేసింది. అతిపెద్ద ఏఐ వినియోగదారుగా, సాంకేతిక దిగ్గజ సంస్థలకు విస్తారమైన మార్కెట్‌గా, పరిశోధనలూ పరీక్షలకు కేంద్రంగా ఉపకరిస్తున్న మనం వినూత్న విధానాల రూపకల్పనతో అత్యంత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంది.


సదస్సు ఆరంభమైన రోజునే ఏర్పాట్లలో లోటుపాట్ల వల్ల చోటుచేసుకున్న తీవ్ర గందరగోళం, తొక్కిసలాట, చిన్నాచితకా దొంగతనాలు ఇత్యాదివి ప్రపంచవ్యాప్తంగా ప్రచారమై, కేంద్ర ఐటీమంత్రి క్షమాపణలు కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంతటి ఘనమైన సదస్సును నిర్వహిస్తున్నప్పుడు ఇంకాస్తంత జాగ్రత్తలు తీసుకొనివుంటే సరిపోయేది. ఇక సదస్సు తీర్మానాలు, సంకల్పాలమీద లోతైన చర్చ జరగాల్సి ఉంది. సర్వజన హితానికి కృత్రిమమేథ ఉపకరించాలన్న మాటలు వినసొంపుగా ఉంటాయి కానీ, అది కోట్లాదిమంది పొట్టకొడుతుందన్న అంచనాలను, భయాలను ఈ సదస్సు దూరం చేయలేకపోయింది. ఉప్పెనలాగా వచ్చిపడుతున్న ఏఐ అన్ని రంగాలనూ కుదిపేసి, తమ జీవితాలను చిదిమేస్తుందన్న భయం యువతలో అధికంగా ఉండటం సహజం. జీ8, జీ20, డావోస్‌ ఇత్యాది అనేకానేక సదస్సుల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతూండటం చూస్తూనే ఉన్నాం. ఉపాధి గురించి ప్రశ్నిస్తున్న యూత్‌ కాంగ్రెస్‌ హద్దులు దాటిన నిరసన ప్రదర్శనకంటే, గల్గోటియా యూనివర్సిటీ మన దేశానికి తెచ్చిపెట్టిన తలవంపులు ఎక్కువన్నది పాలకులు గుర్తించాలి. చైనా మార్కెట్‌లో కొనుక్కొచ్చిన ఒక రోబో కుక్కను ఈ అంతర్జాతీయ ఏఐ సదస్సులో తమ సృష్టిగా నిర్భయంగా ప్రకటించి, భారత్‌ ఏఐ ప్రతిభకు నిదర్శనంగా అభివర్ణించడానికి అది అస్మదీయ విద్యాసంస్థ కావడమే కారణమని ప్రచారం జరుగుతోంది. నీతిబాహ్యంగా నడిచి, ఇంతటి ఘోరపాపానికి పాల్పడ్డా కూడా దానిమీద ఉన్నతస్థాయి చర్యలకు ఉపక్రమించకపోవడం మరీ ఆశ్చర్యం. ఒక విదేశీ కృత్రిమ కుక్కతో తన వ్యాపారం పెంచుకోవడానికి ఈ సంస్థ చేసిన ప్రయత్నం స్వదేశీ మోడల్‌ ‘సర్వం ఏఐ’ ప్రపంచ మీడియాలో వెలిగిపోవాల్సిన రోజును చీకటిమయం చేసింది.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 12:56 AM