Share News

West Bengal Politics: మమత వీరంగం

ABN , Publish Date - Jan 13 , 2026 | 02:16 AM

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చౌర్యానికి పాల్పడ్డారని, వారి దుశ్చర్యలకు సీబీఐ విచారణతో అడ్డుకట్టవేయాలని...

West Bengal Politics: మమత వీరంగం

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు చౌర్యానికి పాల్పడ్డారని, వారి దుశ్చర్యలకు సీబీఐ విచారణతో అడ్డుకట్టవేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఐప్యాక్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసం మీద ఈడీ దాడి చేయగానే, మమత పరుగుపరుగున వచ్చి, కొన్ని ఫైళ్ళను లాక్కుపోయిన పరిణామాల మీద సీబీఐ విచారణ జరపాలని న్యాయస్థానాలను ఈడీ డిమాండ్‌ చేస్తోంది. కోల్‌కతా హైకోర్టులో శుక్రవారం ఈడీ పిటిషన్‌ విచారణకు రాకుండా తృణమూల్‌ పార్టీ కోర్టులో తీవ్ర గందరగోళం సృష్టించి కుట్రచేసిందని కూడా సుప్రీంకోర్టుకు ఆ సంస్థ ఫిర్యాదుచేసింది. ఉద్రిక్తత, గందరగోళం మధ్యన పిటిషన్ల విచారణ సాధ్యం కాని స్థితిలో కోల్‌కతా హైకోర్టు దానిని 14వ తేదీకి వాయిదావేయడంతో సుప్రీంకోర్టును ఈడీ శరణుజొచ్చింది. వద్దువద్దని వారించినా, మా పనిలో జోక్యం మీకు తగదనీ, అది తప్పనీ హితవుచెప్పినా ప్రతీక్‌జైన్‌ ఇంట్లోకి మమత చొరబడ్డారని, తమ బృందానికి నాయకత్వం వహిస్తున్న అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారినుంచి కొన్ని ఎలక్ట్రానిక్‌ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు ఆమె లాక్కుపోయారని ఈడీ ఆరోపణ. తాము సోదాలు జరిపిన ప్రాంగణం నుంచి ఆమె ఎత్తుకెళ్ళిన అన్ని రికార్డులను, ఆధారాలను వెంటనే సీజ్‌ చేయించి, ఫోరెన్సిక్‌ ప్రిజర్వేషన్‌కు ఆదేశించాలని సుప్రీంకోర్టును ఈడీ కోరింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న పశ్చిమబెంగాల్‌లో రాబోయేరోజుల్లో ఇటువంటి దృశ్యాలు, ఇంతకంటే నాటుగా ఉండబోయేవి కూడా అనేకం చూడబోతున్నాం. బొగ్గుకుంభకోణంలో మనీలాండరింగ్‌ కేసు–మరింత లోతైన దర్యాప్తు పేరిట పశ్చిమబెంగాల్లో, అదీ తన పార్టీ రాజకీయవ్యూహాలను తయారుచేసే కన్సెల్టెన్సీలో ఈడీ కాలూనితే వీధిపోరాటాలకు మారుపేరైన మమత వీరంగం వేయకుండా ఉంటారా? పార్టీ కార్యకర్తలను, పోలీసు బలగాలను వెంటబెట్టుకొనిపోయి సోదాలు జరుగుతున్న ప్రదేశంలోకి స్వయంగా చొరబడి ఈడీ అధికారుల నుంచి ఫైళ్ళు లాక్కోవడం ఆమెకు తప్పు అనిపించలేదు. తృణమూల్‌ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే సమాచారాన్నీ, రేపటి ఎన్నికల వ్యూహాలూ విజయ రహస్యాలనూ ఎత్తుకుపోవడమే ఈ దాడి అసలు లక్ష్యం కనుక, ఆ పార్టీ అధినేతగా ఈడీ దొంగిలించిన సమాచారాన్ని రక్షించుకోవడం, తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పెలా అవుతుందని ఆమె ప్రశ్న. ఢీల్లీ, కోల్‌కతాల్లో నిరసనలు, దీక్షలతోపాటు, ఈడీ అధికారులపై బెంగాల్‌ పోలీసులు ఏకంగా కేసులు నమోదుచేయడం... పోరు నష్టం కాదు, రాజకీయంగా లాభమేనన్న ఆమె నమ్మకానికి నిదర్శనం.


శారదా చిట్‌ఫండ్స్‌ కుంభకోణాన్ని దర్యాప్తు చేసిన ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారిని కాపాడుకోవడం కోసం 2019లో మమత ఏకంగా రోడ్డుమీద నిరసనకు కూర్చున్న దృశ్యాలు ఇప్పుడు చాలామందికి గుర్తుకొస్తున్నాయి. కోల్‌కతా పోలీసు చీఫ్‌ రాజీవ్‌కుమార్‌ను అరెస్టు చేయడానికి నలభైమంది సీబీఐ అధికారులు వస్తే, కొందరిని పోలీసు స్టేషన్‌కు తరలించి, మిగతావారిని కదలనివ్వకుండా చేశారామె. స్థానిక సీబీఐ కార్యాలయాన్ని రాష్ట్ర పోలీసులు చుట్టుముట్టి సోదాలు చేయడం, ప్రతిగా కేంద్ర బలగాలు అక్కడకు చేరుకోవడం వంటి దృశ్యాలు అంతవరకూ ఎవరూ చూడనివి, ఊహకు సైతం అందనివి. కోర్టు ఆదేశాలు లేకున్నా సీబీఐని మోదీ ప్రయోగించడం సరైనదే అయితే, నా ప్రతిచర్యలు కూడా సముచితమైనవేనని మమత సమర్థించుకున్నారు. మమత చర్యలు, చేష్టలూ రాజ్యాంగబద్ధం కావన్న వాదన అటుంచితే, బీజేపీ పెద్దలకు దర్యాప్తులు సక్రమంగా సాగడం కంటే, విపక్షనేతలను రాజకీయంగా దెబ్బతీయడం, వాటి నుంచి తాము లబ్ధిపొందడం ముఖ్యమైపోవడంతో ఇటువంటి దృశ్యాలు చూడవలసి వస్తున్నది.

అనేక ఏళ్ళనాటి ఈ కేసులో సరిగ్గా ఎన్నికల ముందు కేంద్రం దాడులు, అరెస్టులకు ఉపక్రమించడం తప్పుడు సందేశాన్ని ఇస్తుంది. పదిహేనేళ్ళుగా అధికారం కోసం అర్రులు చాస్తూ, ఒక్కోమెట్టూ ఎక్కుతూ వచ్చిన బీజేపీ ఈమారు రాష్ట్రాన్ని గెలిచితీరాలన్న పట్టుదలతో పోరాడుతోంది. సదరు కన్సల్టెన్సీ సంస్థ నుంచి తృణమూల్‌ ఎన్నికల వ్యూహాలను తాము తస్కరించలేదన్న ఈడీ వాదన నిజమే అనుకున్నా, సోదాలు జరపడానికి అది ఎంచుకున్న సమయం వల్ల సామాన్యుడికి నమ్మకం కలగదు. ఇక, ఈ తరహా కేసులేవీ తీర్పులవరకూ, శిక్షలవరకూ రాకుండా కేవలం రాజకీయానికి ఉపకరించడమే చూస్తున్నాం. రాజకీయవైరాల మధ్య దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థలకూ, రాష్ట్ర పోలీసు యంత్రాంగాలకూ మధ్య ఘర్షణలు రేగడం సముచితం కాదు.

ఇవి కూడా చదవండి..

డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం

ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2026 | 02:16 AM