Share News

కొత్త జిల్లాలతో సరి..!

ABN , Publish Date - May 08 , 2026 | 12:34 AM

లద్దాఖ్‌లో ఎంతోకాలం తరువాత ఇలా కాలూనడం సంతోషంగా ఉన్నదంటూ వ్యాఖ్యానించి, తమ డిమాండ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా తన పర్యటన...

కొత్త జిల్లాలతో సరి..!

లద్దాఖ్‌లో ఎంతోకాలం తరువాత ఇలా కాలూనడం సంతోషంగా ఉన్నదంటూ వ్యాఖ్యానించి, తమ డిమాండ్ల గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించకుండా కేంద్రహోంమంత్రి అమిత్‌ షా తన పర్యటన ముగించేయడం లద్దాఖీయులకు ఆగ్రహం కలిగించింది. డెబ్బైఐదేళ్ళ తరువాత బుద్ధభగవానుని పవిత్ర అవశేషాలు లద్దాఖ్‌కు తిరిగిచేరిన సందర్భాన్ని చారిత్రక పునఃకలయికగా అభివర్ణించిన ఆయన లద్దాఖ్‌ను సజీవ ధర్మభూమిగా నిర్వచించడమే కాక, దేశ సరిహద్దులను కాపాడటంలో లద్దాఖ్‌, కార్గిల్‌ వాసులు చూపిన దేశభక్తినీ, త్యాగాలను సైతం ప్రశంసించారు. సరిహద్దునుంచి ప్రమాదం పొంచివున్నప్పుడల్లా సైన్యం ప్రవేశానికి ముందే స్థానికులు దేశరక్షణకు నిలబడ్డారని కీర్తించారు. లద్దాఖీయులపై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన వారి సమస్యలు, ఆశలు, ఆకాంక్షల ఊసెత్తకపోవడం అన్యాయం, అక్రమం అని కాంగ్రెస్‌ విమర్శించింది.

హోంమంత్రి పర్యటనకు ముందు లద్దాఖ్‌లో ప్రస్తుతం ఉన్న రెండుజిల్లాలను ఏడు జిల్లాలుగా విస్తరిస్తూ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా నోటిఫికేషన్‌ జారీ చేశారు. దీనిని చరిత్రాత్మకమైన నిర్ణయంగా, లద్దాఖ్‌ అభివృద్ధిపట్ల నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనంగా గవర్నర్‌ అభివర్ణించారు. ఇప్పటివరకూ ఉన్న లెహ్‌, కార్గిల్‌ జిల్లాలనుంచి అదనంగా జన్‌స్కర్‌, ద్రాస్‌, షామ్‌, నుబ్రా, చాంగ్‌థాంగ్‌ అనే ఐదుజిల్లాల సృష్టి స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా జరిగిందేనని ప్రభుత్వం చెబుతోంది. 2024 ఆగస్టులోనే అమిత్‌ షా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం, కొత్తజిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సేవలు మరింత చేరువవుతాయని ప్రధాని ప్రశంసించడం తెలిసిందే. 2019లో 370వ అధికరణని రద్దుచేసి, రాష్ట్రంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన మోదీ ప్రభుత్వం, శాసనసభలేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ను వదిలేసింది. మూడులక్షల లోపు జనాభాతో, భౌగోళిక విస్తృతి రీత్యా దేశంలోనే రెండవ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న లద్దాఖ్‌లో జిల్లాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్న మాట నిజమే. అయితే, ఆ ప్రతిపాదనను అమలు చేయడంలో మత రాజకీయం పనిచేసిందన్న విమర్శలు, అనుమానాలే అధికం. జిల్లాల మధ్య విభజన రేఖలు గీయడంలో ముస్లింలను వేరు చేసే, పరిమితం చేసే లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శకుల వాదన. లద్దాఖ్‌ మొత్తం జనాభాలో దాదాపు నలభైఏడుశాతం ముస్లింలు, నలభైశాతం బౌద్ధులు ఉన్నారు. కార్గిల్‌లో ముస్లిం జనాభా అధికం. ఈ కొత్త విభజన తరువాత, నలభైశాతం ప్రజలకు ఐదుజిల్లాలు, నలభైఏడు శాతానికి రెండుజిల్లాలు దక్కేట్టుగా కేంద్రపాలకులు చక్రం తిప్పారన్నది విమర్శ. పాలనా సౌలభ్యం ఆధారంగానే ఈ జిల్లాల విభజన జరిగిందని పాలకులు అంటున్నప్పటికీ, ముస్లింల ఆధిపత్యం రెండుజిల్లాలకు పరిమితమయ్యేట్టుగా చేయడం వెనుక, రేపటి రోజుల్లో నిధుల కేటాయింపునుంచి ఉపాధి, సంక్షేమం వరకూ పలు విషయాల్లో తమకు అన్యాయం జరిగే ప్రమాదం కూడా ముస్లింలకు కనిపిస్తోంది.


దీనితోపాటు, లద్దాఖ్‌కు రాష్ట్రప్రతిపత్తి కోసం బౌద్ధులు, ముస్లింలు సంఘటితంగా సాగిస్తున్న పోరాటాన్ని బలహీనపరచే లక్ష్యం కూడా ఇందులో ఇమిడివున్నదని లద్దాఖీయుల విమర్శ. తథాగతునిమీద విశ్వాసం కలిగివుండాలని లద్దాఖ్‌వాసులకు హితవుచెప్పిన కేంద్రహోంమంత్రి భారత ప్రభుత్వంమీద వారికి విశ్వాసం పెంచే ప్రకటనలేవీ చేయకపోగా, ఈ జిల్లాల విభజన విధానం సైతం కొత్త అనుమానాలకు దోహదం చేసింది. కార్గిల్‌ను కుదించి, లద్దాఖ్‌ను పెంచి బౌద్ధులు, ముస్లింల మధ్య భౌతికంగా, మానసికంగా దూరాన్ని హెచ్చించి, ఒక సమష్ఠి పోరాటాన్ని బలహీనపరచే కుట్ర జరుగుతోందన్న అనుమానాలకు తావిచ్చింది. లద్దాఖ్‌ను శాసనసభతో కూడిన పూర్తిస్థాయి రాష్ట్రంగా మార్చి, ఇక్కడి సంస్కృతి, భూమి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సహజవనరులు ఇత్యాది రక్షణలకోసం ఆరోషెడ్యూల్‌లో చేర్చాలని లద్దాఖీయులు దీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. ఉద్యమకారుడు, పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను ఆర్నెల్లపాటు జైల్లోకి నెట్టి సాధించిందేమిటో, దేశద్రోహిగా ముద్రవేసిన ఆయనను హఠాత్తుగా ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో పాలకులకు తెలియనిది కాదు. జమ్మూకశ్మీర్‌ విభజన కారణంగా అప్పటివరకూ ఉన్న అన్ని రక్షణలు, హోదాలు, ప్రాతినిథ్యాలు కోల్పోయి తీవ్ర అభద్రతలో ఉన్న లద్దాఖీయులను మరింత దూరం చేసుకోవడం మంచిది కాదు.

ఈ వార్తలు కూడా చదవండి..

డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 12:34 AM